Home / ANDHRAPRADESH / కరోనా అడ్డు..స్థానిక సంస్థల ఎన్నికలకే కాని.. అమరావతి ఆందోళనలకు కాదా చంద్రబాబు..!

కరోనా అడ్డు..స్థానిక సంస్థల ఎన్నికలకే కాని.. అమరావతి ఆందోళనలకు కాదా చంద్రబాబు..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిని అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా పేరుతో వాయిదా వేయించాడని..తద్వారా 14 వ ఆర్థిక సంఘం ద్వారా మార్చి 31 వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 5500 కోట్ల నిధులు రాకుండా చేశాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్రంలో 3 కోట్ల మంది ఒకేసారి బయటకు వస్తే కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఉంటుందా? తన రాజకీయ అవసరాల కోసం ముఖ్యమంత్రి ప్రజారోగ్యాన్ని బలిపెడతారా? అంటూ చంద్రబాబు సీఎం జగన్‌పై విరుచుకుపడ్డాడు.

అయితే కరోనా వైరస్ పేరుతో ఎవరూ గుంపులుగా గుంపులుగా సంచరించవద్దని సుద్దులు చెబుతున్న చంద్రబాబు మరోపక్క అమరావతి రైతులతో మాత్రం ఆందోళనలు చేయిస్తూనే ఉన్నాడు. గత 3 నెలలుగా చంద్రబాబు జై అమరావతి నినాదంతో అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులను రెచ్చగొట్టి మూడు రాజధానులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ.. చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి మరీ కరోనా పేరుతో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన రోజు కూడా మందడం, తుళ్లూరు, వెలగపూడి, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉండవల్లి, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ వంటి గ్రామాల్లో బాబుగారి సామాజికవర్గానికి చెందిన రైతులు, స్థానిక టీడీపీ నేతలు వందలాదిగా అమరావతి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తుళ్లూరు, మందడం దీక్షా శిబిరాల్లో అయితే మహిళలు, రైతులు బ్లీచింగ్‌ ప్యాకెట్లు, పారాసిటమాల్‌ మాత్రలు ప్రదర్శిస్తూ దీక్షలు నిర్వహించారు.

అంతెందుకు పదిరోజుల క్రితమే కరోనా వైరస్ ప్రభావం ఇండియాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. నాలుగు రోజుల క్రితం స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా పేరుతో చంద్రబాబు వాయిదా వేయించాడు. మరి వాయిదాకు ఒక రోజు ముందు కూడా తన కొడుకు లోకేష్ రాజధాని రైతులతో కలిసి అమరావతి ఆందోళనలో పాల్గొన్నాడు. అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దు అంటూ లోకేష్ ప్లకార్డు పట్టుకుని నవ్వుతూ ఫోజులు ఇచ్చాడు. కరోనా కరోనా కుచ్ కరోనా అని ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ చౌదరిని బతిమాలుకున్న చంద్రబాబు, టీడీపీ నేతలు కరోనా భయంతో ఇంట్లో కూర్చోకుండా దర్జాగా బయట తిరుగుతున్నారు. ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. ఫంక్షన్లకు వెళుతున్నారు. చంద్రబాబు తీరే అంతా…తన రాజకీయ స్వార్థం కోసం కరోనా పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించిన చంద్రబాబు…తన సామాజికవర్గానికి చెందిన రాజధాని రైతులతో అమరావతి ఆందోళలను మాత్రం దగ్గరుండి నడిపిస్తున్నాడు. అందులో మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. వృద్ధులకు త్వరగా కరోనా ఎటాక్ అవుతుందన్న విషయం బాబుకు తెలియదా…తెలుసు.

అసలు రాష్ట్రంలో కరోనా ప్రభావం ఇంకా ఊపందుకునే లోపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయేవి. కాని చంద్రబాబు కావాలనే కుట్ర పూరితంగా స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా పేరుతో వాయిదా వేయించాడు..కాని తన రాజకీయం కోసం అమరావతి ఆందోళనలను నడిపిస్తూనే ఉన్నాడు. మరి స్థానిక సంస్థల ఎన్నికలకు ఉన్న కరోనా ప్రమాదం..అమరావతి ఆందోళనలకు ఎందుకు లేదో చంద్రబాబు సమాధానం చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్రంలో ప్రజలందరూ ఒకేసారి బయటకు వస్తే ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఉంటుందా అని ప్రశ్నించిన చంద్రబాబుకు అమరావతి ఆందోళనల పేరుతో వందల మంది ఒకేచోట గుమిగూడితే వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఉంటుందని తెలియదా…తెలుసు..అయినా అదంతే బాబుగారి నాలికలాగే ఆయన కుటిల బుద్ధి కూడా ఎన్ని వంకర్లు అయినా తిరుగుతుంది. ఇదే బాబుగారి కుటిల రాజకీయం.