లుంగీ కట్టుకుని థియేటర్‌కు వచ్చాడని మేనేజ్మెంట్ సినిమా టికెట్ నిరాకరించింది. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి సదరు వ్యక్తి చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో థియేటర్ మేనేజ్మెంట్ వివరణ ఇచ్చింది.
బంగ్లాదేశ్‌లోని మీర్పూర్లో ఉన్న ‘స్టార్ సినీ ప్లెక్స్’లో ‘పోరన్’ సినిమా ఆడుతోంది. ఆ సినిమా చూసేందుకు సమన్ అలీ సర్కార్ అనే వ్యక్తి లుంగీ ధరించి వెళ్లారు. అయితే ఆ కారణంతోనే తనకు సినిమా టికెట్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో మేనేజ్మెంట్ వివరణ ఇచ్చింది.
వస్త్రధారణ ఆధారంగా కస్టమర్ల పట్ల ఎలాంటి వివక్ష చూపించడం లేదని తమ ఫేస్బుక్ పేజీలో తెలిపింది. సమన్ అలీ సర్కార్ అనే వ్యక్తి అపార్థం చేసుకున్నారని.. జరిగిన దానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత సమన్ అలీతో పాటు ఆయన కుటుంబసభ్యులు అదే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసేందుకు ఆహ్వానించింది.