Home / TELANGANA / ఒకనెల వేతనం, ఏడాది నియోజకవర్గాల అభివృద్ధి నిధులు మొత్తం దాదాపు రూ.500కోట్లు విరాళం

ఒకనెల వేతనం, ఏడాది నియోజకవర్గాల అభివృద్ధి నిధులు మొత్తం దాదాపు రూ.500కోట్లు విరాళం

కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్‌ ప్రకటించిన యుద్ధానికి టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆర్థికంగా మద్దతు పలికారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు ఎదురుకాకుండా సాయం అందించడానికి, కరోనా కట్టడికి తమవంతుగా ముందుకొచ్చారు. ఒకనెల వేతనం, ఏడాది నియోజకవర్గాల అభివృద్ధి నిధులు మొత్తం దాదాపు రూ.500కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాలని నిర్ణయించారు. ఒక్కో ఎంపీకి నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఏడాదికి ఐదుకోట్లు మంజూరవుతాయి. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు 16 మందికి మంజూరయ్యే మొత్తం రూ.80 కోట్లు సీఎంసహాయనిధికి అందించనున్నారు.

ఒకనెల జీతం కూడా ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన కాన్సెంట్‌ లెటర్‌ను టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, ఉపనాయకుడు బండ ప్రకాశ్‌, లోక్‌సభలో పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు, ఉప నాయకుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమం త్రి కే చంద్రశేఖర్‌రావుకు అందజేశారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ఎంపీలు రంజిత్‌రెడ్డి, ఎం శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్‌, మాలోతు కవిత పాల్గొన్నారు. ప్రధానమంత్రి సహాయనిధికి కూడా పార్టీ ఎంపీల ఒకనెల జీతాన్ని అందజేయనున్నట్టు  కే కేశవరావు తెలిపారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులుసహా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఏడా ది నియోజకవర్గ అభివృద్ధి నిధులతోపాటు, ఒకనెల జీతాన్ని సీఎంఆర్‌ఎఫ్‌కు ఇవ్వనున్నట్టు టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం ప్రకటించింది. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి నియోజకవర్గ అభివృద్ధికి ఏడాది రూ.3 కోట్లు విడుదలవుతాయి. కరోనా కట్టడి చర్యల కోసం తమ నియోజకవర్గాల నిధులు, జీతాలను కేటాయించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్‌ అభినందించారు. చట్టసభల సభ్యులు చూపించిన స్ఫూర్తి ప్రభుత్వానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని ప్రకటించారు.