Home / NATIONAL / చావు బతుకుల్లో ఉన్నావ్ అత్యాచార బాధిత యువతి…ఈ పాపం బీజేపీదే..!

చావు బతుకుల్లో ఉన్నావ్ అత్యాచార బాధిత యువతి…ఈ పాపం బీజేపీదే..!

గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ఇప్పుడు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది.  ఉన్నావ్‌ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఈ ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆ బాధిత యువత పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇది యాక్సిడెంట్ కాదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే  కుల్‌దీప్ సింగ్ సెంగార్ చేసిన హత్యాయత్నం అని బాధితురాలి బంధువులు అంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే… అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌, అతని అనుచరులు గత ఏడాది తనపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ  ఓ యువతి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటిముందు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన  దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే పోలీసులు ఎమ్మెల్యేను వెనకేసుకువచ్చారు.  ఈ అత్యాచారం కేసులో నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ను స్వయంగా యుపి రాష్ట్ర డిజిపీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ దాచిపెట్టారు. చివరికి నిరసనల నేపధ్యంలో అతన్ని అరెస్టు చేశారు. కాని వీరిద్దరు ప్రెస్‌ మీట్‌లో నిందితుడ్ని గౌరవనీయులు, మానవీయులు అని సంబోధించి తమ ప్రేమను చాటుకున్నారు. ఈ అత్యాచారం కేసులో అలహాబాద్‌ హైకోర్టు స్వయంగా జోక్యం చేసుకుంది.  ఇంత జరుగుతున్నా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని కనీసం మోదీ మందలించలేదు.

పైగా ఉన్నావ్‌ ఘటనలో బాధిత యువతి తండ్రి మారణయుధాలు కలిగివున్నాడని తప్పుడు ఆరోపణలు మోపారు. పోలీసులు కస్టడీలోనే అతను మరణించాడు. బాధితురాలి తండ్రినే కాదు పెదనాన్నను కూడా ఎమ్మెల్యే అనుచరులు హింసించి, చంపారని బాధితురాలు ఆరోపించింది. ఆయన మృతికి ప్రత్యక్ష సాక్షి కూడా తర్వాతి 2నెలలకే అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. బాధిత యువత తండ్రి పోలీస్ కస్టడీలో మరణించడంతో యోగి ప్రభుత్వాన్ని చివరకు కోర్టు మందలించాల్సి వచ్చింది. ఉన్నావ్ ఘటనలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి అని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ కూడా వ్యాఖ్యానించింది. దీంతో  భారీ ఆందోళనల నేపధ్యంలో చివరికి ఎమ్మెల్యేను అరెస్టు చేశారు.

తాజాగా బాధితురాలు, ఆమె బందువులైన ఇద్దరు మహిళలు, లాయర్‌తో కలిసి రాయ్‌బరేలీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మహిళలు మరణించగా, బాధితురాలు, లాయర్‌ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో మరణంతో పోరాడుతున్నారు. ఈ ప్రమాదం సమయంలో బాధితురాలితో ఉండాల్సిన భద్రతా సిబ్బంది ఎందుకు లేరు? కారును ఢీకొట్టిన లారీ నెంబర్ కనపడకుండా నల్ల రంగు ఎందుకు పూశారు ? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆమెను చంపేందుకే ఈ ప్రమాదం చేయించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా ఈ ఆక్సిడెంట్ ఓ కుట్రగా అభివర్ణించాయి.

మరో వైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ మాత్రం ఇది ఆక్సిడెంటేనని ఇందులో ఎలాంటి కుట్ర లేదని సోమవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రక్కు అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని చెప్పారు.  ఉన్నావ్ బాధితురాలి యాక్సిడెంట్‌పై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. బాధితురాలి యాక్సిడెంట్ కావాలని బీజేపీ ఎమ్మెల్యేనే చేయించాడని, ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేశాయి.  దీంతో అన్ని వైపులనుండి పెరుగుతున్న విమర్షలు, ఒత్తిడిలతో మధ్యాహ్నానికల్లా బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్, ఆయన సోదరుడు మనోజ్ సింగ్ సెంగార్, మరో 8 మందిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అత్యాచార ఆరోపణలపై కులదీప్ సింగ్ సెంగార్‌ ప్రస్తుతం జైలులో ఉండగా, ఆయనపైన, ఇతరులపైన తాజా ఘటనలో హత్యాయత్నం, నేరపూరిత కుట్ర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన మామ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.  ఉన్నావ్ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో కేసును సీబీఐ విచారణకు అప్పగించారు. మోదీ హయాంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, మహిళలకు రక్షణ లేదని ఉన్నావ్ బాధితురాలి యాక్సిడెంట్‌తో బీజేపీ నేతల అసలు రంగు బయటపడిందని ఎంపీ అసవుద్దీన్ మండిపడ్డారు.

అత్యాచారానికి గురైన బాధిత యువతికి న్యాయం చేయకపోగా, ఆమె తండ్రిని పొట్టనబెట్టుకుని, చివరకు ఆ బాధిత యువతినే చంపించే దారుణానికి ఒడిగట్టిన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ను కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మొన్న చిన్నారి అసిఫా, నేడు ఉన్నావ్ అత్యాచార బాధిత యువతి యాక్సిడెంట్..ఈ రెండు కేసులను స్వయంగా బీజేపీ ప్రభుత్వ పెద్దలు నీరుగార్చడం గమనార్హం.  ఉన్నావ్ ఘటనపై యుపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా తన పార్టీ ఎమ్మెల్యేనే వెనుకేసురావడం దారుణం. యోగి సర్కార్‌ను కనీసం మందలించే ప్రయత్నం చేయకపోవడం చూస్తుంటే  మహిళల మాన, ప్రాణాలపై  మోదీ సర్కార్‌కు ఎంత చిత్త శుద్ధి ఉందో అర్థమవుతుంది. ఈ పాపం ముమ్మాటికి బీజేపీదే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat