Home / SLIDER / సీఎం కేసీఆర్ సరికొత్త నిర్ణయం

సీఎం కేసీఆర్ సరికొత్త నిర్ణయం

తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం కోసం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ‘60 రోజుల కార్యాచరణ ప్రణాళిక’ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. దీనికోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధం కావాలని సీఎం పిలుపునిచ్చారు. 60 రోజుల కార్యాచరణ అమలులో భాగంగానే పవర్ వీక్, హరితహారం నిర్వహించాలని చెప్పారు. గ్రామ వికాసంలో పంచాయతీ రాజ్ శాఖది చాలా క్రియాశీలకమైన పాత్రకాబట్టి, ఈ శాఖను ప్రభుత్వం సంస్థాగతంగా బలోపేతం చేస్తుందని సీఎం చెప్పారు. పంచాయతీ రాజ్, మండల పరిషత్, జిల్లా పరిషత్ లలోని పోస్టులను భర్తీ చేస్తామని సీఎం వెల్లడించారు. గ్రామాల అభివృద్ధిలో గ్రామ పంచాయతీలు, మండల పరిషతులు, జిల్లా పరిషతులు ఎవరేమి పనులు చేయాలో స్పష్టంగా నిర్వచించుకుని ఎవరి విధులు వారు నిర్వహించాలని చెప్పారు. గ్రామాల వికాసం కోసం ప్రభుత్వం సమగ్ర విధానం తెస్తుందని వెల్లడించారు. గ్రామ పంచాయతీల్లో ఎవరికి ఎలాంటి అధికారాలు, విధులుంటాయో, ఏ విధంగా నిధులు సమకూరుతాయో స్పష్టంగా పేర్కొంటూ పంచాయతీ రాజ్ చట్టం రూపొందించామని, కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తమ విధులు నిర్వర్తించి గ్రామాభివృద్ధికి పాటుపడడానికి ఇది చక్కని అవకాశమని సీఎం అన్నారు. అన్ని గ్రామాల్లో ఆరు నెలల్లో విధిగా స్మశాన వాటికలు(వైకుంఠధామం) నిర్మించాలని చెప్పారు.
గ్రామ పంచాయతీల్లో అమలు చేయాల్సిన 60 రోజల కార్యాచరణ ప్రణాళికపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో అధికారులు, సర్పంచుల సంఘం ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, సీఎస్ శ్రీ ఎస్.కె. జోసి, ముఖ్య కార్యదర్శి శ్రీ ఎస్. నర్సింగ్ రావు, పంచాయతీ రాజ్ కార్యదర్శి శ్రీ వికాస్ రాజ్, కమిషనర్ శ్రీమతి నీతూ ప్రసాద్, మహబూబ్ నగర్, సిద్ధిపేట, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు శ్రీ రొనాల్డ్ రాస్, శ్రీ వెంకట్రామిరెడ్డి, శ్రీ ఎం. సత్యనారాయణ, శ్రీ వి. వెంకటేశ్వర్లు, శ్రీ అమయ్ కుమార్, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాల పంచాయతీ అధికారులు శ్రీ సురేష్ బాబు, శ్రీమతి పద్మజారాణి, శ్రీ రవి కుమార్, శ్రీ వి. వెంకటేశ్వర్లు, రిటైర్ట్ డిపివో శ్రీ లింబగిరి స్వామి, ఈవోపీఆర్ అండ్ ఆర్డీలు శ్రీ బి. శ్రీకాంత్ రెడ్డి, శ్రీ లక్ష్మీ నారాయణ, సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ భూమన యాదవ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీ ప్రణీత్ చందర్, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ మహిపాల్ రెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ధనలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి శ్రీ బాచిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ జంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
‘‘స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా గ్రామాల పరిస్థితి ఇంకా మారలేదు. వివిధ రూపాల్లో ఎన్నో వేల కోట్ల ఖర్చు పెట్టినప్పటికీ ఫలితం కానరావడం లేదు. గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేసి ఉన్నాయి. ఎవరికి వారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను బాగు చేసుకునే పద్ధతి రావడం లేదు. ఈ పరిస్థితిలో గుణాత్మక మార్పు రావాలి. అందుకోసమే కొత్త పంచాయతీ రాజ్ చట్టం తెచ్చాం. అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఖచ్చితమైన బాధ్యతలు పెట్టాం. ఎవరేం పని చేయాలో నిర్దేశించాం. అవసరమైన అధికారాలిచ్చాం. కావాల్సిన నిధులను బడ్జెట్లోనే కేటాయించాం. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా ఈ చట్టం ప్రభుత్వానికి కల్పించింది. కొత్త చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసే విషయంలో ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తుంది. ఎవరినీ ఉపేక్షించదు. గ్రామాల్లో గుణాత్మక మార్పు రావడం ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ఏమి చేయాలో అది చేస్తాం’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
 
‘‘అన్ని జిల్లాలకు జిల్లా పంచాయతీ అధికారులను (డిపిఓ)లను నియమించాలి. ప్రతీ రెవెన్యూ డివిజన్ కు ఒకరు చొప్పున డిఎల్పీవోలను నియమించాలి. ప్రతీ మండలానికి ఒక మండల పంచాయతీ అధికారి (ఎం.పి.ఓ.)ని నియమించాలి. ఇ.ఓ.పి.ఆర్. అండ్ ఆర్.డి. అనే పేరును తీసేసి, ఎంపిఓగా మార్చాలి. ఎంపిడివో, సిఇవో పోస్టులను భర్తీ చేయాలి. పోస్టులను భర్తీ చేయడానికి వీలుగా పంచాయతీ అధికారులకు పదోన్నతులు ఇవ్వాలి. శాఖాపరంగానే కొత్త నియామకాలు చేపట్టాలి. ప్రక్రియ అంతా చాలా వేగంగా జరగాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
 
గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించి, ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం, పరిశుభ్రత పెంచే కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లను ప్రభుత్వమే సరఫరా చేస్తున్నందున గ్రామ పంచాయతీలపై పెద్ద భారం దిగిపోయిందని, కరెంటు, సాగునీటి కల్పన, చెరువుల పునరుద్ధరణ, రోడ్ల నిర్మాణం, విద్య, వైద్యం లాంటి ప్రధాన పనులన్నీ ప్రభుత్వమే నేరుగా చేస్తున్నదని, గ్రామ పంచాయతీలు పచ్చదనం, పరిశుభ్రతపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 60 రోజుల తర్వాత ముఖ్య అధికారుల నేతృత్వంలోని 100 ఫ్లయింగ్ స్వ్కాడులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, ఆకస్మిక తనిఖీలు చేస్తాయన్నారు. ఏ గ్రామంలో అయితే 60 రోజుల కార్యాచరణలో నిర్దేశించిన పనులు చేపట్టలేదో అక్కడ సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు.
60 రోజుల కార్యాచరణలో చేపట్టాల్సిన పనులు:
—————————————————
• గ్రామంలో పారిశుధ్య పనుల నిర్వహించాలి. ఎక్కడా చెత్తా చెదారం కనిపించవద్దు. మురికి కాల్వలన్నీ శుభ్రం చేయాలి
 
• గ్రామ పరిధిలోని పాఠశాలలు, వైద్య శాలలు, అంగన్ వాడీ కేంద్రాలతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలలో పారిశుధ్య పనులు నిర్వహించడం గ్రామ పంచాయతీల బాధ్యత
• కూలిపోయిన ఇండ్లు, పాడైపోయిన పశువుల కొట్టాల శిథిలాలను పూర్తిగా తొలగించాలి
 
• ఉపయోగించని, పాడుపడిన బావులను, నీటి బొందలను పూర్తిగా పూడ్చేయాలి. ఇందుకోసం మొరం నింపడానికి నరేగా నిధులు వినియోగించుకోవాలి. ఎప్పటికప్పుడు గ్రామంలో దోమల మందు పిచికారి చేయాలి
 
• సర్కారు తుమ్మ, జిల్లేడు లాంటి పిచ్చి మొక్కలను వందకు వంద శాతం తొలగించాలి
 
• లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
 
• వైకుంఠధామం (స్మశాన వాటిక) నిర్మాణం కోసం అనువైన స్థలాలను ఎంపిక చేయాలి
• గ్రామ డంపింగ్ యార్డు కోసం స్థలం సేకరించాలి
 
• విలేజ్ కమ్యూనిటీ హాల్, విలేజ్ గోదాము నిర్మాణానికి స్థలాలు సేకరించాలి
 
• గ్రామానికి కావాల్సిన వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించాలి (ప్లాన్ యువర్ విలేజ్). ఆ గ్రామంలో ఉన్నదేమిటి? కావాల్సిందేమిటి? దానికోసం ఏం చేయాలి? అనేది ప్రణాళికలో ఉండాలి. వార్షిక, పంచవర్ష ప్రణాళికలు వేర్వేరుగా ఉండాలి
 
పవర్ వీక్ లో చేయాల్సిన పనులు:
————————————–
• 60 రోజుల కార్యాచరణలో భాగంగా ఏడు రోజుల పాటు పూర్తిగా విద్యుత్ సంబంధమైన సమస్యలను పరిష్కరించాలి
 
• ఆ గ్రామంలో వీధిలైట్ల కోసం ఎంత కరెంటు వాడుతున్నారో ఖచ్చితమైన నిర్థారణకు రావాలి. మీటర్లు పెట్టాలి. వీధిలైట్ల కోసం థర్డ్ లైను వేయాలి. విధిగా ఎల్.ఇ.డి. బల్బులు అమర్చాలి
 
• గ్రామంలో ఒంగిపోయిన స్తంభాలను సరిచేయాలి. వేలాడే వైర్లను సరిచేయాలి. కర్ర, ఇనుమ స్తంభాలను తొలగించి, సిమెంటు స్తంభాలను ఏర్పాటు చేయాలి
 
తెలంగాణకు హరితహారంలో చేయాల్సిన పనులు:
——————————————————
• గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే విలేజ్ నర్సరీ ఏర్పాటు చేయాలి. మండల అటవీశాఖాధికారి సాంకేతిక సహకారం తీసుకోవాలి. నరేగా నిధులు వినియోగించాలి
• గ్రామంలో విరివిగా మొక్కలు నాటాలి. వాటికి నీళ్లు పోసి, రక్షించాలి. పెట్టిన మొక్కలన్నీ చెట్లుగా ఎదిగే వరకు బాధ్యత తీసుకోవాలి
 
• ఇంటి యజమానులు, రైతులతో మాట్లాడి వారికి ఏ రకం చెట్లు కావాలో ముందే తెలుసుకుని, ఆ మొక్కలను సరఫరా చేయాలి
 
• చింతచెట్లను పెద్ద సంఖ్యలో పెంచాలి
 
గ్రామ పంచాయతీలు నిర్వహించాల్సిన బాధ్యతలు:
——————————————————-
• గ్రామంలో వందకు వందశాతం పన్నులు వసూలు చేయాలి. ఇది గ్రామ కార్యదర్శి బాధ్యత
 
• వారాపు సంత (అంగడి)లో సౌకర్యాలు కల్పించాలి
 
• వివాహ రిజిస్ట్రేషన్ నిర్వహించాలి. గ్రామంలో ఎవరు పెళ్లి చేసుకున్నా వెంటనే రికార్డులో నమోదు చేసుకోవాలి
 
• జనన, మరణ రికార్డులు రాయాలి. పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు, కులం వివరాలతో సహా బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలి
 
• విద్యుత్ సంస్థలకు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలి
 
• గ్రామ పంచాయతీ నిధులతో నరేగా నిధులు అనుసంధానం అయ్యే విధానం రూపొందించాలి
 
• ఆయా ప్రాంతాల్లోని పరిశ్రమలు, ఇతర కంపెనీలతో సంప్రదించి, సిఎస్ఆర్ నిధులను గ్రామాభివృద్ధికి ఉపయోగించే విధానం అవలంభించాలి
 
• గ్రామస్తులను శ్రమదానానికి ప్రోత్సహించి, సామాజిక పనులు చేయాలి
 
• ప్రతీ 2వేల జనాభాకు ఒకటి చొప్పున వైకుంఠధామం నిర్మించాలి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat