Home / SLIDER / జాతరమ్మ జాతర… మేడారం జాతర!

జాతరమ్మ జాతర… మేడారం జాతర!

ఏదయినా ఊళ్లో జాతర జరిగితే… ఊరంతా ఒక్కటవుతుంది. కలిసికట్టుగా సంబరాలు చేసుకుంటుంది. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు మాత్రం… ప్రపంచమే కదిలి వస్తుంది. కుంభమేళా తరువాత దేశంలో జరిగే అతిపెద్ద జాతర ఇదే మరి. కన్నులపండువగా జరిగే ఈ గిరిజనుల వేడుక వెనుక చెప్పుకోదగ్గ విశేషాలు చాలానే ఉన్నాయి. మాఘమాసంలో నాలుగురోజులపాటు అంగరంగవైభవంగా జరిగే మేడారం జాతర వెనుక ఓ కథ ప్రాశస్త్యంలో ఉంది. ఒకప్పుడు మేడారానికి చెందిన కొందరు కోయదొరలు గోదావరీ తీరంలోని అడవికి వేటకు వెళ్లినప్పుడు అక్కడో పాప పులుల మధ్య ఆడుకుంటూ కనిపించిందట. ఆ పాపను తీసుకొచ్చి మాఘశుద్ధ పౌర్ణమిరోజున సమ్మక్క అని పేరు పెట్టారట. ఆమె గ్రామానికి వచ్చినప్పటి నుంచీ పాముకాటుకి గురయిన వాళ్లను తన మహిమలతో బతికించేదట. సంతానం లేనివారికి పిల్లలు పుట్టించేదట. దాంతో ఊరంతా ఆమెను వనదేవతగా భావించేదట. ఆ రోజుల్లో మేడారం ప్రాంతాన్ని కాకతీయుల సామంతుడు పగిడిద్దరాజు పాలించేవాడు. అతడితో సమ్మక్క పెళ్లయ్యింది. తరువాత ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. సారలమ్మ మనువు గోవిందరాజులుతో జరిగింది. కొన్నాళ్లకు ఆ ఊరిని కరవు రక్కసి అల్లకల్లోలం చేసింది.

మూడేళ్లపాటు కరవు బారిన పడిన ఆ ఊరి ప్రజలు కాకతీయులకు కప్పం కట్టలేదు. దాంతో ప్రభుత్వం తండాలపై సమరశంఖం పూరించింది. ఇది తెలిసిన గిరిజనులూ పోరాడేందుకు సిద్ధపడ్డారు. ములుగు సమీపంలోని లక్నవరం సరస్సు వద్ద గిరిజనులు కాకతీయ సేనను ఎదురొడ్డి పోరాడారు. పగిడిద్దరాజు అతని కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు… మేడారం సరిహద్దులోని సంపెంగవాగు వద్ద శత్రువుల్ని నిలువరించే ప్రయత్నంలో నేలకూలారు. ఓటమి భారాన్ని తట్టుకోలేక పగిడిద్దరాజు కుమారుడు జంపన్న సంపెంగవాగులో ఆత్మార్పణ చేసుకున్నాడు. ఆ వీరుడి స్మృతి చిహ్నంగా అది జంపన్నవాగయ్యింది. ఈ దుర్వార్తలతో సమ్మక్క మొదట కుంగిపోయినా… మరు నిమిషంలోనే రౌద్రమూర్తిలా మారి కత్తిపట్టి యుద్ధానికి బయలుదేరింది. వీరోచితంగా పోరాడింది. కాకతీయులు ఓడిపోయే దశలో ఉన్నప్పుడు ఓ సైనికుడు సమ్మక్కను వెన్నుపోటు పొడిచి పారిపోయాడు. రక్తమోడుతూ మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్లవైపు వెళ్లిన సమ్మక్క మలుపు ప్రాంతంలో మాయమైపోయింది. విషయం తెలిసిన కోయగూడెం దివిటీలు పట్టి గాలిస్తే గుట్టమీదున్న నెమలినార చెట్టుకింది పుట్ట దగ్గర ఓ కుంకుమభరిణ కనిపించింది.

అంతలోనే ‘కుతంత్రాలతో సాధించిన రాజ్యం వీరభోజ్యం కానేకాదు.

ఈ గడ్డ మీద పుట్టిన ప్రతివ్యక్తీ వీరుడిగానే రాజ్యాన్ని సంపాదించాలి. ఈ స్థలంలో రెండు గద్దెలు కట్టించి రెండేళ్లకోసారి ఉత్సవం జరిపిస్తే భక్తుల కోరికలు నెరవేరుస్తా…’ అంటూ ఆకాశవాణి వినిపించింది. గిరిజనులు అదే అమ్మ ఆదేశంగా భావించారు. కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దుచేసి, సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు. రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలంటూ ఆదేశాలు జారీచేశాడు. అలా మొదలయ్యింది సమ్మక్క, సారలమ్మ జాతర.

నాలుగురోజుల వేడుక…

ఈ ఏడాది ఫిబ్రవరి 5-8 వరకూ నాలుగురోజులపాటు జరగనుందీ జాతర. అంతకన్నా పదిరోజుల ముందునుంచే పూజలు మొదలుపెట్టి వేర్వేరు ప్రాంతాల నుంచి దేవతామూర్తులను తీసుకువస్తారు. జాతరకు వచ్చే భక్తులు తొలుత ఊరి పొలిమేరలోని జంపన్నవాగులో స్నానం చేస్తారు. ఆ వాగు ఒడ్డునే జంపన్న గద్దె ఉంటుంది. ఆ తరువాతే సమ్మక్క సారలమ్మల దర్శనానికి బయలుదేరతారు. ఈ వేడుకలో వెదురుకర్ర, కుంకుమభరిణలే ఉత్సవమూర్తులు. మొదటిరోజు సారలమ్మ ఆమె భర్త గోవింద రాజులు, తండ్రి పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరుకుంటారు.

సారలమ్మను కన్నెపల్లి గ్రామం నుంచి మేళతాళాలతో ఆరుగురు పూజారులు ఊరేగింపుగా తీసుకువస్తారు. జాతరకు రెండురోజుల ముందే కొత్తగూడ మండలం, పోనుగుండ్లలోని మరో పూజారి బృందం పగిడిద్దరాజుతో బయలుదేరుతుంది. సారలమ్మ భర్త గోవిందరాజులును ఏటూరు నాగారం ప్రాంతంలోని కొండాయి గ్రామం నుంచి కాక వంశస్థులు తీసుకొస్తారు. చివరగా సమ్మక్కను కుంకుమభరిణ రూపంలో చిలుకల గుట్టకు చెందిన కొక్కెర వంశస్థులు ఎలాంటి ఆర్భాటాలూ లేకుండా తీసుకువచ్చి గద్దెమీద ప్రతిష్ఠిస్తారు. వెదురుబొంగుతో చేసిన మొంటెలో గిరిజనులు తయారుచేసిన కుంకుమవేసి దాన్ని చిన్నపిల్లాడి నెత్తిన పెట్టి తీసుకువస్తారు. ఆ సమయంలో అధికారిక లాంఛనాలతో గాల్లోకి తుపాకీని పది రౌండ్లు పేలుస్తూ సమ్మక్కకు ఆహ్వానం పలుకుతారు. అప్పుడు కోరికలు కోరుకుంటే నెరవేరతాయని భక్తుల నమ్మకం. దేవత రాకతో ఆ ప్రాంతం శివసత్తుల శివాలతో దద్దరిల్లిపోతుంది. మూడోరోజున అమ్మవారి గద్దెను దర్శించి బెల్లం, ధన, వస్తు, ఆభరణాల మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారికి నైవేద్యం పెట్టే బెల్లాన్ని బంగారంగా పిలుస్తారు. నాలుగోరోజున అమ్మలిద్దరూ అధికారక లాంఛనాలతో తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం జాతర ముగుస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat