ప్రస్తుత అధునీక బిజీబిజీ జీవన గమనంలో సమయానికి కాస్త తిండి.. సరిపడా నిద్ర పోని వారిని చాలా మందిని మనం చూస్తున్నాము. ఇలా చేయడం వలన ఎన్నో అనారోగ్య కారణాలకు గురవుతుంది. అయితే సమయానికి తింటేనే ఆరోగ్యంగా ఉంటామని ఇటు మన పెద్దలు.. వైద్యులు నిత్యం చెప్పే మంచి మాట.
అంతే కాకుండా రాత్రిపూట త్వరగా తిని కంటినిండా హాయిగా నిద్రపోవాలని కూడా సూచిస్తారు. కానీ ఈ విషయాన్ని చాలా మంది పెడచెవిన పెడతారు. కానీ రాత్రిపూట మరీ ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఊబకాయం పెరిగిపోతుందని ఇటీవల అమెరికాలో జరిగిన ఓ అధ్యయనం వెల్లడించింది.
ఇందులో భాగంగా వేళకు తినేవారితో పాటు, వారికంటే నాలుగు గంటలు ఆలస్యంగా తినేవారి మీదా పరిశోధనలు జరిపారు. బరువు నియంత్రణ- ఊబకాయ ప్రమాదం, ఆహారంలో తీసుకునే క్యాలరీలు, క్యాలరీలను ఖర్చుచేయడం, కొవ్వు కణజాలాల్లో కలిగే మార్పులు.. తదితర అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. సాధారణ వేళలకు ఆహారం తీసుకునే వారికంటే, అర్ధరాత్రిళ్లు తింటున్న వారికే ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువని తేలింది. కాబట్టి, సమయానికి తినడం ఆరోగ్యానికి మంచిదని మరోసారి రుజువు అయ్యిందన్నమాట.