Home / POLITICS / రైతుబంధుపై అన్నాహజారే ప్రశంసలు

రైతుబంధుపై అన్నాహజారే ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంపై సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ప్రశంసల వర్షం కురిపించారు. హెచ్‌ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సుకు అన్నాహజారే హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నాహజారే టీ న్యూస్ తో మాట్లాడుతూ.. రైతుబంధు పథకం రైతుల పాలిట ఆశాదీపం. రైతుబంధు మంచి పథకం. రైతులకు ఇలాంటి పథకం అవసరం. ప్రతి రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా రైతుబంధు గురించి ఆలోచన చేయాలి. సమర్థ నాయకత్వం వల్లే తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది అని అన్నాహజారే పేర్కొన్నారు. తెలంగాణ అమలు చేస్తున్న రైతుబంధు దేశానికి అత్యవసరమని చెప్పారు. అన్ని రాష్ర్టాలు తప్పకుండా రైతుబంధు లాంటి పథకాలు అమలు చేయాలి. కేంద్రానికి వ్యాపారులపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా కేంద్రానికి పట్టింపు లేదు. స్వామినాధన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తున్నామని కేంద్రం అబద్దాలు చెప్తోంది. రైతుబంధు పథకం సముద్రంలో దీపస్తంభం లాంటిది అని అన్నాహజారే పేర్కొన్నారు. వ్యవసాయ అభివృద్ధికి నీరు, నీటి కోసం ప్లానింగ్ తో పాటు పంట ప్రణాళిక, సరైన మార్కెటింగ్ వసతులు కల్పించినప్పుడే రైతుల జీవితాలు బాగుపడుతాయి. కానీ రైతులను పట్టించుకునే వారే కరువయ్యారు అని అన్నా హజారే ఆవేదన వ్యక్తం చేశారు.