Home / EDITORIAL / మోడీ ఏడేండ్లు పాలనలో అన్ని ఏతులే

మోడీ ఏడేండ్లు పాలనలో అన్ని ఏతులే

అచ్ఛేదిన్‌ కహా..? తిరోగమనంలోకి దేశం
– ప్రధాని విధానాలు ప్రమాదకరం
– నోట్లరద్దు నుంచి కోవిడ్‌-19 వరకు ప్రతిదీ విఫలమే
– ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం : నిపుణుల ఆందోళన
కేంద్రంలో అధికారమార్పిడి జరిగితే తమ ఆశలు నెరవేరుతాయనుకున్నారు. రెండుసార్లు అధికారమిచ్చారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లు పూర్తిచేసుకున్నా.. కష్టాలు.. కన్నీళ్లే మిగిలాయన్న వాదన ప్రజల్లో వ్యక్తమవుతున్నది. అచ్ఛేదిన్‌ (మంచిరోజులు) వస్తాయని చెప్పుకుంటూ.. మతరాజకీయాలతోనే ఓటు బ్యాంకు చేసుకుని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ ఎదగాలనుకుంటున్నది. నోట్ల రద్దు మొదలుకుని ఎన్నో భారాలను మోయలేక సామాన్యజనం సతమతమవుతున్నారు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా కరోనా కోరలు విప్పుతుంటే.. కుటుంబాలకు కుటుంబాల్లోనూ వైరస్‌ విషాదాన్ని నింపేస్తున్నది. తాము గెలిపించిన ప్రధాని మోడీ ఎచ్చులే(ఏతులే) తప్ప.. చేతల్లో మాత్రం శూన్యమే అన్న చర్చ జనంలో నడుస్తున్నది.

పని తక్కువ.. ప్రచారం ఎక్కువ
మేక్‌ఇన్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా,స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, స్మార్ట్‌ సిటీస్‌..ఇవన్నీ ప్రచారానికి పరిమితమయ్యాయి. బీజేపీ ఎన్నికల ప్రచారానికి, ప్రజల్లో ఎన్నో ఆశలు కల్పించడానికి ఉప యోగపడ్డాయి. విద్య వికేంద్రీకరణ పక్కకుపోయింది. గ్లోబల్‌ టాలెంట్‌ను మన వర్సిటీలు ఆకర్షించలేకపోతు న్నాయి. మూఢ నమ్మకాలు, అశాస్త్రీయతను బలపర్చే విధంగా కేంద్రంవ్యవహరించటం దేశవిదేశీల్లో విమర్శ లకు దారితీసింది. జాతీయ అతివాదం, అసహనాన్ని ఎగదోస్తున్న మోడీసర్కార్‌ సామాజికంగా దేశాన్ని మరి న్నిసమస్యల్లోకి నెట్టిందని ప్రతిపక్షాలుఆరోపిస్తున్నాయి.

కార్పొరేట్‌ కోసం ఏమైనా..
పర్యావరణ చట్టాల్ని మార్చి కార్పొ రేట్‌వర్గాలకు ప్రయోజనం కల్పిం చారు. ఆగమేఘాల మీద భారీ ప్రాజె క్టులకు, మైనింగ్‌ కార్యకలాపాలకు ఆమోదం తెలిపే విధానాలకు తెరలే పారు. కార్మికచట్టాలకు పాతరేశారు. నాలుగు లేబర్‌ కోడ్‌లు తీసుకొచ్చారు. కొత్త చట్టాల్లో నిబంధనలన్నీ కార్పొరేట్‌ సంస్థల వ్యాపార విస్తరణకు అనుకూలించేవే ఉన్నాయి. కార్మిక హక్కుల్ని పూర్తిగా బలహీనం చేసేశారు. వ్యవసాయరంగంలో ఆహార ఉత్పత్తిల్ని కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో పెట్టడం కోసం నూతన సాగు చట్టాల్ని తెరమీదకు తెచ్చారు. దేశంలోని బడా కార్పొరేట్‌ వర్గాలకు లక్షల కోట్ల రూపాయల పన్ను మినహాయింపులు ఇచ్చారు. ఇంత చేసినా..దేశ ఆర్థికవ్యవస్థ ముందడుగు వేయలేదు.. మునుపెన్నడూ లేనంతగా ఆర్థికమాంద్యం నెలకొంది. ఉపాధిలేక, నిరుద్యోగం గరిష్టస్థాయికి చేరుకుంది. ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతిన్నది. అందుకే మోడీ ఏడేండ్ల పాలన తమకు కష్టాలూ..కన్నీళ్లే మిగిల్చిందని జనం మొత్తుకున్నారు.

 ‘అచ్ఛేదిన్‌’ అంటూ 2014లో సంపూర్ణ మెజారిటీతో మోడీ సర్కారు కేంద్రంలోకి అధికారంలోకి వచ్చింది. దేశ ప్రజలు సైతం నూతన ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఆ ఐదేండ్ల పాలనలో మోడీ సర్కారు దేశాన్ని అంధకారంలోకి నెట్టిందని పలు రంగాల నిపుణులు, రాజకీయ విశ్లేషకులు వెల్లడించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి బదులు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టిందనీ, హిందూ, ముస్లిం వంటి మత విద్వేషాలను రెచ్చగొట్టింది. పాక్‌, చైనాలపై యుద్ధం పేర రాజకీయంగా బీజేపీ లబ్ది పొందింది.ఈ కారణాలతో 2019లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే రెండోసారి అధికారంలోకి వచ్చింది. అయితే, మోడీ సర్కారు ఈ ఏడేండ్ల పాలనలో ప్రమాదకర విధానాలను అవలంభించటమే కాదు… దేశాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్లిందన్న బలమైన వాదన వినిపిస్తున్నది.

అంధకారంలోకి దేశ ఆర్థికం..
భారత్‌ను అంధకారంలోకి నెట్టిన మోడీ చర్యలను ముఖ్యంగా మూడు దశలుగా విభజించవచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. అందులో మొదటిది ‘పెద్దనోట్ల రద్దు’, రెండోది 2019 ఏడాదిలో తీసుకొచ్చిన ‘ ప్రజాస్వామ్య, రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలు, నిర్ణయాలు’, మూడోది ‘కోవిడ్‌-19ను నియంత్రించడం’లో చేతులెత్తేసిన తీరు.పెద్ద నోట్ల రద్దుతో పేదలను, సాధారణ ప్రజలను బ్యాంకుల ముందు మోడీ క్యూలో నిలబెట్టాడు. వారిలో భయాన్ని రేకెత్తించడాన్ని నిపుణులు గుర్తు చేశారు. నోట్లకోసం క్యూలైన్లలో నిలబడ్డ అమాయకులు పలువురు ప్రాణాలు వదిలారు.

రాష్ట్రాలు వద్దన్నా వినలేదు..
2017లో మోడీ సర్కార్‌ మరో పిడుగువేసింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను అమల్లోకి తెచ్చింది. జీఎస్టీ వద్దుబాబోరు..అని రాష్ట్రాలు ఎంత మొత్తుకున్నా మోడీ సర్కార్‌ వినలేదు. ఇది అమల్లోకి వచ్చాక..పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చిన్నమధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. పన్ను చెల్లింపులకే మొత్తం పోతోంది, మా వ్యాపారంలో మిగిలేదేమీ లేదు..అని అనేక ఏజెన్సీలు, మార్కెటింగ్‌ సంస్థలు గగ్గోలు పెట్టాయి. నిత్యావసర సరుకులు, ఇతర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరగడానికి జీఎస్టీ కారణమైంది. వ్యవస్థలు ఎంత నష్టాన్ని చవిచూసినా సరే..తమ నిర్ణయం అమలుకావాల్సిందే..అనేతీరుగా ప్రధాని వ్యవహారించారు. ఆర్థికవేత్తల మాటగానీ, ఆయా రంగాల నిపుణుల మాటగానీ ప్రధాని మోడీ వినరనే విమర్శలు వెలువడ్డాయి.

ఆర్టికల్‌ 370 రద్దు చేసి ప్రజాస్వామ్యానికి తూట్లు
ఇక రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార బలంతో మోడీ ప్రభుత్వం మరింత నిరంకుశంగా, అప్రజాస్వామికంగా వ్యవహరించిం దని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. జమ్మూకాశ్మీర్‌ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేయడం, దానిని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టి ఫెడరలిజానికి తూట్లు పొడిచారని చెప్పారు. అలాగే, దేశంలో ఒక వర్గంపై కుట్ర చేశారా అన్నట్టుగా వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను తీవ్ర వ్యతిరేకత నడుమ మోడీ సర్కారు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికినప్పటికీ మోడీ సర్కారు అవేమీ పట్టనట్టుగా వ్యవహరించి రాష్ట్రపతి ఆమోదం ద్వారా చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని విశ్లేషకులు చెప్పారు. అంతేకాకుండా, నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌(ఎన్నార్సీ) ని తీసుకురావడం కూడా మోడీ సర్కారు జాబితాలో ఉన్నదనీ, ‘హిందూత్వ రాష్ట్ర’ ధ్యేయంగా మోడీ, షా ద్వయం ప్రజాస్వామిక, రాజ్యాంగ విధానాలకు తూట్లు పొడుస్తూ అనైతికంగా వ్యవహరిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు ఆరోపించారు. రామ మందిర నిర్మాణానికి సంబంధించిన విషయం కూడా ఇందులో భాగమని చెప్పారు.

ఇక మూడో దశలో మోడీ సర్కారు తన ప్రభుత్వ చేతగాని తనాన్ని ప్రపంచం ముందు బయటపెట్టుకున్నదనీ, కోవిడ్‌-19 నియంత్రణలో చేతులెత్తేసిన విధానమే దీనిని తెలియజేస్తున్నదని విశ్లేషకులు ఆరోపించారు. కరోనా సెకండ్‌వేవ్‌ దేశంలో విజృంభిస్తూ వేలాది మంది ప్రాణాలను హరించివేస్తున్నప్పటికీ మోడీ సర్కారు మాత్రం ప్రభావవంతంగా చర్యలు తీసుకోవడం లేదని వైద్య, ఆరోగ్య నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు చేసిన వ్యాఖ్యలు, విడుదల చేసిన నివేదికలను ఈ సందర్భంగా రాజకీయ నిపుణులు ఉటంకించారు. ముఖ్యంగా, వ్యాక్సిన్లు, మందులు, బెడ్లు, ఆక్సిజన్ల కొరత దేశాన్ని తీవ్రంగా పట్టిపీడించిందనీ, చాలా మంది ప్రాణాలు కోల్పోవడానికి కరోనా మాత్రమే కారణం కాదనీ, ఈ విధమైన కొరత కూడా కారణమని వివరించారు. వ్యాక్సిన్లు, ఆక్సిజన్ల సరఫరా విషయంలో మోడీ సర్కారు రాష్ట్రాలతో సరైన రీతిలో వ్యవహరించలేదనీ, రాష్ట్రాలు.. కేంద్రాన్ని యాచించాలనే తీరులో మోడీ సర్కారు వ్యవహరించిందని తెలిపారు. వీటికి తోడు వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలు, కార్మికుల హక్కులను హరిస్తూ చట్టాలను సవరణ చేయడం మోడీ ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిదర్శనమని చెప్పారు. మొత్తానికి దేశంలో సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు, యువత, మహిళలు, మైనారిటీలు, చిన్న వ్యాపారుల జీవితాలను మోడీ సర్కారు ప్రమాదంలోకి నెట్టిందని విశ్లేషించారు. ఇక ఆర్థిక వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనీ, పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ వంటి దేశాలూ మనకన్నా మెరుగైన స్థానాల్లో ఉన్నాయని ఆర్థిక నిపుణులు గుర్తు చేశారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat