Home / EDITORIAL / కొత్త జోన్లపై జాతీయపార్టీల సెల్ఫ్ గోల్ -ఎడిటోరియల్ కాలమ్

కొత్త జోన్లపై జాతీయపార్టీల సెల్ఫ్ గోల్ -ఎడిటోరియల్ కాలమ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ ప్రాంతం తీవ్రంగా నష్టపోయినందుకే తెలంగాణ మలిదశ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో ఉవ్వెత్తున ఎగసింది. 14 ఏండ్ల సుధీర్ఘ ఉద్యమానికి కేంద్ర తల వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వనరులను సద్వినియోగం చేసుకోవడం మీద దృష్టి సారించారు. రూ. లక్ష పై చిలుకు కోట్లతో సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి తెలంగాణ నీళ్ల హక్కుల్ని కాపాడుకోవడం, వ్యవసాయరంగ అభివృద్దికి ప్రణాళికలు రూపొందించారు. అదే సమయంలో వివిధ రంగాలలో వినూత్న సంస్కరణలు చేపట్టారు.

పరిపాలనలో వికేంద్రీకరణ ఉండాలి. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండాలి. స్థానికులకు అత్యధిక ఉద్యోగ అవకాశాలు దక్కాలి. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన. వీటిని దృష్టిలో ఉంచుకుని ముందుగా తెలంగాణను 33 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ కొత్తగా అవసరం మేరకు రెవిన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేశారు. ఎంతో కాలంగా నినాదంగా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చేది అమలుచేశారు. అయితే కొత్తగా ఏర్పడిన జిల్లాలు, మండలాలలో పాత ఉద్యోగాలు, కొత్తగా ఏర్పడే ఖాళీలలో ఉద్యోగాలను ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన జోనల్ వ్యవస్థ, అంతకుముందున్న నిబంధనల ప్రకారం భర్తీ చేస్తే తెలంగాణ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే తెలంగాణ రాష్ట్ర సాధనకు అర్ధం ఉండదు. దానిని గుర్తించిన కేసీఆర్ సుధీర్ఘంగా ఉద్యోగ సంఘాలు, నిపుణులు, మేధావులతో రెండేళ్లపాటు పలుమార్లు చర్చించి కొత్త జోనల్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏర్పడిన తెలంగాణ నూతన జోనల్ వ్యవస్థ, తదనుగుణంగా తెలంగాణ రూపొందించిన జీఓ 317 సుమారు 60 ఏళ్ళుగా తెలంగాణ నియామకాల లో ఉన్న లోటు పాట్ల ను సవరించి తెలంగాణ నిరుద్యోగు యువతకు భవిష్యత్ లో వరప్రదాయినిగా మారబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ మూలంగా రాబోయే తెలంగాణ తరాలకు ఈ నూతన జోనల్ వ్యవస్థ ఆశాజ్యోతి కానున్నది. తెలంగాణలోని ప్రతి మారుమూల ప్రాంతానికి, గ్రామాలకు అన్ని శాఖల ఉద్యోగుల సేవలు అందుబాటులోకి రానున్నవి. తెలంగాణ నూతన జోనల్ వ్యవస్థ యొక్క గొప్ప తనం అర్ధం చేసుకోవాలంటే తెలంగాణ ఉద్యోగ సంబంధిత 100 సంవత్సరాల చరిత్ర ఒక్కసారి మనము గుర్తు చేసుకోవలసి వుంటుంది.
హైదరాబాద్ సంస్థానం ప్రాంతంలోని ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ప్రాంతం వారికే దక్కే విధంగా 1919 లో నిజాం రాజు ముల్కీ నిబంధనలు తీసుకువచ్చారు. 1948లో హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయిన తరువాత రాజ్ ప్రముఖ్ (గవర్నర్) ఫర్మాన్ ద్వారా ముల్కీ నిబంధనలు తిరిగి తీసుకొచ్చారు. 1950 లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత భారత రాజ్యాంగం లోని 35 (b) ఆర్టికల్ ద్వారా హైదరాబాద్ స్టేట్ కు ముల్కీ నిబంధనలు వర్తింపజేశారు. ఆ తదుపరి తెలంగాణ ప్రాంతాన్ని 1956లో ఆంధ్రలో విలీనం చేసిన తర్వాత కూడా భారత రాజ్యాంగం లోని 35 (b) మరియు SRC act, సెక్షన్ 119 ప్రకారం, ముల్కీ నిబంధనల కు రక్షణ కల్పించారు. అయితే ఏవిఎస్ నర్సింహరావు మరికొందరితో కలిసి సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్ లో ముల్కీ నిబంధనల కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.
1969 తెలంగాణ ఉద్యమంలో ముల్కీ నిబంధనలు (స్థానికులకే ఉద్యోగ అవకాశాలు) ముఖ్య పాత్ర పోషించాయి. దీనిని గమనించి 1969లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 8 పాయింట్ ఫార్ములా ( ఒక కమిటీ వేసి ఆంధ్రకు తరలించిన నిధుల లెక్కతీయడం. తిరిగి తెలంగాణకు సమకూర్చడం. తెలంగాణ అభివృద్దికి ముఖ్యమంత్రి అధ్యక్ష్యతన ప్రణాళికలు. ప్రణాళికా సంఘం సలహాదారు అధ్యక్ష్యతన అధికారుల కమిటీ. కమిటీలో అధికారులకు ఎక్కువ అధికారాలు. స్థానికులకు తెలంగాణ ఉద్యోగాలు. తెలంగాణ ఉద్యోగుల సర్వీసు సమస్యల పరిష్కారం.తెలంగాణ అభివృద్దికి కేంద్రం శ్రద్ద వహించడం) తెచ్చారు. 1972 లో అది 5 పాయింట్ ఫార్ములాగా (తెలంగాణ ఆదాయం తేల్చేందుకు కమిటీ . తెలంగాణ అభివృద్ది కమిటీ. ప్రణాళిక అమలు కమిటీ. తెలంగాణ హక్కుల పరిరక్షణకు మేధావుల కమిటీ. తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ) రూపాంతరం చెందింది. ఆ తరువాత ది డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ మరియు కామర్స్ , ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మీద వి.వెంకట్ రెడ్డి వేసిన కేసులో ముల్కీ నిబంధనలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి ముల్కీ నిబంధనల ను 1972 లో మళ్ళీ భారత ప్రభుత్వం గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వారు కొట్లాడి సాధించుకున్న హక్కులకు వ్యతిరేకంగా జై ఆంధ్ర ఉద్యమాన్ని లేవదీసి 6 పాయింట్ పార్ములా (వెనకబడిన ప్రాంతాల అభివృద్ది, విద్యాసంస్థలలో స్థానికులకు సమాన అవకాశాలు. నాన్ గెజిటెడ్ మరియు వివిధ క్యాడర్ ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యత. ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కొరకు పరిపాలన ట్రిబ్యునల్. వీటి అమలుకు, సమస్యల పరిష్కారానికి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ. ఇవన్నీ అమలు చేస్తున్న నేపథ్యంలో ముల్కీ రూల్స్, ప్రాంతీయ కమిటీ కొనసాగింపు అవసరం లేదు) 32 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371 D ని తీసుకువచ్చి 1975 రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా తెచ్చి తెలంగాణ హక్కులను కాలరాశారు.
దీనిమూలంగా జిల్లా స్థాయిలో 20%, జోనల్ క్యాడర్ లో 30%, రాష్ట్రస్థాయిలో 40% స్థానికేతరులకు కేటాయించారు. ఈ బాధను దిగమింగుకుని తెలంగాణ ప్రజలు గత్యంతరం లేక ఒప్పుకోవాల్సిన పరిస్థితి. రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా అప్పటి ప్రభుత్వాలు పాటించక పోవడంతో అప్పటి టీఎన్ జీఓల ఒత్తిడి కారణంగా 1985 లో 610 జీఓ (1975 రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్దంగా నియామకం అయిన స్థానికేతరులను తిరిగి వారి స్వస్థలాలకు పంపించడం) ఇవ్వవలసిన పరిస్థితి వచ్చింది. ఆఖరుకు 610 జీఓ కూడా అమలుకు నోచుకోక తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగడం వలన 2001లో అన్ని పార్టీల అఖిలపక్ష సమావేశం ద్వారా గిర్ గ్లానీ కమిషన్ వేయవలసి వచ్చింది. చివరకు ఆ కమిషన్ రిపోర్టు కూడా అమలుకు నోచుకోలేదు. చారిత్రాత్మక పోరాటం ద్వారా కేసీఆర్ నాయకత్వంలో 2014లో తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తెలంగాణ సాదించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014, సెక్షన్ 97ను అనుసరించి 371డి మరియు రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులోనే ఉండిపోయాయి.
తెలంగాణ ఏర్పడినప్పటి నుండి 1,32,899 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. కానీ ఈ భర్తీ ప్రక్రియ లో తెలంగాణలో పాత జోనల్ వ్యవస్థల వలన, జిల్లా స్థాయి లో 20% , జోనల్ స్థాయి లో 30% , రాష్ట్ర స్థాయి లో 40% స్థానికేతరులకు అవకాశం ఉండడం వలన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం గ్రహించింది. తెలంగాణ యువతకు మంచి జరగాలంటే కొత్త జోనల్ వ్యవస్థ అవసరం అని కేసీఆర్ గారు అన్ని స్థాయిలో 95% లోకల్ రిజర్వేషన్లు ఉండే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 4 (2) సెక్షన్ ప్రకారం , ప్రభుత్వ అవసరాలకు అనుకూలంగా ఉద్యోగుల పంపిణీ చేయాలని, వీలయినంత మేరకు ఉద్యోగి ప్రాధాన్యత ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఏ ఉద్యోగి అయినా ఈ నూతన జోనల్ కేటాయింపు వలన ఇబ్బందికి లోనైతే 60 రోజుల్లో ప్రభుత్వానికి వివరించాలని, ప్రభుత్వం సెక్షన్ 3 నియమాలను అనుసరించి పరిష్కరించాలని రాష్ట్రపతి ఉత్తర్వులలో సూచించారు. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ GO MS 317 ను విడుదల చేసి ఎటువంటి వివక్ష లేకుండా రాష్ట్రపతి ఉత్తర్వులను తూచా తప్పకుండా అమలుచేస్తున్నది.
అయితే కాంగ్రెస్, బిజెపి పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కొరకు తెలంగాణ నిరుద్యోగ యువతకు కల్ప తరువు అయిన నూతన జోనల్ వ్యవస్థ ను తప్పు పడుతూ, జోనల్ వ్యవస్థ మూలంగా బదిలీ అవుతున్న 5 నుండి 10 శాతం ఉద్యోగస్తుల సమస్యల పేరుతో రాజకీయం చేయడం వారి కుటిల రాజకీయ స్వార్థాన్ని తెలియచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ పాలనలో అసమానతల మూలంగా తెలంగాణ ఉద్యమం వచ్చింది. వారి హయాంలో ఇచ్చిన ఏ ఉత్తర్వులను వారు అమలు చేయకపోవడం మూలంగా తెలంగాణ ప్రాంతవాసులు ఎంతో నష్టపోయారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయకపోవడమూ తెలంగాణకు నష్టం చేకూరుస్తున్నది. తెలంగాణలో రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలుపుకొని సుమారు 9.3 లక్షల మంది ఉన్నారు. ఇది జనాభా లో 3% గా ఉంది. దేశంలో అత్యధికంగా ఉద్యోగులు ఉన్న రాష్ట్రం తెలంగాణనే. ఏ రాష్ట్రంలో కూడా అక్కడి జనాభాతో పోలిస్తే 1 నుండి 2.5 శాతానికి మించి లేరు.
ఈ జోనల్ వ్యవస్థ ఖరారు అయ్యాక ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన ఐఎఎస్ ఆఫీసర్ కమిటీ నివేదిక అందిన వెంటనే సుమారు 60-70 వేల ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనున్నది. కేంద్ర ప్రభుత్వంలో సుమారు 15,62,912 ఖాళీలు ఉన్నట్లు గా నివేదికలు చెబుతున్నాయి. గత అయిదు సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం ఆర్మీ మినహా కేవలం 4,44, 813 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసింది. కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం వలన ప్రభుత్వ రంగంలో సుమారు 2.5 లక్షల ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది.
ఇటీవల బీఎస్ఎన్ఎల్ నుండే బలవంతంగా 50,000 మందికి వీఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపిన విషయం ప్రస్తావనార్హం.
1991 నుండి ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం వలన కేంద్రానికి 5 లక్షల కోట్ల రాబడి అందింది.
13 ఏళ్ల బీజేపీ పాలన లో 3.74 లక్షల కోట్ల ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మగా 15 ఏళ్ల కాంగ్రెస్ పాలన లో 1.24 లక్షల కోట్లు ప్రభుత్వరంగ సంస్థలు తెగనమ్మారు. ఈ రెండు జాతీయ పార్టీలు అమ్మిన సంస్థల వలన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు రిజర్వేషన్ లో కోల్పోయిన ఉద్యోగాలు సుమారు 1.2 లక్షలు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రతి గ్రామానికి ప్రభుత్వ పాలన సదుపాయాలు అందాలనే సదుద్దేశంతో రాష్ట్రపతి ఉత్తర్వులు సెక్షన్ 4(2) ను అనుసరించి ఉద్యోగుల విభజన జరిగింది. కొత్త జోనల్ వ్యవస్థ అమలు మూలంగా వివిధ క్యాడర్ లలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులలో కేవలం 5 నుండి 10 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ప్రభావితం అవుతున్నారు. ఈ విషయంలో కూడా ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు పరస్పర బదిలీలు, భార్యాభర్తలు ఒకే చోట పనిచేసే విధంగా సాధ్యమైనంత ఎక్కువ మందికి మేలు జరిగేలా కృషిచేస్తున్నది. కేసీఆర్ తెలంగాణ నిరుద్యోగ యువత కు స్థానిక రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశం తో నూతన జోనల్ వ్యవస్థ తెస్తే ఉన్న రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఊడగొట్టిన బీజేపీ, కాంగ్రెస్ ల కుటిల రాజకియాన్ని తెలంగాణ యువత, ఉద్యోగులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
Written By
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
 తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat