Home / SLIDER / ప్ర‌తి ప‌రిశ్ర‌మ‌కు గ‌మ్య‌స్థానం తెలంగాణే- మంత్రి కేటీఆర్

ప్ర‌తి ప‌రిశ్ర‌మ‌కు గ‌మ్య‌స్థానం తెలంగాణే- మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో అన్ని రంగాల్లో పురోగ‌మిస్తుంద‌ని, ప్ర‌తి ప‌రిశ్ర‌మ‌కు గ‌మ్య‌స్థానం తెలంగాణే అని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ రంగాల ప్ర‌గ‌తిపై శాస‌న‌స‌భ‌లో స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ చేప‌ట్టారు. స‌భ్యులు మాట్లాడిన అనంత‌రం కేటీఆర్ సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చారు.

తెలంగాణ యొక్క పారివ్రామిక పురోగ‌తి రెండు మాట‌ల్లో చెప్పాలంటే.. ట్రాక్ట‌ర్ నుంచి హెలికాప్ట‌ర్ దాకా, ఎర్ర‌బ‌స్సు నుంచి ఎల‌క్ట్రిక్ బ‌స్సు దాకా, ఎల‌క్ట్రిక్ బ‌స్సు నుంచి ఎయిర్ బ‌స్ దాకా, టైల్స్ నుంచి టెక్స్‌టైల్స్ దాకా, యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్ దాకా, ప్ర‌తి ప‌రిశ్ర‌మ‌కు గ‌మ్య‌స్థానం తెలంగాణే అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ మాట తాను అనాలోచితంగా చెప్ప‌డం లేదు. ఇది జ‌రుగుతున్న చ‌రిత్ర‌. న‌డుస్తున్న చ‌రిత్ర ఇది అని స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ కార్య‌దక్ష‌త‌కు ఇది నిద‌ర్శ‌నం. స‌మ‌ర్థ‌మైన నాయ‌క‌త్వం, సుస్థిర‌మైన ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు పెట్టుబ‌డులు వెల్లువ‌లా వ‌స్తాయ‌న్నారు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప్ర‌తి రంగంలో గ‌ణ‌నీయ‌మైన అభివృద్ధి జ‌రుగుతోంది. తెలంగాణ అన్ని రంగాల్లో అగ్ర‌భాగాన ఉంది. తెలంగాణ రాష్ట్రం 14 ప్రాధాన్య‌త రంగాలను ఎంచుకుంది. ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫార్మాస్యూటిక‌ల్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి రంగాల‌ను ఎంచుకున్నాం అని కేటీఆర్ తెలిపారు.

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఫార్మా క్ల‌స్ట‌ర్‌గా ముచ్చ‌ర్ల అవ‌త‌రించ‌బోతోంది అని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ప‌రిశ్ర‌మ‌లు ఒకే చోట ఉంటే ఉత్ప‌త్తి ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌చ్చు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 23 వేల ఎక‌రాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తే.. టీఎస్ఐఐసీ ఏర్పాట‌య్యాక ఆరేండ్ల‌లో 19 వేల‌కు పైగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశామ‌న్నారు. అన్ని ప్రాంతాల్లో స‌మ్మిళిత అభివృద్ధి జ‌ర‌గాలి. ద్వితీయ శ్రేణి ప‌ట్ట‌ణాల‌కు ఐటీ విస్త‌రిస్తాం. ద్వితీయ శ్రేణి ప‌ట్ట‌ణాల్లో 50 వేల ఉద్యోగాల సృష్టే ల‌క్ష్య‌మ‌న్నారు. ప్ర‌తి ప‌రిశ్ర‌మ‌కు తెలంగాణే గ‌మ్య‌స్థానం. సీఎం దృష్టికోణం ఎప్పుడూ దూర‌దృష్టితో ఉంటుంది అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.