తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేస్తోంది. పోలీసుశాఖలోని భారీగా ఉన్న ఖాళీల భర్తీకి సోమవారం నోటిఫికేషన్లు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మంగళవారం గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎంతో మంది నిరుద్యోగులు గత కొన్నేళ్లు శిక్షణ పొందుతూ ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. గ్రూప్-1లోని 19 విభాగాలకు చెందిన 503 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మే 2వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లను స్వీకరించనున్నారు. ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండా పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.