Home / ANDHRAPRADESH / ఇవాళ పలు సంక్షేమ పథకాలపై సీఎం జగన్ రివ్యూ.. బిజీ బిజీగా

ఇవాళ పలు సంక్షేమ పథకాలపై సీఎం జగన్ రివ్యూ.. బిజీ బిజీగా

రాష్ట్రానికి ఒక తండ్రిలా ఆలోచించాను కాబట్టే పలు నిర్ణయాలు తీసుకున్నానని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌ సహా విద్యా రంగంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన వెల్లడించారు. అత్యుత్తమ విద్యతోనే పేద కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, తద్వారా దారిద్య్ర నిర్మూలన సాధ్యమని ఆయన పేర్కొన్నారు. కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్‌ తరాలకు అన్యాయం జరుగుతుందన్న ఆయన, అలా నిర్ణయాలు తీసుకోకపోయినా నష్టం జరుగుతుందని అన్నారు. ఆ దిశలోనే పరిపాలన వికేంద్రీకరణపై నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.
అమరావతిలో ఎప్పటికీ లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ కొనసాగుతుందని, ఏటా రెండు నెలలకు పైగా మొత్తం ఎమ్మెల్యేలు ఇక్కడే ఉంటారని, క్రమంగా అమరావతి కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని సీఎం చెప్పారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖ నగరానికి అన్ని అర్హతలున్నాయన్న ఆయన, అందుకే అక్కడ పరిపాలనా యంత్రాంగం ఉండబోతుందని తెలిపారు. శ్రీబాగ్‌ ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకునే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయబోతున్నామని, తద్వారా రాయలసీమ ప్రాంతానికి కూడా తగిన న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి వివరించారు.
‘ఎక్సెలెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ అన్న అంశంపై ‘ది హిందూ’ పత్రిక విజయవాడలో ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యా రంగంలో తీసుకువస్తున్న మార్పులతో పాటు, ఏపీ రాజధానిపై ఆయన మరోసారి స్పష్టతనిచ్చారు. ఒక కుటుంబానికి తండ్రి పెద్ద అయితే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి తండ్రి వంటి వాడన్న ఆయన, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అందరి సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదని చెప్పారు.

నిరక్షరాస్యత–దారుణంగా జీఈఆర్‌
‘ఎక్సెలెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ అంటే ఏమిటి’ అంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, రాష్ట్రంలో అక్షరాస్యతను ప్రస్తావించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 33 శాతం నిరక్షరాస్యులున్నారని, అదే సమయంలో జాతీయ స్థాయిలో అది కేవలం 27 శాతం మాత్రమే అని చెప్పారు.
18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండి, ఇంటర్‌ తర్వాత కళాశాలల్లో చేరుతున్న వారికి సంబంధించిన ‘గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో’ (జీఈఆర్‌)లోనూ పరిస్థితి దారుణంగా ఉందన్న సీఎం, ఆ గణంకాలు వివరించారు. ‘బ్రిక్స్‌’ దేశాలతో సమానంగా మన ఆర్ధిక వ్యవస్థ కొనసాగుతోందని చెప్పారు.
రష్యాలో జీఈఆర్‌ 81 శాతం కాగా, చైనాలో 50 శాతం ఉందని, బ్రెజిల్‌లో కూడా దాదాపు 50 శాతం జీఈఆర్‌ ఉండగా, భారత్‌లో అది కేవలం 23 శాతం మాత్రమే అని పేర్కొన్నారు. అంటే 77 శాతం పిల్లలు ఇంటర్‌ తర్వాత కళాశాలలకు వెళ్లడం లేదని తెలిపారు.

ఇంగ్లిష్‌ లగ్జరీ కాదు- అవసరం
పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో సెల్‌ఫోన్లు, ఐప్యాడ్‌లు, కంప్యూటర్లు వచ్చాయని, వాటన్నింటిలో ఇంగ్లిష్‌ భాషనే వాడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. కాబట్టి ఈరోజుల్లో ‘ఇంగ్లిస్‌ ఒక లగ్జరీ కాదు. అది అవసరం’ అని స్పష్టం చేశారు. మంచి ఉద్యోగం కావాలంటే ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం తప్పనిసరి అని చెప్పారు.
‘ఇవాళ ఒకటో తరగతిలో చేరుతున్న ఒక విద్యార్థి డిగ్రీకి వచ్చే సరికి 20 ఏళ్లు అవుతుంది. అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. అప్పటికి కనీసం డ్రైవర్ల అవసరం కూడా ఉండదు’ అని సీఎం అన్నారు.

