మీ చర్మ సంరక్షణ సాధనాల్లో ఉప్పు ఉందా? లేకపోతే, ఇప్పుడే సముద్రపు ఉప్పును ప్రయత్నించండి. దీనివల్ల తల నుంచి పాదాల వరకూ ఎన్నో ఉపయోగాలు. సముద్రపు ఉప్పులో సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.
కొబ్బరినూనెలో కొంత సముద్రపు ఉప్పు కలిపి పెదాలకు రాసుకోవాలి. కాసేపటి తర్వాత చల్లని నీళ్లతో కడగాలి. ఈ చిట్కాను రోజుకు రెండుసార్లు ప్రయత్నిస్తే చాలు.. పెదాల పగుళ్లను నియంత్రించవచ్చు.రెండు చెంచాల సముద్రపు ఉప్పుతో సమానంగా బ్రౌన్ షుగర్, ఒక చెంచా కొబ్బరినూనె, రెండు చెంచాల ముడి చక్కెర కలిపి చర్మానికి రాసుకోవాలి. గంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల ఒంటిమీదున్న మృతకణాలను వదిలించుకోవచ్చు. పొడి చర్మానికి తిరుగులేని పరిష్కారమిది. శరీరం మృదువుగా మారుతుంది.
నోట్లోని సూక్ష్మక్రిములను తొలగించుకోడానికి, చిగుళ్లను బలోపేతం చేయడానికి ఓ మార్గం ఉంది. గోరువెచ్చని నీళ్లలో వంటసోడా, సముద్రపు ఉప్పు కలిపి మౌత్‌వాష్‌గా వాడుకోవచ్చు. దీనివల్ల తాజా శ్వాస సొంతమవుతుంది. చిగుళ్ల రక్తస్రావాన్ని అరికట్టవచ్చు.సముద్రపు ఉప్పును కొబ్బరినూనెతో కలుపుకొని.. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ఎంతో ప్రయోజనం. ముఖ చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.చర్మంపై పగుళ్లను, మొటిమలను నివారించేందుకు చెంచాడు ఉప్పులో తగినంత తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి మూడుసార్లు ఈ చిట్కా ప్రయత్నిస్తే.. మెరుగైన ఫలితాలు ఉంటాయి.