Home / ANDHRAPRADESH / పోలవరం తొలి ఫలితానికి అంకురార్పణ

పోలవరం తొలి ఫలితానికి అంకురార్పణ

ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్ వే తో నిర్మిస్తున్న బహుళార్ధక సాధక పోలవరం ప్రాజెక్ట్ (పిఐపి) తొలి ఫలితం అందుతోంది. గోదావరి డెల్టాకు మొదటిసారిగా పోలవరం మీదుగా నీటిని విడుదల చేసే ప్ర్రక్రియ నేడు (శుక్రవారం 11.06.2021) ప్రారంభించడం ద్వారా తొలి ఫలితం అందించేందుకు అంకురార్పణ చేసింది మేఘా ఇంజనీరింగ్. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఈసిఆర్ఎఫ్ నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటిని విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ వద్ద గోదావరి నది సహజ ప్రవాహాన్ని అప్ప్రోచ్ ఛానల్ గుండా స్పిల్ వేకు మళ్లించిన సందర్భంగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాన్ని జలవనరుల శాఖ, మేఘా ఇంజనీరింగ్ అధికారులు చేశారు. గోదావరిలో నీటిని అప్రోచ్ కెనాల్ కు విడుదల చేయడం వల్ల ఆ నీరు స్పిల్ వే, రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు చేరి అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతో పాటు తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా గోదావరి డెల్టా మొత్తాన్ని సశ్యశ్యామలం చేయనుంది. సహజంగా గోదావరిలో ప్రవహించే నీరు బ్యారేజ్ నుంచి డెల్టాకు అందుతుంది. పోలవరం పూర్తయిన తరువాత స్పిల్ వే, రివర్ స్లూయిజ్, పవర్ హౌస్ డిశ్చార్జ్ ల ద్వారా బ్యారేజ్ ల నుంచి కాలువలకు చేరుతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండగానే నీరు గోదావరి డెల్టాకు చేరుతుండడం వల్ల పోలవరం తొలి ఫలితం అందుతున్నట్లయ్యింది.


పోలవరం నిర్మాణంలో స్పిల్ వే తో పాటు మూడు గ్యాపులు (ఈసిఆర్ఎఫ్ 1,2,3) తో పాటు జల విద్యుత్ కేంద్రం, జల రవాణా పనులు కీలకమైనవి. ఇందులో ఇంజనీరింగ్ నిబంధనలకు అనుగుణంగా (వర్క్ మ్యానువల్, ప్రోటోకాల్) స్పిల్ వే పనిని మేఘా ఇంజనీరింగ్ ఆగమేఘాల మీద పూర్తి చేసింది. ఈ సీజన్ లోనే వరదను మళ్లించడానికి అనుగుణంగా అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే గేట్ల ఏర్పాటు, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ దాదాపు పూర్తి చేసింది. ఈ నిర్మాణాలు జరగడం వల్లనే గోదావరి నదిలో ప్రవాహానికి అడ్డుకట్ట వేసేవిధంగా అప్పర్ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తయ్యింది. దాంతో ఎగువ నుంచి వచ్చే నీరు నిలిచి పోయి గోదావరి డెల్టాకు నీటి లభ్యత ఆగిపోయింది. ఈ పరిస్థితుల్లో గోదావరి నీటిని అప్రోచ్ ఛానెల్ నుంచి దిగువకు విడుదల చేయడం ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పోలవరం దిగువన ఉన్న తాడిపూడి, పట్టిసీమ, పుష్కరం తదితర ఎత్తిపోతల పథకాల ద్వారా తాగు, సాగు నీరు ఇక నుంచి ఈ అప్రోచ్ ఛానెల్ ద్వారానే విడుదల కానుంది. ఇంతకాలం నది సహజ ప్రవాహం ద్వారా వాటికి నీరు చేరేది. గోదావరికి సహజంగా జూన్ నుంచి డిసెంబర్ వరకు ప్రవాహం ఉంటుంది. ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో పెద్ద ఎత్తున వరదలు వస్తుంటాయి. వేసవిలో వరద ప్రవాహం లేకపోయినప్పటికీ సీలేరు, మాచ్కండ్ జల విద్యుత్ కేంద్రాల నుంచి విడుదలైన నీరు కనీస పరిమాణంలో డెల్టాకు చేరుతుంది. ఇక నుంచి ఏడాది పోడవునా నీటిని అప్రోచ్ ఛానెల్ ద్వారా మళ్లించి మళ్లీ పైలెట్ ఛానెల్ ద్వారా గోదావరిలోకి కలుపుతారు
అప్పర్ కాఫర్ డ్యాం మూసివేసిన తరువాత సహజంగానే గోదావరిలో నీటి మట్టం వెనక్కు (ఎగువకు) పెరుగుతోంది. దీంతో లోతట్టున ఉన్న గ్రామాల్లోకి నీరు చేరుతోంది. ఆ గ్రామాలకు ఇప్పటికే ప్రభుత్వం పునరావాసం కల్పించింది.

సహజంగా జులై తరువాత గోదావరికి వరదలు వస్తాయి. కానీ ఈ ఏడాది గోదావరికి ప్రధాన ఉపనదిగా భావించే శబరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇప్పటికే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించి చురుగ్గా విస్తరించాయి. ఈ పరిస్థితుల్లో ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా తో పాటు ముఖ్యంగా శబరి, పాములేరు పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే స్పిల్ వే మీదుగా నీటిని మళ్లించాలి. అంతపెద్ద వరద రాకపోయినా గోదావరి డెల్టా, ఉభయ గోదావరి జిల్లాల తాగునీరు, పట్టిసీమ ద్వారా కృష్ణా ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం తదితర అవసరాల కోసం అప్రోచ్ ఛానెల్, రివర్ సూయిజ్, పైలెట్ ఛానెల్ ద్వారా నీటిని గోదావరి లోకి మళ్లించాలి. ఖరీఫ్ లో గోదావరి డెల్టా ఆయకట్టుకు నీటి సమస్య ఎదురు కాకుండా ఉండడం కోసం ఇది అనివార్యం. గోదావరి నదికి అప్రోచ్ ఛానెల్ ప్రారంభమయ్యే చోట తాత్కాలికంగా ఉన్న బండ్ ను తొలగించడం ద్వారా గోదావరి నది ప్రవాహాన్ని కుడివైపునకు పంపించి నదినే 6.6 కిలోమీటర్ల మేర మళ్లించారు. ఈ కార్యక్రమం లో జలవనరుల శాఖ ఈ ఎన్ సి నారాయణరెడ్డి, పోలవరం సి ఈ సుధాకర్ బాబు, ఎస్ ఈ నరసింహమూర్తి, ఈఈలు మల్లి ఖార్జునరావు, ఆదిరెడ్డి,బాలకృష్ణ,మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జి ఎం లుముద్దుకృష్ణ,దేవ్ మని మిశ్రా, సిజిఎం రవీంద్రరెడ్డి, ఎజిఎం రాజేశ్, డిజిఎం శ్యామలరావు,మేనేజర్ మురళి,లు పాల్గొన్నారు.ఆతరువాత వచ్చే భారీ వరదలను రేడియల్ గేట్లను ఎత్తి ఉంచడం ద్వారా దిగువకు విడుదల చేస్తారు. ఇలా స్పిల్ వే నుండి స్పిల్ ఛానెల్ లోకి విడుదల చేసిన నీటిని ఫైలెట్ ఛానెల్ ద్వారా తిరిగి గోదావరి సహాజ ప్రవాహాంలో కలుస్తుంది.


ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచనలకు అనుగుణంగా జలవనరుల శాఖ అధికారుల సహాకారంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ పనులును వేగవంతం చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి ప్రాజెక్టు పూర్తి కావాలంటే ముందుగా ఎగువ కాఫర్ డ్యాంను ఈ సీజన్ లో పూర్తి చేసి గోదావరి ప్రవాహాన్ని అప్రోచ్ ఛానెల్ ద్వారా స్పిల్ వే మీదుగా స్పిల్ ఛానెల్ లోకి విడుదల చేసి మళ్లీ ఫైలెట్ ఛానెల్ ద్వారా సహాజ గోదావరి ప్రవాహాంలో కలపితేనే గ్యాప్-2లో ఎర్త్ కం రాక్ ఫిల్ ఢ్యాం పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎగువ,దిగువ కాఫర్ ఢ్యాం నిర్మాణ పనులను వేగవంతం చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ.


6.6 కిలోమీటర్ల మేర నది మళ్లింపు ఇంజనీరింగ్ అద్భుతం అరుదు


ప్రపంచంలో ఇది అరుదైన ఇంజనీరింగ్ అద్భుతం. నదిని 6.6 కిలోమీటర్ల మేర మళ్లించేందుకు పనులు పూర్తయ్యాయి. అందులోనూ మామూలు నది కాదు అది. దేశంలో రెండో పెద్ద నది కాగా వరదలు వస్తే 35 లక్షల నుంచి 50 లక్షల వరకు వరద వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి నదిని 6.6 కిలోమీటర్లు మళ్లించడం సామాన్యమైనది కాదు. సహజంగా ప్రవహించే గోదావరిని పోలవరం వద్ద కుడివైపునకు అంటే అప్రోచ్ ఛానెల్ నుంచి పైలెట్ ఛానెల్ వరకు మల్లిస్తారు. ఇప్పుడు మొదలువుతున్న ఈ నీటి ప్రక్రియ ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత కూడా అలాగే కొనసాగుతుంది. నదీ మధ్య భాగంలో మూడు గ్యాపులు (1,2,3) నిర్మించాలి. అందులో గ్యాప్-2 గా పిలిచే ఈసిఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం) అతిపెద్దది. 50 లక్షల క్యూసెక్కుల నీటి ఒత్తిడిని తట్టుకునే విధంగా దీనిని నిర్మిస్తారు. ఈ పని ప్రారంభం కావాలంటే నీటి ప్రవాహం నిలిపివేయాలి. అందుకోసం అప్పర్ కాఫర్ డ్యాం నిర్మించి ఈ ఏడాది వచ్చే వరదల్లో కూడా ఈసిఆర్ఎఫ్ నిర్మాణ పనులు కొనసాగించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ నది మళ్లింపు చేపట్టారు. అప్రోచ్ ఛానెల్, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ పొడవు 6.6 కిలోమీటర్లు ఉంది. ఇవి ప్రధాన నదికి కుడివైపున సమాంతరంగా నిర్మించారు. అప్రోచ్ ఛానెల్ స్పిల్ వే వైపు 2.4 కిలోమీటర్లు వరకు నిర్మించారు. స్పిల్ వే నుంచి స్పిల్ ఛానెల్ 3.1 కిలోమీటర్లు, స్పిల్ ఛానెల్ చివరి నుంచి మళ్లీ గోదావరి తన సహజసిద్ధ ప్రవాహంలోకి కలిసే విధంగా 1.1 కిలోమీటర్లు పైలెట్ ఛానెల్ నిర్మించారు. ఎగువ కాఫర్ డ్యాం మూడు రీచ్ లుగా 2480 మీటర్ల పొడవు, 42.5 మీటర్ల ఎత్తున నిర్మించారు. ఇటీవలనే అప్పర్ కాఫర్ డ్యాం గ్యాపులను ప్రభుత్వ నిర్ణయానుసారం మేఘా ఇంజనీరింగ్ పూడ్చివేసింది. ఫలితంగా 30 లక్షల క్యుసెక్కుల వరకు వరద వచ్చినా నదిలో నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రవాహం అప్రోచ్ ఛానెల్ మీదుగా వెళ్లిపోతుంది.


