కొడుకు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి తమకు చోదోడు వాదోడుగా ఉంటాడని భావించిన ఆ తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. చదువును మధ్యలోనే ఆపేసి.. చెడు వ్యవనాలకు బానిసై.. నిత్యం తాగుతూ వావి వరసలు లేకుండా కన్న తల్లితోనే అనుచితంగా ప్రవర్తించాడు. కొడుకు చేష్టలతో విసుగు చెందిన తల్లిదండ్రులు ఇలాంటి కొడుకు ఉన్నా లేకున్నా ఒకటే అనుకొని సుపారీ ఇచ్చి మరీ కన్న కొడుకును చంపించేశారు. కొడుకు మృత దేహాం సూర్యపేట జిల్లా పాలకవీడు శూన్యంపహాడ్ వద్ద మూసీ నదిలో లభ్యం కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
క్షత్రియ రామ్‌సింగ్, రాణిబాయి దంపతులు. వీరికి సాయినాథ్ అనే కొడుకు, ఓ కూతురు ఉన్నారు. వీరింతా ఖమ్మంలో నివసిస్తున్నారు. రామ్‌సింగ్ సత్తుపల్లిలోని ఓ రెసిడెన్షియల్ కాలేజ్‌లో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. సాయినాథ్ డిగ్రి మధ్యలోనే ఆపేసి డబ్బుల కోసం తల్లిదండ్రులను నాలుగేళ్లగా విసిగిస్తున్నాడు. అంతటితో ఆగకుండా ఇటీవల తల్లితో అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో వారు కొడుకును చంపేయాలని నిర్ణయించుకుని మిర్యాలగూడలో ఉంటోన్న సాయినాథ్ మేనమామ సత్యనారాయణ సింగ్‌కు విషయం చెప్పారు.
ఆయన అక్కడో ఆటో డ్రైవర్‌ను ఆశ్రయించాడు. ఆయన మరో ముగ్గురితో కలిసి రూ.8లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అక్టోబరు 18న మేనమామ సాయినాథ్‌ను దావత్ ఉందని నల్గొండ జిల్లా కల్లేపల్లిలోని మైసమ్మ ఆలయం దగ్గరకు తీసుకెళ్లాడు. అందరూ అక్కడ మద్యం తాగి తర్వాత సాయినాథ్‌కు ఉరి బిగించి చంపేశారు. అనంతరం శవాన్ని మూసీ నదిలో పడేశారు. అక్టోబరు 19న శవం తేలడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. మూడు రోజులు తర్వాత తల్లిదండ్రులు శవాన్ని తీసుకెళ్లారు. శవం కోసం తల్లిదండ్రులు వచ్చిన కారు హత్య రోజు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన కారు ఒకటే అని గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయగా తల్లిదండ్రులు కొడుకును తామే చంపేశామని ఒప్పుకున్నారు. దీంతో వారితో పాటు మేనమామ, మరో నలుగురిని అరెస్టు చేశారు.