Home / EDITORIAL / స్వావలంబిత సామ్యవాది సీఎం కేసీఆర్….

స్వావలంబిత సామ్యవాది సీఎం కేసీఆర్….

దేశ ఆర్థిక విధానాలను నిర్దేశించేది కేంద్రమే తప్ప రాష్ర్టాలు కాదు. దాన్ని రాష్ర్టాలు శిరసావహించాలి. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాల పయనానికి మూడు దశాబ్దాలు దాటింది. ఆర్థిక సంస్కరణ అనేది ప్రజల కోసం జరగాలి. అలా జరిగినవాటిని, జరుగుతున్న వాటిని స్వాగతిద్దాం. కానీ సంస్కరణ అంటే వ్యాపారం/వ్యాపారుల కోసమే జరగడం పట్లనే అభ్యంతరాలు. సంస్కరణలకూ ఓ పద్ధతి, ప్రజానుకూలత పాటించకపోవడం వల్లనే దేశంలో మౌలిక సదుపాయాలకు పెను ప్రమాదం వచ్చి పడింది.
 
 
స్వయం సమృద్ధిని నేటి కేంద్ర పాలకులు గాలికి వదిలేస్తూ వస్తున్నారు. పోటీ ప్రపంచం, ప్రైవేటురంగం తప్ప మరో ధ్యాసలేని విధానాలు సాగుతున్నాయి. తనదంటూ స్వయం సమృద్ధి లేని దేశంగా మారిపోతుండటమే ప్రమాదకరం. అయినా గత ఏడేండ్లలో సాధ్యమైన చోట స్వావలంబిత ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నారా అంటే.. అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే ముందు వరుసలో ఉన్నారని గర్వంగా చెప్పొచ్చు. ప్రపంచీకరణ నుంచి మనం మంచిని స్వీకరించి, చెడును విసర్జించాలి. ఆ నీతిని సీఎం కేసీఆర్‌ తు.చ. తప్పక ఆచరిస్తున్నారు. ఓ వైపు పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వనరులను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. తెలంగాణను సాధ్యమైనంత మేర స్వావలంబిత రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు, ఫలితాలూ సాధిస్తున్నారు.
 
 
దేశంలో సామాన్యుని ప్రయాణ సాధనమైన రైలును సైతం అమ్మకానికి పెడుతున్నవారిని చూస్తున్నాం! మరోవైపు తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్‌నూ చూస్తున్నాం. విచిత్రమేమంటే దేశానికి లాభాలు ఆర్జించి పెడుతున్న ఎల్‌ఐసీ వంటి కామధేనువులనే అమ్మకానికి పెట్టడాన్ని పచ్చి సంస్కరణల వాదులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకప్పుడు ‘నష్టాల్లో ఉన్న సంస్థలనే అమ్ముతాం, లాభాల్లో ఉన్న వాటిని కొనసాగిస్తాం’ అన్నారు. నేడు నష్టాల్లో ఉన్న సంస్థలను అమ్మడం అటుంచి, లాభాల్లో ఉన్న సంస్థలనే అమ్మకానికి పెడుతున్నారు! అలా ఎందుకు చేస్తున్నారనడిగితే.. ‘నష్టాల్లో ఉన్నవాటిని కొనడానికి ఎవరూ రావడం లేదు, అందుకే లాభాల్లో ఉన్న సంస్థలనే అమ్ముతున్నాం’ అంటున్నారు.ఇదీ మన పాలకులకు దేశ సంపద పట్ల ఉన్న భావన!
 
దేశ ఆర్థికవ్యవస్థకూ వావీ వరుసలుండాలి. కానీ నేటి సంస్కరణలకు అవి కరువయ్యాయి! నిజంగానే ఆ విచక్షణ పట్టనివాళ్లే తెలంగాణను పాలించి ఉంటే ఏమయ్యేది? ఆలోచించండి! రైళ్లను, ఎయిర్‌వేస్‌ను అమ్మకానికి పెడుతున్నవారు, ఇక్కడ ఆర్టీసీ, సింగరేణి లాంటి సంస్థలను అమ్మకానికి పెట్టేవారు కాదా? అలాగే ఇవాళ కేసీఆర్‌ ప్రభుత్వం స్థాపించిన భద్రాద్రి, యాదాద్రి వంటి విద్యుత్‌ కేంద్రాలను ప్రైవేటు కంపెనీలకే అప్పగించేవారు కాదా? తెలంగాణ అదృష్టమేమంటే.. సింగరేణిలో మెజారిటీ వాటా రాష్ర్టానిది కాబట్టి యాజమాన్య బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి సింగరేణి లాంటి ప్రభుత్వరంగ సంస్థను కేంద్రం ఏకపక్షంగా అమ్మడం సాధ్యం కాదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమూ అమ్మకానికి అంగీకరిస్తే దాన్నీ అమ్మకాల జాబితాలో చేర్చేవారేమో? కానీ సంస్కరణల జమానాలో కూడా సామ్యవాదం మరువని కేసీఆర్‌ అధికారంలో ఉన్నారు కాబట్టే సింగరేణికి ఆ గండం తప్పుతున్నది అనొచ్చు.
 
దేశంలో మంచినీటిని వ్యాపారంగా మార్చేశారు. మంచినీటి బాటిల్‌ వ్యాపారం సాగు త్నుది. నదులను కిలోమీటర్ల పొడవునా ‘కిన్లే’ వంటి విదేశీ కంపెనీలకు అమ్మేసిన చరిత్ర ఈ ప్రభుత్వాలది. అనేక ఉపనదులను కబ్జాచేసి మంచినీళ్లను వ్యాపారంగా మార్చుకున్న విదేశీ కంపెనీలు వేల కోట్ల లాభాలను తమ దేశాలకు తరలిస్తున్నాయి. తెలంగాణలో ప్రజలకు భగీరథ బాటిల్‌ నీళ్లను ప్రభుత్వమే అందుబాటులోకి తేబోతున్నది. ప్రైవేట్‌ బాటిల్‌ నీళ్లు కొంటే వ్యాపారికి లాభం. భగీరథ బాటిల్‌ నీళ్లు తాగితే ప్రభుత్వ సొమ్ము ప్రజలకే లాభం. కేసీఆర్‌ పాటిస్తున్న ప్రజానుకూల ఆర్థిక నీతికి ఇదొక ఉదాహరణ. ఈ దేశంలో ‘నీళ్ల ముఖ్యమంత్రి’ ఎవరని అడగాల్సిన పనిలేదు. ఆ విషయాన్ని ప్రధాని మోదీనే ఒప్పుకున్నారు. పొలానికి సాగు నీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించే దీక్షతో పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈదేశంలో కేసీఆరే. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరందించే పథకం ఒక రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడం చూసైనా.. కేసీఆర్‌లో ఎంత బలమైన సోషలిస్టున్నాడో అర్థం చేసుకోవచ్చు.
 
ఇవాళ స్వచ్ఛమైన తాగునీటిని వంద శాతం అందిస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణే అనే విషయాన్ని ఈ మధ్యన కేంద్ర జలశక్తి మంత్రి ట్వీట్‌ చేశారు. అటు దేశంలో, ఇటు రాష్ర్టాల్లో తాగేనీళ్లు, సాగు నీళ్లు, పీల్చేగాలి, నడిచే రోడ్డు అన్నీ వ్యాపార వస్తువులుగా మారుతున్న క్రమంలో.. రాష్ట్ర పరిధిలో గల ప్రతి వనరును రాష్ట్ర ప్రజలకే అంకితం చేస్తున్న కేసీఆర్‌లో సామ్యవాదాన్ని కాకుండా మరేం చూడగలం? ఏడేండ్లలో కేసీఆర్‌ ప్రభుత్వంలో తాగు, సాగునీరు, విద్యుత్‌ రంగాల్లో జరిగిన అభివృద్ధిని ఇవాళ తెలంగాణ ఆస్వాదిస్తున్నది. రాష్ట్రంలో అన్నిరంగాల్లో ఉత్పాదకత పెరిగింది. రాష్ట్ర తలసరి ఆదాయాన్ని దేశ తలసరి ఆదాయం అందుకోలేనంత పెరిగింది. తెలంగాణ ఒక స్వావలంబిత రాష్ట్రంగా స్థిరపడుతున్నది.
 
కేంద్ర, ఆర్థిక విధానాలకు లోబడి మాత్రమే రాష్ర్టాలు పనిచేయాల్సిన పరిస్థితుల్లో కూడా.. అనేక రంగాలను స్వావలంబితం చేసిన కేసీఆర్‌లో నిజమైన సోషలిస్టూ ఉన్నాడని చెప్పుకోవచ్చు.వందలాది జీవనదులు, ఉపనదులతో విరాజిల్లుతున్న దేశంలో స్వచ్ఛమైన తాగునీరు దొరకదు. కానీ కోట్లలో నీటి వ్యాపారం.. వేలాది టీఎంసీల నీరు సముద్రంలో.. వ్యవసాయం సంక్షోభంలో.. ఇదే ఈ దేశంలో జరుగుతున్నది! సంస్కరణల అడ్డుగోడలను ఛేదించి ఉన్న వనరులను ప్రజల పరం చేస్తున్న కేసీఆర్‌ వంటి నాయకుడి మార్గదర్శనం ఈ దేశానికి ఎన్నటికైనా అవసరమే. దారి తప్పుతున్న ప్రస్తుత దేశ నాయకత్వానికి మన సామ్యవాదే ప్రత్యామ్నాయం కావాలని ఆశిద్దాం.
 
-కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat