Home / EDITORIAL / నవతరం నేత.. నవ్యతకు బాట “కేటీఆర్”

నవతరం నేత.. నవ్యతకు బాట “కేటీఆర్”

పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతికరంగాల్లో  ఆయనది ఒక నవశకం. తెలంగాణ ఆధునిక విప్లవ ప్రగతి ఫలాలను అందరికి అందిస్తున్నారు. సుధీర్ఘ రాజకీయ, పాలనానుభవం కలిగిన ఎంతోమంది పాలకుల వల్ల కానిది కేవలం ఆరేండ్ల కాలంలోనే చేసి చూపించారు. యావత్‌ దేశానికే ఒక మార్గదర్శిగా నిలిచిన యువనేత తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  కేటీఆర్‌. రాష్ట్ర పారిశ్రామికరంగ అభివృద్ధికి నిత్యం కృషిచేస్తూ టీఎస్‌- ఐపాస్‌, వి-పాస్‌, వంటి వినూత్న పథకాల ద్వారా  ప్రపంచస్థాయి కంపెనీల చూపు రాష్ట్రంపై పడేలా చేశారు.  అనేక ప్రపంచస్థాయి అవార్డులు, రివార్డులు సాధించారు. తాజాగా మరో అరుదైన గౌరవం ఆయనకు దక్కింది.  ప్రపంచంలోని అగ్రగామి వ్యాపారసంస్థలు, దిగ్గజాలు, వివిధ దేశాల అధినేతలు, మంత్రులు పాల్గొనే ‘వరల్డ్‌ఎకనామిక్‌ ఫోరం ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్‌- 2021’ సదస్సులో పాల్గొననున్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ ఆర్థికాభివృద్ధి, సామాజిక లబ్ధి కోసం వినూత్నరీతిలో కార్యక్రమాలు అమలుచేస్తున్నారని ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు తెలంగాణ రాష్ర్టాన్ని అభినందించడం కేటీఆర్‌ సాధించిన ఘనతలలో కలికితురాయి. తాజాగా ఆన్‌లైన్‌ ఆడిట్‌ చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నది. జియో స్పెషల్‌  మ్యాపింగ్‌ ఆఫ్‌ అర్బన్‌  ప్రాపర్టీస్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా అన్ని మునిసిపాలిటీలలో మ్యాపింగ్‌ చేయడం వల్ల ‘జనగ్రహ సిటీ గవర్నెన్స్‌-2020’  అవార్డుల్లో ద్వితీయ అవార్డు గెలుచుకుంది.

కేటీఆర్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనడం ఇది మొదటిసారి కాదు. 2018లో ఒకసారి, 2020 స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన  50వ సదస్సులో పాల్గొని ‘4వ పారిశ్రామిక విప్లవంలో సాంకేతికత ప్రయోజనాలు ఎదురయ్యే సవాళ్లు’ అనే అంశం మీద ప్రసంగించి మంత్రముగ్ధులను చేశారు. దాదాపు 50 సమావేశాల్లో రాష్ట్ర విధానాలు, పారిశ్రామిక పాలసీలపై, పెట్టుబడుల అవకాశాలపై చర్చలు జరిపారు. ఫేస్‌ బుక్‌ సీఈఓ మార్క్‌ జుకెర్‌ బర్గ్‌ ఇతర ప్రపంచస్థాయి ఐటీ, ఫార్మా దిగ్గజాలతో చర్చలు జరిపి  పెట్టుబడులు ఆకర్షించగలిగారు.  ఇటువంటి అరుదైన ఘనతలు కేటీఆర్‌కు ఊరికే రాలేదు. దీనివెనుక ఆయన అకుంఠిత శ్రమ, కృషి ఉన్నాయి.  రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు మరే రాష్ర్టానికి సాధ్యం కానీ రీతిలో రూ. 1,96,404 కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రం  సాధించగలిగింది. ‘టీ హబ్‌’ పేరుతో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను ఏర్పాటుచేసి పారిశ్రామికరంగంలో యువతను ప్రోత్సహిస్తున్నారు.

ఐటీ ఎగుమతుల్లో రాష్ట్ర ఆవిర్భావం నాటికి  2014లో 57 వేల కోట్లు ఉండగా ప్రస్తుతం అది రెండింతలకు పైగా పెరిగి లక్ష 28 వేల కోట్లకు చేరింది. తద్వారా ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండో స్థానాన్ని సాధించింది.  ప్రపంచంలోని మొదటి 5 దిగ్గజ కంపెనీలు యాపిల్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ సంస్థలు అమెరికాలోని కాలిఫోర్నియా, వాషింగ్టన్‌లో ఉండగా రెండో అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లోనే ఆ కంపెనీలు ఏర్పాటు చేసుకోవటం గమనార్హం. కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మం,  సిద్దిపేట వంటి ద్వితీయశ్రేణి నగరాలకు సైతం ఐటీరంగాన్ని విస్తరింపజేశారు.

రాష్ట్రంలో నైపుణ్యాలకు, యువతకు కొదవలేదు.  అందుకే పెట్టుబడుల ద్వారా దాదాపు 15 లక్షల మంది యువతకు ప్రైవేటురంగంలో ఉపాధి,  ఉద్యోగ అవకాశాలను కల్పించారు.  ఇంత భారీ ఎత్తున ఉపాధి కల్పించింది కేవలం హైదరాబాద్‌ నగరమే. ఒక్క ఐటీ రంగంలోనే తెలంగాణలో 5,82,126 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరికింది. దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో దాదాపు 13.34 శాతం మంది తెలంగాణలోనే ఉండటం ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ కృషికి నిదర్శనం.  పెట్టుబడులను ఆకర్షించడానికి, ప్రాజెక్టులు నెలకొల్పడానికి, పరిశ్రమలను స్థాపించడానికి శాంతిభద్రతలు కీలకమైనవి. శాంతిభద్రతల అం శంపై యునైటెడ్‌ కింగ్‌డమ్‌ సంస్థ  ప్రకారం.. హైదరాబాద్‌ నగరం  ప్రపంచంలో 16వ స్థానంలో  ఉండగా, దేశంలో మొదటిస్థానంలో ఉండడం ముదావహం.

పెట్టుబడుల ఆకర్షణలో ప్రభుత్వ విధానాలు కీలక భూమిక పోషిస్తాయి. కేటీఆర్‌ విలక్షణ ఆలోచనల స్రవంతి నుంచి  వచ్చిన టీఎస్‌ఐపాస్‌ ద్వారా వేగంగా, సులభంగా అనుమతులు మంజూరు చేయడం సత్ఫలితాలనిస్తున్నది. పెట్టుబడుల ఆకర్షణలో మౌలిక వసతుల కల్పన కూడా కీలకమైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ‘ఆఫీస్‌ స్పేస్‌’లో  2015లో 6వ స్థానంలో ఉన్న తెలంగాణ 2020కి వచ్చేసరికి రెండో స్థానానికి పురోగమించిందని నైట్‌ఫ్రాంక్‌ సంస్థ వెల్లడించింది. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి వీ-హబ్‌ను స్థాపించింది. ఎన్నో సూక్ష్మ, మధ్య, భారీతరహా పరిశ్రమలకు కేంద్రమైన హైదరాబాద్‌ ఆర్థికవ్యవస్థ ఇప్పుడు 74 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రాష్ట్ర ఆవిర్భావం నాటికి 522 కోట్లుగా ఉన్న ఆదాయం, 2019 -20కి 957 కోట్ల 65 లక్షలకు పెరిగింది. ఇది పారిశ్రామికరంగానికి కేటీఆర్‌ చేస్తున్న కృషికి నిదర్శనం.

పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా  కేటీఆర్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నగరాల అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ధరణి పోర్టల్‌ ద్వారా భూములు, ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వల్ల భవిష్యత్‌లో గొడవల్లేకుండా చేస్తున్నారు. పట్టణాల్లోను ఆస్తులను జియో ట్యాగ్‌ చేసి ఆక్రమణలకు అడ్డుకట్ట వేస్తున్నారు. 2016లో ఐసీటీ పాలసీ ద్వారా కృత్రిమ మేధస్సు(ఏఐ), క్లౌడ్‌, బ్లాక్‌ చైన్‌, ఐవోటీ, రోబోటిక్స్‌ వంటి ఎమర్జింగ్‌ టెక్నాలజీలతో అభివృద్ధిని వేగిరం చేస్తున్నారు. ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గాను 2020 సంవత్సరాన్ని ఏఐ నామ సంవత్సరంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  ప్రపంచంలోని టాప్‌ 25 ఇన్నోవేషన్‌ హబ్‌లలో తెలంగాణను చేర్చడానికి, తద్వారా 3 నుంచి 4 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించేవిధంగా తీవ్రంగా కృషిచేస్తున్నది. ఇప్పటికే బ్లాక్‌ చైన్‌ వినియోగంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్న తెలంగాణా, ఏఐని ఆరోగ్యరంగం, వ్యవసాయరంగం, టెక్స్‌టైల్‌ రంగం వంటి వాటిల్లో ఉపయోగించేలా ప్రాజెక్టులు ప్రారంభించింది. ఇది సాంకేతికత వినియోగంలో ఒక ఆధునిక విప్లవం.

సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, పారిశ్రామికరంగం అభివృద్ధిలో మన రాష్ట్రం  అనతికాలంలోనే ఎంతో పురోగతి సాధించింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సాదించిన అవార్డులు ప్రశంసలే నిదర్శనం. భవిష్యత్‌లోనూ సాంకేతిక రథసారథి కేటీఆర్‌ నాయకత్వంలో సాంకేతికత, పారిశ్రామిక, ఈ-గవర్నెన్స్‌  రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడి పురోగమించడం ఖాయం.

ఒక్క ఐటీ రంగంలోనే తెలంగాణలో 5,82,126 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరికింది. దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో దాదాపు 13.34 శాతం మంది ఇక్కడే ఉండటం ప్రభుత్వ కృషికి నిదర్శనం. పెట్టుబడులను ఆకర్షించడానికి, పరిశ్రమలను స్థాపించడానికి శాంతిభద్రతలు కీలకమైనవి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ సంస్థ  ప్రకారం.. ఈ అంశంలో దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్నది.

(వ్యాసకర్త: డీన్‌, అకాడమిక్‌ ఆడిట్‌, కాకతీయ విశ్వవిద్యాలయం)

Source :- Namasthe Telangana

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat