జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి.. ప్రతిపక్ష పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు అయిన ఫరూఖ్ అబ్దుల్లా ఆ పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకున్నారు. వయో సంబంధిత కారణాల రీత్యా అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. డిసెంబర్ 5న కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆయన ప్రకటించారు.
దీంతో ఆయన కుమారుడు, ప్రస్తుత ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా.. ఎన్సీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నది.ఫరూఖ్ అబ్దుల్లా.. 1980లో శ్రీనగర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నియ్యారు. మరుసటి ఏడాదే అంటే 1981, ఆగస్టులో జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
ఆయన తండ్రి షేఖ్ అబ్దుల్లా అప్పటివరకు ఆ పదవిలో కొనసాగారు. అయితే ఆయన మృతితో ఫరూఖ్ అబ్దుల్లా పార్టీ పగ్గాలు చేపట్టారు. అనంతరం 1982లో జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఎన్నికయ్యారు. మొత్తం నాలుగుసార్లు కశ్మీర్ సీఎంగా ఆయన పనిచేశారు. యూపీఏ ప్రభుత్వంలో 2009 నుంచి 2014 వరకు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.