నరక చతుర్దశి వేకువ జామున చంద్రోదయం అయిన తర్వాత ఒక గంట వరకు (సూర్యోదయానికి ముందు) దేవతలకూ, బ్రాహ్మణులకూ, పెద్దలకూ, తల్లికి, గోవులకు నీరాజనం (హారతులు) ఇచ్చి వాళ్ల దీవెనలు పొందాలన్నది శాస్త్ర వచనం. తర్వాత అభ్యంగన స్నానం ఆచరించి దేవతారాధన చేయాలి.
అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లు తలపై నువ్వుల నూనె అంటి, నుదుట కుంకుమబొట్టు పెట్టి మంగళహారతి ఇస్తారు. తోబుట్టువుల మధ్య అనుబంధాలు పదికాలాలు పచ్చగా ఉండాలన్నది ఈ వేడుకలో అంతరార్థం. ప్రతిరోజూ మంగళప్రదంగా కొనసాగాలని ఆడపడుచుల నుంచి హారతులు అందుకొని, యథాశక్తి వారికి బహుమతులు సమర్పించడం సంప్రదాయంగా స్థిరపడింది. దీపావళి సందర్భంగా అపమృత్యుదోషం నశించడం కోసం నరకాధిపతి యముడి ప్రీత్యర్థం దీపదానం కూడా చేస్తారు. తర్వాత అమావాస్య రాత్రి లక్ష్మీపూజ నిర్వహించాలని శాస్త్ర వచనం.