అతి తక్కువ సమంలో రికార్డ్ స్థాయిలో పనులు


గోదావరి నది ప్రవాహాన్ని మళ్లించడానికి అవసరమైన పనులను రికార్డ్ సమయంలో మేఘా ఇంజనీరింగ్ పూర్తి చేసింది. గోదావరి ప్రవాహం కుడివైపునకు మళ్లీ స్పిల్ వేకు చేరాలంటే కనీస మట్టానికి తవ్వాలి. అందుకోసం అప్రోచ్ ఛానెల్ ను 2.4 కిలోమీటర్ల మేర తవ్వేశారు. దాంతో పెద్ద నది రూపుదిద్దుకుంది. ఇందుకోసం కోటి 54 లక్షల 88 వేల మట్టి తవ్వకం పనులు చేయాల్సి ఉండగా ఇప్పటికి కోటి 4 లక్షల 88 వేల ఘనపు మీటర్లు పూర్తయ్యింది. ఇందుకోసం రేయింబవళ్లు యంత్రాంగం పని చేసింది. మొత్తం మట్టి పని 5 కోట్ల 92 లక్షల పనికి గాను 5 కోట్ల 24 లక్షల ఘనపు మీటర్ల మేర పూర్తయ్యింది. మొత్తం సిసి బ్లాకులు (స్పిల్ వే) 17 లక్షల ఘనపు మీటర్లు కాగా 15.17 లక్షల ఘనపు మీటర్ల పని పూర్తయ్యింది. ఇందులో స్పిల్ వే కీలకమైనది. 50 లక్షల క్యుసెక్కుల వరద నీటిని నియంత్రించి గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తుంది. ప్రపంచంలో ఇంతవరకు అతిపెద్ద వరద డిశ్చార్జ్ స్పిల్ వే గా పేరొందిన త్రిగాడ్జెస్ జలాశయం కన్నా పోలవరంలో మూడు లక్షల క్యుసెక్కులు అధికం. దీనిని తట్టుకునే విధంగా ప్రపంచంలోనే అతపెద్ద గేట్ల ఏర్పాటు పూర్తయింది. ఇందుకోసం 15.17 ఘనపు మీటర్ల కాంక్రీట్ పని పూర్తయ్యింది. గేట్లను హైడ్రాలిక్ పద్ధతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అందులో భాగంగా 22 పవర్ ప్యాక్ లను 44 గేట్లకు అమర్చారు. 28 రేడియల్ గేట్లను హైడ్రాలిక్ పద్ధతిలో ఈ సీజన్లో వరద వచ్చినా విడుదల చేసే విధంగా 28 గేట్లను ఎత్తి ఉంచారు.


ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకు 76.29 శాతం హెడ్ వర్క్స్ పనులు పూర్తయ్యాయి. పోలవరం వరద నీటిని అప్రోచ్ ఛానెల్ మీదుగా మళ్లిస్తున్నందున పోలవరంతో పాటు పలు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. నీటి ప్రవాహం స్పిల్ వేలో లక్ష క్యుసెక్కుల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. 12 లక్షల క్యుసెక్కులకు చేరిన తరువాత ప్రభావం కనిపిస్తుంది. కనీస ప్రవాహం ఉన్నప్పుడు 9 ఆవాసాల్లోకి నీరు ప్రవహిస్తుంది. 28 మీటర్లు దాటిన తరువాత ముంపునకు గురయ్యే ఆవాసాల సంఖ్య పెరుగుతుంది. పూర్తి స్థాయిలో స్పిల్ వే వరకు (45.72 మీటర్లు) నీరు చేరేతే 235 ఆవాసాలు ముంపు భారీన పడతాయి. అందుకు తగిన విధంగా ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసి గ్రామాలను తరలిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat