Home / EDITORIAL / భరతమాతకే అవమానం!

భరతమాతకే అవమానం!

‘మొక్కై వంగనిది మానై వంగునా?’ అని ఓ నానుడి. తొలిదశలో సన్మార్గంలో నడువనది, ఆ తర్వాత ఎలా నడుస్తుందనేది ఆ నానుడి సారాంశం. అలా దారి తప్పిన కొందరు వ్యక్తులు చేసిన తప్పునకు ఇప్పుడు అంతర్జాతీయంగా భారత సమాజం తలదించుకోవాల్సి వస్తున్నది.ఇద్దరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో ప్రపంచదేశాలు భారత్‌ వైపు అనుమానంగా, ఆగ్రహంగా చూస్తున్నాయి. కువైట్‌, దుబాయ్‌, ఖతార్‌, ఒమన్‌, ఇరాన్‌, సౌదీ అరేబియా, ఇండోనేషియా తమ దేశాల్లో ఉన్న భారత రాయబారులకు సమన్లు ఇచ్చాయి. భారత్‌ లో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని చెప్పాయి. వారి వ్యాఖ్యలు తమను తీవ్రంగా కలచివేశాయని పేర్కొన్నాయి. దేశ భక్తులుగా చెప్పుకొనేవాళ్లు దేశాన్ని ఎంత అధఃపాతాళానికి తీసుకెళ్లారంటే… చివరికి జోర్దాన్‌, బహ్రెయిన్‌, లిబియా, అఫ్ఘానిస్థాన్‌ వంటి దేశాలు కూడా భారత్‌ను క్షమాపణకు డిమాండ్‌ చేస్తున్నాయి.

రాజకీయంగా లబ్ధి చేకూరుతుందనుకుంటే బీజేపీ నేతలు ఎంతకైనా దిగజారుతారనేదానికి ఈ ఘటనే సాక్షి. ఇప్పటికే దేశంలో మతాల పేరుతో రాజకీయాలు చేస్తూ బీజేపీ కల్లోలం రేపుతున్నది. మతాల మధ్య చిచ్చుపెడుతున్నది. చట్టసభల్లో ఉన్నవారే మతం పేరుతో యువతను రెచ్చగొడుతున్నారు. ఎన్నికల వేళ పబ్బం గడుపుకొంటున్నారు. ప్రజలు కొట్టుకుని చస్తే.. ఆ శవాలపై కమలనాథులు అధికార పీఠం వేసుకుంటున్నారు.ఈ మత విద్వేషాల ఉచ్చులో పడితే దేశానికే ప్రమాదకరం. ప్రపంచమంతా మనవైపు వేలెత్తి చూపిస్తే, ఆయా దేశాల్లో ఉన్న మనదేశ పౌరుల పరిస్థితి ఏమిటి? ఒక్క గల్ఫ్‌ దేశాలే కాదు, రేపటి రోజు బీజేపీ మాటలకు, చేతలకు విసిగిపోయి.. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా వంటి దేశాలు మనపై నిషేధం విధిస్తే మన పరిస్థితి ఏమిటి? దేశ వాణిజ్య సంబంధాలు, దిగుమతులు, ఎగుమతులు ఏమైపోవాలి. ఆహారధాన్యాల సరఫరా ఏమవ్వాలి? ఐరాస లెక్కల ప్రకారం 1.8 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఉన్నారు. ఇతర దేశాల్లో ఉంటున్న పౌరుల లెక్కల్లో భారత్‌ ప్రథమ స్థానంలో ఉన్నది. వీరంతా ఎక్కువగా ముస్లిం, క్రిస్టియన్‌ మెజారిటీ దేశాల్లోనే ఉన్నారు. 2018 భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం 3.2 కోట్ల మంది ఎన్నారైలు, భారత సంతతి వ్యక్తులు ఇండియా బయట ఉంటున్నారు. వీరిలో 1.5 కోట్ల మంది ఇస్లామిక్‌ దేశాల్లోనే ఉంటున్నారు.

ఒకవేళ మేం ముస్లింలకే ఉద్యోగాలిస్తామని ఆయా దేశాలు నిర్ణయించుకుంటే పరిస్థితి ఏమిటి? వాళ్లంతా ఆయా దేశాల్లో ఉద్యోగాలు కోల్పోయి ఇండియా బాట పట్టాల్సి వస్తుంది. అప్పుడు వాళ్లకు ఉద్యోగాలు ఎవరివ్వాలి.? ఇప్పటికే దేశం నిరుద్యోగ సమస్యతో అల్లాడుతున్నది. మోదీ ప్రధాని అయ్యాక నిరుద్యోగిత రేటు అంతకంతకూ పెరిగిపోతున్నది.విదేశాల్లో ఉంటున్న భారతీయులు దేశానికి పంపిస్తున్న నగదు విలువ, దేశ పౌరులు చెల్లిస్తున్న పన్ను కంటే ఎక్కువ. గత మూడేండ్లలో ఇన్‌వర్డ్‌ రెమిటెన్స్‌గా వచ్చిన నగదు విలువ రూ.19 లక్షల కోట్లు. ఇది కేంద్ర ప్రభుత్వ ట్యాక్స్‌ రెవెన్యూ కంటే ఎక్కువ. 2021లో ఇది రూ.6,90,987 కోట్లు. దేశంలో వసూలవుతున్న ఆదాయపన్ను కంటే ఇది 40 శాతం ఎక్కువ. ఇన్‌వర్డ్‌ రెమిటెన్స్‌గా వస్తున్న దాంట్లో రూ.3 లక్షల కోట్లు ఇస్లామిక్‌ దేశాల నుంచే ఉంది. ఇది యూపీ, బీహార్‌లో వసూలవుతున్న పన్నులకు రెట్టింపు. ఇక ఆయా దేశాలతో వాణిజ్య లావాదేవీలు భారీ ఎత్తునే ఉన్నాయి. కేవలం నాలుగు గల్ఫ్‌ దేశాలతో భారత్‌ వాణిజ్యం విలువ రూ.3.1 లక్షల కోట్లు.

ఒకవేళ బీజేపీ నేతల హేట్‌ స్పీచ్‌ కారణంగా.. గల్ఫ్‌ దేశాలు భారత్‌తో సంబంధాలు తెంచుకుంటే పరిశ్రమల పరిస్థితి ఏమిటి? ఆర్డర్లు ముస్లిం దేశాలకే ఇచ్చుకుంటామని ఆయా దేశాలు నిర్ణయం తీసుకుంటే.. మన ఎగుమతులు, వాటి ఉత్పత్తి కోసం శ్రమిస్తున్న కార్మికుల జీవితం ఏమవ్వాలి? ఇప్పటికే ఆ దేశాల్లో భారత వస్తువుల బహిష్కరణ ఊపందుకుంటున్నది. ఖతార్‌లో ఓ షాపింగ్‌ మాల్‌ లో భారతీయ ఉత్పత్తులను తొలగించారు. ఇవేవీ ఆలోచించకుండా.. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం బీజేపీ నేతలకు అలవాటైపోయింది. ఎగుమతులే కాదు, గల్ఫ్‌ దేశాల నుంచి అనేక సరుకులు భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా ముడి ఇంధనంలో చాలావరకు ఇస్లామిక్‌ దేశాల నుంచే వస్తున్నది. ఒకవేళ ఇంధనం సరఫరా చేయబోమని గల్ఫ్‌ దేశాలు తెగేసి చెప్తే.. యూరప్‌ దేశాలకు భారత్‌ క్యూ కట్టాలి. అప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇప్పుడున్న దానికి రెట్టింపయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పుడు దీనంతటికి కారణమెవరా అని ఆలోచిస్తే బీజేపీ నేతలే కనిపిస్తారు.

రెచ్చగొట్టే బీజేపీ వ్యాఖ్యలు దేశానికే ప్రమాదకరమని కేసీఆర్‌ చాలా సందర్భాల్లో హెచ్చరించారు. అన్ని మతాలు, కులాలను సమానంగా చూసే దేశంలో కొందరు చిచ్చుపెట్టాలని చూస్తున్నారన్నారు. ఈ సామరస్య వాతావరణం చెడిపోతే ఎటూ కాకుండాపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్‌ లాంటి మతపిచ్చి అంటుకుంటే ప్రమాదంలో పడతామని చెప్పారు. దీనిపై అవాకులు చెవాకులు పేలిన బీజేపీ నాయకులు నేడు ఏం సమాధానం చెప్తారు? మహ్మద్‌ ప్రవక్త గురించి అవమానకరంగా మాట్లాడిన ఇద్దరు నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది. కానీ వారిని శాశ్వతంగా పార్టీ నుంచి తొలగించలేదు. గొడవ సద్దుమణిగాక వాళ్ల పదవులు వాళ్లకు ఉంటాయన్నమాట.బీజేపీ నేతల విద్వేషపూరిత మాటలు కొత్తేం కాదు. కానీ ఈసారి ఏకంగా మహ్మద్‌ ప్రవక్తపైనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కొత్త. అది కూడా ఓ మీడియా ఛానల్‌లో కూర్చొని. ‘మేం భరతమాత ముద్దు బిడ్డలం’ అని చెప్పుకొనే బీజేపీ నేతలు.. తమ నీచ రాజకీయాల కోసం ఇప్పుడు అదే భరతమాతను అవమానించడం అత్యంత గర్హనీయం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat