ఎన్నో అంచనాల మధ్య ఇటీవల రిలీజ్ అయిన మూవీ ‘లైగర్’. విజయ్‌దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఎంత క్రేజ్ ఉన్న నటులున్నా.. కంటెంట్ సరిగా లేకపోతే ప్రేక్షకులు థియేటర్‌కు రారనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది. కథ బాగుంటే నటులతో పనిలేదనే విషయాన్ని ఇటీవలే ‘సీతారామం’ నిరూపించింది.
విజయ్ దేవరకొండలాంటి మాస్ హీరో, మైక్‌టైసన్ లాంటి ఇంటర్నేషనల్ బాక్సర్ ఉన్నప్పటికీ కథలో బలం లేకపోవడంతో ‘లైగర్’ డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలో ఆ సినీ నిర్మాతగా ఉన్న ఛార్మి స్పందించారు. 2019 నుంచి లైగర్ కోసం ఎంతో కష్టపడ్డామని.. కరోనా కారణంగా మూడోళ్ల తర్వాత సినిమాను రిలీజ్ చేశామని చెప్పారు. ఎన్నో అడ్డంకులను తొలగించుకుని థియేటర్‌లో ‘లైగర్’ రిలీజ్ చేసినా.. మూవీ ఫెయిల్యూర్ కావడం బాధగా అనిపిస్తోందని ఛార్మి ఆవేదన వ్యక్తం చేశారు.