Home / SLIDER / వైద్య విద్య కేరాఫ్‌ తెలంగాణ

వైద్య విద్య కేరాఫ్‌ తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం కార్పొరేట్‌ వైద్యాన్ని అందుబాటులోకి తెస్తున్న తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్య విషయంలో కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. జిల్లాకో మెడికల్‌ కాలేజీని నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు పీహెచ్‌సీ నుంచి అన్ని స్థాయిల దవాఖానలను పటిష్ఠం చేస్తున్నది. ఈ క్రమంలో గత ఎనిమిదేండ్లలో 12 మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి రాగా.. యూజీ, పీజీ సీట్లు గణనీయంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా పెరిగిన మెడికల్‌ సీట్లతో పోల్చితే రాష్ట్రంలో యూజీ, పీజీ సీట్ల పెరుగుదల రేటు దాదాపు 50 శాతం అధికంగా ఉండటం విశేషం. రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచితంగా మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించి ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓవైపు దవాఖానల్లో వసతులు పెంచుతూ.. మరోవైపు వైద్యుల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. మరోవైపు రాష్ట్రంలో వైద్యుల సంఖ్యను పెంచేందుకు, నిపుణులైన వైద్యులు తయారయ్యేందుకు జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. గత ఎనిమిదేండ్లలో సగటున ప్రతి రెండేండ్లకు మూడు మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఎనిమిది కాలేజీల్లో తరగతులను సీఎం కేసీఆర్‌ ఇటీవలే ప్రారంభించారు.

జాతీయ సగటును మించి..
———————-
2014-15 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో కలిపి యూజీ, పీజీ సీట్ల పెరుగుదల రేటును పోల్చినప్పుడు జాతీయ సగటు కన్నా తెలంగాణ మెరుగైన స్థానంలో నిలిచింది.

ఎంబీబీఎస్‌ సీట్లు…:
———————-
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2014-15లో జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్‌ సీట్లు 54,352 ఉండేవి. 2022-23 సంవత్సరానికి వాటి సంఖ్య 93 వేలకు పెరిగింది. అంటే.. ఎనిమిదేండ్లలో సుమారు 71 శాతం సీట్లు పెరిగాయి.
తెలంగాణ ఏర్పడేనాటికి ప్రభుత్వ, ప్రైవేట్‌ కలిపి 2,950 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండేవి. కొత్తగా ప్రారంభించిన మెడికల్‌ కాలేజీలతో కలిపి యూజీ సీట్ల సంఖ్య 6,715కు చేరింది. అంటే.. 127 శాతం పెరుగుదల నమోదైంది.

జాతీయ సగటు కన్నా తెలంగాణ 56 శాతం అధిక వృద్ధిని సాధించింది.

పీజీ సీట్లు…:
———————-
మోదీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో జాతీయ స్థాయిలో పీజీ సీట్లు 25,416 ఉండేవి. ఈ విద్యాసంవత్సరానికి వాటి సంఖ్య 42,717కు చేరుకున్నది. పెరుగుదల 68 శాతం.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలన మొదలైనప్పుడు పీజీ సీట్లు 1180 ఉన్నాయి. ప్రభుత్వ చర్యల ఫలితంగా ఎనిమిదేండ్లలో ఈ సంఖ్య 2,501కి పెరిగింది. అంటే 112 శాతం వృద్ధిరేటు నమోదైంది.
జాతీయ సగటుతో పోల్చితే తెలంగాణ 44 శాతం వృద్ధిరేటును అధికంగా సాధించింది.

మారుమూల జిల్లాలకు ‘డబుల్‌’..
———————————–
మెడికల్‌ కాలేజీ అంటే కేవలం చదువు మాత్రమే కాదు.. నాణ్యమైన వైద్యం, సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించే కేంద్రం. జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తుండటంతో మారుమూల జిల్లాలకు కాలేజీలు విస్తరిస్తున్నాయి. తాజాగా ప్రారంభించిన కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 54 శాతం మారుమూల జిల్లాల్లోనే ఉన్నాయి. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో 27 శాతం కాలేజీలు మాత్రమే మారుమూల జిల్లాల్లో వైద్యవిద్య అందిస్తున్నాయి. అంటే.. మారుమూల ప్రాంతాల ప్రజలకు రెట్టింపు సంఖ్యలో వైద్యవిద్య, వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ‘సీట్ల అందుబాటు’ విషయంలోనూ తెలంగాణ మెరుగైన స్థానంలో నిలిచిందని నిపుణులు చెప్తున్నారు. ఇటీవల నిర్వహించిన నీట్‌కు దేశవ్యాప్తంగా సుమారు 18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి 93 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే.. సుమారు 5 శాతం మాత్రమే. ఇదే సమయంలో తెలంగాణ నుంచి నీట్‌కు 61 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. వీరికి 6,715 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే.. 11 శాతం. ఇది జాతీయ సగటు కన్నా రెట్టింపు కావడం విశేషం. వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇటీవల 8 కాలేజీల తరగతులను ప్రారంభించే సమయంలోనూ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఈ లెక్కన వచ్చే ఏడాది సుమారు 9 కాలేజీలు, ఆ తర్వాత మరో 8 కాలేజీలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఇవి కూడా పూర్తయితే రాష్ట్రంలో యూజీ, పీజీ సీట్లు గణనీయంగా పెరిగి, విద్యార్థులకు విద్యావసతి, ప్రజలకు నాణ్యమైన వైద్య వసతి సమకూరనున్నది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat