సోషల్ మీడియాలో ప్రముఖ సినీహీరోయిన్ సోనాక్షిసిన్హాపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఔరంగాబాద్ యువకుడిని ముంబై సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరానికి చెందిన 27 ఏళ్ల యువకుడు ‘దబాంగ్’ సినిమా నటి సోనాక్షిసిన్హాను దూషిస్తూ ఆమెపై అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోనాక్షి ముంబై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
ఆన్లైన్ వేధింపులపై ముంబై సైబర్ పోలీసులు తీసుకున్న చర్యలకు సోనాక్షి ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఆన్లైన్ ప్రపంచం సురక్షితంగా ఉండే వరకూ నేను నిశబ్ధంగా ఉండను, వేధింపులను నేను సహించను.
అందుకే నేను ఫిర్యాదు చేసిన వెంటనే ముంబై సైబర్ క్రైం పోలీసులు చర్యలు తీసుకున్నారు, వారికి అభినందనలు’’ అని సోనాక్షి పేర్కొన్నారు. మీరు కూడా ఆన్ లైన్ వేధింపులకు గురైతే ముంబై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయండి అంటూ నటి సూచించారు.