తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ జంట నగరాల నుండి.. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రం నుండి ఉప్పల్ సర్కిల్ కు అక్కడ నుండి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయానికి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
యాదాద్రిలోని లక్ష్మీనరసింహ స్వామివారి మూలవిరాట్ దర్శనాలు పునఃప్రారంభమైన నేపథ్యంలో భక్తుల కోసం యాదాద్రి దర్శిని పేరుతో ఆర్టీసీ మినీ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉప్పల్ నుంచి మినీ బస్సు సర్వీసులను ఎండీ సజ్జనార్‌తో కలిసి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు.
అనంతరం ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాల నుంచి యాదాద్రికి బస్సులు ఏర్పాటు చేశామన్నారు.జేబీఎస్ నుంచి రూ.100, ఉప్పల్ నుంచి రూ.75గా టికెట్ ధరను నిర్ణయించామని వెల్లడించారు. ప్రతి రోజూ 104 సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సాఫీగా సాగుతుందని చెప్పారు.