Fire accident follow up: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో భవనంలోని మొదటి అంతస్తులో ఒక అస్థిపంజరాన్ని అధికారులు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన రోజు…..భవనంలో చిక్కుకుపోయిన ముగ్గురిలో ఆ అస్థిపంజరం ఎవరిదనేది ఇంకా తెలియలేదు.
అంతకుముందు ప్రమాదం జరిగిన దక్కన్ మాల్ సమీపంలోని నల్లగుట్ట ప్రాంతంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ప్రమాదం జరగడంతో భయాందోళనకు గురైనట్లు స్థానికులు వాపోయారు. ప్రమాదానికి గురైన భవనం కూలిపోతే తీవ్రంగా నష్టపోతామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
పరిస్థితి మెరుగయ్యే వరకు అధికారులు తోడుగా ఉంటారని మంత్రి తలసాని అన్నారు. ప్రమాదంతో నష్టపోయినవారికి పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి పాత భవనాలు కూల్చివేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలపై రాజకీయ నాయకులు ఆచితూచి మాట్లాడాలని మంత్రి అన్నారు. ఎలా పడితే అలా మాట్లాడటం సరికాదన్నారు. విమర్శలు చేస్తే బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తలసాని స్పష్టం చేశారు.