KOTAM REDDI: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికీ అధికార, ప్రతిపక్షాలు విమర్శల అస్త్రాలు సంధిస్తునే ఉన్నారు. ఈ వాడీ వేడీ రాజకీయాల్లో కోటంరెడ్డి కూడా ఘాటుగానే బదులిస్తున్నారు.
ఇప్పటివరకు ఎవరికీ నమ్మకద్రోహం చేయలేదని కోటంరెడ్డి ధ్వజమెత్తారు. అవమానం జరిగిన చోట ఉండకూడదనే అధికారం వదులుకునేందుకు సిద్ధమయ్యానని వ్యాఖ్యానించారు.
మరో 10 నెలలకు పైగా అధికారంలో ఉండే ప్రభుత్వంపై విమర్శలు చేస్తే పరిణమాలు ఎలా ఉంటాయో తెలుసని కోటంరెడ్డి తెలిపారు. అలాగని ఇష్టం లేని చోట.. అవమానం జరిగాక పార్టీలో ఉండటం ఇష్టం లేకే దూరంగా ఉంటున్నానని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని తెలిసి చాలా బాధ కలిగిందని వాపోయారు. అక్కడ ఉండలేక ఆధారాలు చూపించి బయటకు వచ్చేసినట్లు తెలిపారు.
మోసం చేయాలని ఎప్పుడూ అనుకోలేదని ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు దొరికాక దూరం జరిగానని స్పష్టం చేశారు. మౌనంగానే ఉందామనుకుంటే వైకాపా నేతలు ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేశారని….అందుకే మీడియా ముందుకు వచ్చానని స్పష్టం చేశారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఫోన్ ట్యాపింగ్ ఆషామాషీగా జరగదని కోటంరెడ్డి అన్నారు. ఈ ట్యాపింగ్ అధికారుల పని కాదు.. ప్రభుత్వ పెద్దల పనే అని ఆరోపించారు. ఏపీ మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తనపై చేసిన విమర్శలు బాధకలిగించాయని కోటంరెడ్డి అన్నారు. నా బిడ్డలు ఏం చేశారు? వాళ్లపై విమర్శలు ఎందుకు అని ప్రశ్నించారు. తాను మోసం చేసేవాణ్ని అయితే ఎన్నికల వరకు ఉండి చివరలో పార్టీ మారేవాడినని స్పష్టం చేశారు. అనిల్‌కుమార్ తొలిసారి ఓడిపోయినప్పుడు తను, తన భార్య, పిల్లలు భోజనం కూడా చేయలేదని తెలిపారు. తాను చంద్రబాబును కలిసినట్టు చేస్తున్న ప్రచారం అసత్యమని అన్నారు.