ఒక తండ్రిగా ఏం చేస్తాం?
ఒక కుటుంబానికి తండ్రి పెద్ద అయితే, రాష్ట్రానికి సీఎం తండ్రి వంటి వాడని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘నేను ఒక సీఎంగా కాకుండా, ఒక తండ్రిగా.. నా పిల్లలను ఏ స్కూల్‌కు పంపిస్తాను? చెప్పండి. తెలుగు మీడియమ్‌లో చేర్పిస్తామా? లేక ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చేర్పిస్తామా?’ అని ప్రశ్నించిన ఆయన, మనం అలా ఆలోచించినప్పుడు పేద కుటుంబాల పిల్లలు ఎందుకు ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదవకూడదు అని ప్రస్తావించారు.

వారి జీవన ప్రమాణాలు పెరగాలంటే?
రాష్ట్రంలో 98.5 శాతం ప్రైవేటు పాఠశాలలు ఇంగ్లిష్‌ మీడియమ్‌లోనే ఉన్నాయన్న ముఖ్యమంత్రి మరి అక్కడ తెలుగు మీడియమ్‌ ఎందుకు లేదని అన్నారు. మంచి విద్య వల్లనే నిరుపేద కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, దారిద్య్రం పోతుందని చెప్పారు. పేద కుటుంబాల జీవన ప్రమాణాలు పెరగాలంటే, వారూ ఈ పోటీని ఎదుర్కోవాలని, వారూ బాగా చదువుకోవాలని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో ఒక డ్రైవర్, ఒక గార్డెనర్‌ సైతం వచ్చి ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని అన్నారు. ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే ఆ గౌరవం వేరుగా ఉంటుందని చెప్పారు.

విద్యా వ్యవస్థలోనే మార్పులు
వీటన్నింటి నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌తో పాటు, మొత్తం విద్యావ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు జీరో కాస్ట్‌ విద్యను అందిస్తున్నాయని, అంటే పేద పిల్లలకు జీరో కాస్ట్‌లో ఇంగ్లిష్‌ మీడియమ్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
ఈ ఏడాది ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెడుతున్నామని, అదే సమయంలో తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌ చేశామని చెప్పారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే కాకుండా, ప్రైవేటు స్కూళ్లలో కూడా తెలుగు ఒక సబ్జెక్ట్‌గా ఉండాలని నిర్దేశిస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది 7వ తరగతి, ఆ తర్వాత 8వ తరగతి, ఆ తర్వాత ఏడాది 9వ తరగతి, ఆ మరుసటి ఏడాది 10వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియమ్‌ అమలు చేస్తామని పేర్కొన్న ఆయన, అంటే మొత్తం నాలుగేళ్ల సమయం ఉంటుందని గుర్తు చేశారు.
ఇదే సమయంలో టీచర్లకు బ్రిడ్జి కోర్సులు కూడా నిర్వహిస్తామని, ఈ ప్రక్రియలో భాగంగా మంచి కరికులమ్‌ కోసం పెద్ద పెద్ద సంస్థలతో అవగాహన కుదుర్చుకుంటున్నామని చెప్పారు. ఈ దిశలో ప్రయాణం ఇప్పుడే మొదలైందని అన్నారు.

4 రకాల కార్యక్రమాలు
విద్యా రంగం, పాఠశాలలకు సంబంధించి మొత్తం నాలుగు రకాల కార్యక్రమాలు చేపడుతున్నామన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్, అందులో మొదటిది ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌ అని చెప్పారు.
నాడు–నేడు
రెండో కార్యక్రమం నాడు–నేడు అన్న ఆయన, రాష్ట్రంలో దాదాపు 45 వేల స్కూళ్లు ఉండగా, వాటిలో ఏటా 15 వేల చొప్పున మొత్తం మూడు దశల్లో పూర్తిగా మార్చబోతున్నట్లు వెల్లడించారు.
బాత్‌రూమ్‌లు, పరిశుభ్రమైన తాగు నీరు, ప్రహరీ, ఫర్నీచర్, ఫ్యాన్లు, బ్లాక్‌ బోర్డులు, పెయింటింగ్, ఫినిషింగ్‌.. ఇంకా ప్రతి స్కూల్‌లో ఇంగ్లిష్‌ ల్యాబ్‌. ఈ విధంగా 9 రకాల పనులు చేసి, ఆ స్కూళ్ల స్థితిగతులను పూర్తిగా మార్చబోతున్నామన్న సీఎం, ఈ ఏడాది 15715 స్కూళ్లు అందుకు ఎంపిక చేసినట్లు చెప్పారు.
మధ్యాహ్న భోజనం
ఇప్పటి వరకు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం దారుణంగా ఉందని, తన సుదీర్ఘ పాదయాత్రలో దాన్ని స్వయంగా చూశానని తెలిపారు. ఇప్పుడు ఆ భోజనాన్ని పూర్తిగా మార్చడమే కాకుండా, ఆయాలకు మంచి గౌరవ వేతనం ఇస్తున్నామని, అదే విధంగా భోజన నాణ్యత పెంచుతూ, రోజుకో రకమైన మెనూ అమలు చేస్తున్నామని తెలిపారు.
అమ్మ ఒడి
ఇక నాలుగో కార్యక్రమంలో భాగంగా, పిల్లల తల్లులను మోటివేట్‌ చేస్తున్నామని, రాష్ట్రంలో దాదాపు 42.32 లక్షల తల్లులు, తద్వారా 81 లక్షలకు పైగా పిల్లలకు ప్రయోజనం కలిగేలా ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు.
పిల్లలను బడికి పంపించే తల్లులకు ఏటా రూ.15 వేలు ఇస్తున్నామన్న సీఎం, ఈ పథకంలో లబ్ధి కోసం ఈ ఏడాది ఎలాంటి నియమం లేకపోయినా, వచ్చే ఏడాది నుంచి కనీసం 75 శాతం హాజరు తప్పనిసరి చేస్తున్నామని చెప్పారు.
‘ప్రతి పిల్లవాడు స్కూల్‌కు పోవాలి. ఇంగ్లిష్‌ మీడియమ్‌ చదవాలి. చక్కగా ఇంగ్లిష్‌లో మాట్లాడగలగాలి. ఆ విధంగా వారి జీవితాలు మారాలి. ఆ కుటుంబాల
జీవితాలు మెరుగుపడాలి’ అని పేర్కొన్న సీఎం, ఆ విధంగా 12వ తరగతి వరకు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతామని వివరించారు.

కొత్త పాఠ్యప్రణాళిక
కరికులమ్‌లోనూ మార్పులు చేస్తున్నామని, ఇక నుంచి డిగ్రీ మూడేళ్లు కాకుండా, నాలుగేళ్లు ఉంటుందని, ఇంజనీరింగ్‌ కూడా నాలుగేళ్లు కాకుండా 5 ఏళ్లు ఉంటుందని సీఎం వెల్లడించారు. అన్ని డిగ్రీలు ‘హానర్స్‌’ గా మారుతాయని, అన్నింటిలో చివరి ఏడాది తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్‌ ఉంటుందని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశలు మెరుగుపడతాయని చెప్పారు.

విద్యా దీవెన- వసతి దీవెన
విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తామన్న సీఎం, ఆ విధంగా వారికి విద్య పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇదొక్కటే కాకుండా విద్యార్థుల లాడ్జింగ్, బోర్డింగ్‌ అవసరాల కోసం ఏటా రూ.20 వేలు ఇవ్వబోతున్నామని చెప్పారు. ఏటా జనవరి, ఫిబ్రవరిలో రూ.10 వేలు, ఆ తర్వాత జూలై, ఆగస్టులో మరో రూ.10 వేలు ఇస్తామని వెల్లడించారు. అవే విద్యా దీవెన, వసతి దీవెన అని వివరించారు.
‘నాణ్యమైన విద్య అనేది పిల్లలకు మనమిచ్చే ఒక ఆస్తి. దాని వల్ల దారిద్య్రం పోతుంది. పేద కుటుంబాలు కూడా ఎంతో వృద్ధిలోకి వస్తాయి. వీటన్నింటి ద్వారా విద్యా రంగంతో పాటు, పేద కుటుంబాలలో కూడా మార్పులు తీసుకువస్తున్నాము’ అని సీఎం పేర్కొన్నారు.

రాళ్లు వేస్తున్నారు!
ఇన్ని మంచి పనులు చేస్తున్నా కొందరు అనవసరంగా రాళ్లు వేస్తున్నారన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్, తాను వారిని ఒకటే ప్రశ్న అడుగుతున్నానన్నారు.
‘మీరు మీ పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను ఏ మీడియంలో చదివిస్తున్నారు?. ఒకవేళ మీరు మీ పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలో చదివిస్తుంటే, మీరు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టవద్దు’ అని తేల్చి చెప్పారు.

నిర్ణయాలు తప్పనిసరి
సదస్సుకు ముందు ‘ది హిందూ’ గ్రూప్‌ చైర్మన్‌ శ్రీ ఎన్‌.రామ్‌ గారితో బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ సందర్భంగా ఆసక్తికర చర్చ జరిగిందని సీఎం తెలిపారు. తను ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగానని తెలిపారు.
‘ఒక సీఎంగా ఎన్నో అధికారాలు ఉంటాయి. అలాగే బాధ్యతలు కూడా ఉంటాయి. కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే, భవిష్యతు తరాలకు నష్టం జరుగుతుంది. అదే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోకపోయినా భావి తరాలకు నష్టం జరుగుతుంది’ అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.

పరిపాలన వికేంద్రీకరణ
అందుకే మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోకపోతే వచ్చే తరాలకు అన్యాయం, నష్టం జరుగుతుందన్న సీఎం, ఇప్పుడున్న అమరావతి అటు విజయవాడకు కానీ, అటు గుంటూరుకు కానీ దగ్గరగా లేదని, అక్కడికి కనీసం డబుల్‌ రోడ్డు కూడా లేదని, అంతా సింగిల్‌ లైన్‌ రోడ్డు మాత్రమే ఉందని చెప్పారు.
‘అయినా ఆయన (విపక్షనేత)కు ఆ ప్రాంతంపై ఎందుకంత ఆసక్తి అంటే.. అందరికి తెలుసు, ఆయనకు, ఆయన అనుయాయులకు అక్కడ ఎన్నో భూములున్నాయి’ అని సీఎం గుర్తు చేశారు.

రూ.1.09 లక్షల కోట్ల వ్యయం
‘అమరావతిలో రాజధాని కోసం 53 వేల ఎకరాలు లాండ్‌ పూలింగ్‌లో సేకరించారు. అక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేవు. రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్, నీరు వంటి కనీస సదుపాయాలు కల్పించాలంటేనే గత ప్రభుత్వ నివేదికల ప్రకారం ఒక్కో ఎకరాకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికే రూ.2 కోట్లు ఖర్చవుతాయి. అంటే 53 వేల ఎకరాలకు మొత్తం రూ.1.09 లక్షల కోట్లు అవుతాయి’.
‘కానీ గత ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఎంత ఖర్చు చేసిందో తెలుసా? కేవలం రూ.5677 కోట్లు మాత్రమే. ఇంకా మా ప్రభుత్వంపై సుమారు రూ.2300 కోట్లు భారం వేసి వెళ్లిపోయారు. చేసిన ఆ పనులకు కూడా 10.32 శాతం వడ్డీతో రుణం తెచ్చారు. కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చింది. అందుకే ఇక్కడ పెట్టుబడి కోసం తప్పనిసరిగా రుణాలకు వెళ్లాల్సిందే. ఈ పరిస్థితుల్లో ఏ సీఎం అయినా ఏం చేస్తారు?’ అని శ్రీ వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు.

సముద్రంలో నీటి బొట్టు
‘అమరావతిలో కనీస సదుపాయాల కోసం ఇంకా రూ.1.06 లక్షల కోట్లు కావాలి. కానీ ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు మించి ఖర్చు చేసే పరిస్థితి లేదు.
కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఆ చేసే వ్యయం సముద్రంలో నీటి బొట్టు మాదిరిగా ఉంటుంది’ అని ముఖ్యమంత్రి పోల్చారు.

విశాఖ–అర్హత
ఇక విశాఖ ఏపీలో నెంబర్‌ 1 నగరం అని, అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయని, రోడ్లు, నీరు, విద్యుత్‌ వంటి అన్ని సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. కాబట్టి అమరావతిలో ఖర్చు చేయాల్సిన లక్ష కోట్లలో కనీసం 10వ వంతు ఖర్చు విశాఖలో చేస్తే, వచ్చే 10 ఏళ్లలో ఆ నగరం హైదరాబాద్‌తో పోటీ పడుతుందని, ఉద్యోగాల కోసం పిల్లలు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం రాదని వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని తాము పని చేస్తున్నామని సీఎం తెలిపారు.

అమరావతి
అమరావతి లెజిస్లేటివ్‌ రాజధానిగా తప్పనిసరిగా కొనసాగుతుందని, ఇక్కడే ఏటా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని, 60 నుంచి 70 రోజుల పాటు ఎమ్మెల్యేలంతా వస్తారని, వారు ఇక్కడే ఉంటారని చెప్పారు. అందువల్ల అమరావతి కూడా క్రమంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
విశాఖపట్నం రాష్ట్రంలోనే నంబర్‌ ఒన్‌సిటీ. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అవుతుంది. సీఎం, మంత్రులు అక్కడే ఉంటారు. సచివాలయం అక్కడనుంచే పనిచేస్తుంది. హెచ్‌ఓడీలు కూడా పనిచేస్తారు. ఇప్పటికే కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉంది.

జ్యుడీషియల్‌ క్యాపిటల్‌
‘ఇక మూడో అంశం.. జ్యుడీషియల్‌ క్యాపిటల్‌. రాయలసీమ, కర్నూలులో హైకోర్టు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 1953 నుంచి 1956 వరకు కర్నూలు రాష్ట్ర రాజధానిగా కొనసాగింది. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని ఏర్పాటు చేశారు. వికేంద్రీకరణ జరగాలని, సీడ్స్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ స్పి›్లట్‌ æ కావాలని ఆనాడే నిర్ణయించారు. కర్నూలులో రాజధాని ఏర్పాటు చేశారు. అందుకే అక్కడ జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ను ఏర్పాటు చేస్తున్నాము. ఈ విధంగా అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తున్నాము. ఒక సీఎంగా వచ్చే తరాలకు కూడా నేను బా«ధ్యుడిని’ అని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

అసలు ఎంత ఖర్చవుతుంది?
‘ఇవాళ ప్రభుత్వం వద్ద అమరావతిలో పెట్టుబడి కోసం నిధులు లేవు? మరి ఇక్కడ 5 ఏళ్లు ఉన్న తర్వాత కూడా పరిస్థితి మారదు. అలాంటప్పుడు ఏం చేయాలి? లక్ష కోట్లు పెట్టుబడి 20 ఏళ్ల తర్వాత తడిసి మోపెడై 3 లక్షల కోట్లు అవుతాయి’.
‘ఇక్కడ లాండ్‌ బ్యాంకింగ్‌ చాలా ఉందని చంద్రబాబు చెబుతున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) నిబంధనల ప్రకారం పరిధి మినహాయిస్తే, నికరంగా ఉన్న భూమి కేవలం దాదాపు 5200 ఎకరాలు మాత్రమే. ఆ భూమి ద్వారా లక్ష కోట్లు రావాలంటే, అదే 20 ఏళ్ల తర్వాత మూడు లక్షల కోట్లు, లేక నాలుగు లక్షల కోట్లు కావాలంటే ఎకరం భూమి దాదాపు.. 90 కోట్లకు అమ్మాలి. ఇది సా«ధ్యమేనా?’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
చివరగా..
రాష్ట్రానికి ఒక తండ్రిగా తన వంతుగా శాయశక్తులా న్యాయం చేశానంటూ సీఎం ప్రసంగం ముగించారు. ఆ తర్వాత ఇంటరాక్షన్‌ పర్వం కొనసాగింది.

ముఖ్యమంత్రితో సదస్సులో పాల్గొన్న వారి ఇంటరాక్షన్‌:
డాక్టర్‌ టీవీఏ శర్మ, ఫిజీషియన్‌:
– ‘నా సబ్జెక్ట్‌ కాకపోయినా సీఎంను అభినందించడానికి ఇక్కడికి వచ్చాను. సీఎం గారు మీ ప్లానింగ్‌ చాలా బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్‌ కూడా అలాగే ఉండాలి. మాజీ సీఎం మాదిరిగా ఉండకూడదు. ఆయన అధికారం చేపట్టినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఏం జరిగిందో చూశాం. కాబట్టి మీరు అలా కాకూడదు.
ఆర్థిక పుష్టి ఎలా సాధిస్తారు?’.

ముఖ్యమంత్రి:
– ‘లక్ష కోట్లలో కేవలం 10 శాతం మాత్రమే ఖర్చు చేస్తామని చెబుతున్నాము. మేము ప్రజలకు బాహుబలి సెట్టింగ్‌లు, గ్రాఫిక్స్, సింగపూర్, జపాన్‌ వంటి దేశాలను చూపబోము. వాస్తవాలనే చెబుతాము. వాటినే చూపుతాము. రాష్ట్రంలో కరువు పీడిత ప్రాంతాలలో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నీటి సమస్య ఉంది. వర్షాలు బాగా కురిసినా, రిజర్వాయర్లు నింపుకునే పరిస్థితి లేదు. కాలువలు పూర్తి కాలేదు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీల సమస్యలు ఉన్నాయి’.
‘దీంతో వర్షాలు కురిసినా లాభం లేకపోయింది. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి చేయాలంటే రూ.33 వేల కోట్లు కావాలి. అదే విధంగా శ్రీకాకుళం వరకు పోలవరం నీటిని తరలించే ఉత్తరాం«ధ్ర సుజల స్రవంతికి రూ.16 వేల కోట్లు కావాలి’.
‘నాడు మా నాన్నగారు చేపట్టిన అనేక ప్రాజెక్టులను చంద్రబాబు పట్టించుకోలేదు. వాటిని పూర్తి చేయడానికి మరో రూ.25 వేల కోట్లు కావాలి. కానీ నిధులు ఎలా?. కృష్ణా నీటిని నమ్మలేం. శ్రీశైలం రిజర్వాయరకు వస్తున్న నీటికి సంబంధించి గత 45 ఏళ్ల రికార్డు ప్రకారం 1200 టీఎంసీలు. కానీ సీడబ్ల్యూసీ నివేదికల ప్రకారం గత 10 ఏళ్లలో 600 టీఎంసీలకు, గత 5 ఏళ్లలో 400 టీఎంసీలకు పడిపోయింది. దీంతో కృష్ణా ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది’.
‘మరోవైపు గోదావరి నీరు 3 వేల టీఎంసీలకు పైగా… సముద్రంలో కలిసి పోతుంది. కృష్ణా–గోదావరి లింకేజీకి రూ.68 వేల కోట్లు కావాలన్నారు. కాబట్టి మరో ప్రణాళిక చూడమన్నాను. దాని వల్ల ఆ వ్యయం రూ.50 వేల కోట్లు కావచ్చు’.
‘నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం. పేదలకు ఈ ఉగాది రోజున దాదాపు 25 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వబోతున్నాము. ఏటా 6 లక్షల ఇళ్లు కట్టాలని భావిస్తున్నాము. ఒక్కో ఇంటికి లక్షన్నర ఖర్చు వేసుకున్నా ఎంత డబ్బు కావాలి?
ఇన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి అన్ని విధాలుగా ఆలోచిస్తున్నాము’ అని ముఖ్యమంత్రి వివరించారు.

ఆ తర్వాత టీచర్ల ట్రెయినింగ్‌ ఎలా ఉండబోతుందన్న మరో ప్రశ్నకు స్పందించిన సీఎం, ఈ ప్రశ్నకు విద్యా శాఖ మంత్రి సమాధానం ఇస్తారని, ఆయన ఒక ఐఆర్‌ఎస్‌ అధికారి అని చెప్పారు. దళితుడైన శ్రీ ఆదిమూలపు సురేష్‌ సర్వీసుకు రాజీనామా చేసి, రాజకీయాల్లోకి వచ్చారని, విద్యా రంగంలో మార్పులకు ఆయనే సారథ్యం వహిస్తున్నారని తెలిపారు. టీచర్లకు శిక్షణలో భాగంగా, 13 జిల్లాలలో తొలుత 20 మంది చొప్పున మొత్తం 260 మందికి శిక్షణ ఇవ్వబోతున్నామని తెలిపారు.

రివర్స్‌ టెండరింగ్‌
అనంతరం స్పందించిన శ్రీ ఎన్‌.రామ్, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రివర్స్‌ టెండరింగ్‌ను ప్రస్తావించారు.
‘సీఎం ప్రసంగంలో ఎక్కడా అసత్యాలు కనిపించలేదు. అన్నింటికి చక్కగా చెప్పారు. ఇక రివర్స్‌ టెండరింగ్‌. దీని వల్ల చాలా ఆదా అయిందని చెప్పారు. అసలు అదేమిటి?’ అని ఆయన వివరణ కోరారు.
అందుకు బదులిచ్చిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, దేశంలో తొలిసారిగా ఈ ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో కూడా అవినీతికి తావు లేకుండా చేసే ప్రయత్నం మొదలు పెట్టామని, రూ.100 కోట్లకు మించిన ప్రతి టెండరు జ్యుడీషియల్‌ ప్రివ్యూకి వెళ్తుందని, దాన్ని జడ్జి పరిశీలించి, వారం రోజుల పాటు పబ్లిక్‌ డొమెయిన్‌లో పెట్టి, సూచనలు, సలహాలు కోరుతారని, కాంట్రాక్ట్‌ నిబంధనలకు సంబంధించి అభిప్రాయాలు తీసుకుంటారని తెలిపారు.
ఆ తర్వాత సంబంధిత శాఖతో మాట్లాడి కాంట్రాక్ట్‌ డాక్యుమెంట్‌ సిద్ధం చేస్తారని, బిడ్‌లో ఎవరైతే ఎల్‌–1గా నిలుస్తారో.. ఆ వ్యక్తి లేదా సంస్థ పేరు చెప్పకుండా, ఆ మొత్తాన్ని మాత్రమే ప్రకటించి.. మర్నాడు దానిపై వేలం ప్రక్రియ చేపడతారని, అదే రివర్స్‌ టెండరింగ్‌ అని వివరించారు.
రూ.2 వేల కోట్లు ఆదా
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక కాంట్రాక్ట్‌ డాక్యుమెంట్లను రివర్స్‌ టెండరింగ్‌ చేయడం ద్వారా దాదాపు రూ.2 వేల కోట్లు ఆదా చేశామని, గతంలో టెండరు వేసిన సంస్థలే, ఇప్పుడు ఇంకా తక్కువకు పని చేయడానికి ముందుకు వచ్చాయని వెల్లడించారు.
‘అదే పనిని తక్కువ మొత్తానికి చేయడానికి ముందుకు వచ్చారు. ఎందుకంటే వారిని ఎవరూ లంచాలు అడగడం లేదు’ అని సీఎం వివరించారు.
ఉదాహరణకు:
నిరుపేదల ఇళ్ల నిర్మాణానికి (హౌజింగ్‌ ఫర్‌ వీకర్‌ సెక్షన్‌) సంబంధించిన టిడ్కో టెండర్ల మొత్తం గతంలో రూ.2700 కోట్లు కాగా, అది ఇప్పుడు కేవలం రూ.2300 కోట్లు మాత్రమే అని చెప్పారు.
అదే విధంగా పోలవరం ప్రాజెక్టులో కూడా రూ.830 కోట్లు ఆదా చేశామని, నిజానికి నిర్మాణ వ్యయం పెరుగుతున్నా, రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా ఆ మొత్తం ఆదా చేయగలిగామని తెలిపారు.
రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా ప్రతి టెండర్‌లో పూర్తి పారదర్శకత వస్తుందని, ఇది కచ్చితంగా యావత్‌ దేశ దృష్టిని ఆకర్షిస్తుందని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat