సహాజంగా శరీరంలో కణ విభజన అసాధారణంగా జరిగిపోతూ మనిషి ప్రాణాలకు ముప్పుగా పరిణమించే వ్యాధి క్యాన్సర్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలతో మూడోవంతు క్యాన్సర్లను నయం చేయగలుగుతున్నాం. అలా అని, క్యాన్సర్ నుంచి కోలుకున్న వారి జీవితం సాఫీగా సాగిపోతుందన్న భరోసా లేదు.
అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. దీర్ఘకాలిక మగత, నొప్పి, శరీర వ్యవస్థ పనితీరు మందగించడం, హార్మోన్ల అసమతుల్యత, వంధ్యత్వం.. తదితర దుష్ప్రభావాలు వెంటాడుతూనే ఉంటాయి. ఈ దశలో గుండెజబ్బులు, కిడ్నీ రోగాలు, మధుమేహం లాంటి రుగ్మతలూ ఇబ్బంది పెడతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. ఈ సవాళ్లను ఆత్మవిశ్వాసంతో అధిగమించడం సాధ్యమే.
జీవనశైలి మార్పులు వ్యాయామం, సమతుల ఆహారం, యోగా, ధ్యానం, కౌన్సెలింగ్ తదితర మార్గాల్లో ఒత్తిడిని తట్టుకోవచ్చు. ఆరోగ్యకర జీవనశైలిని కొనసాగించవచ్చు. అవగాహన రోగికే కాదు.. అతని కుటుంబానికి, సన్నిహితులకు కూడా ఆ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పు గురించి అవగాహన అవసరం. సపోర్ట్ గ్రూప్స్ అప్పటికే క్యాన్సర్‌ను గెలిచినవారి మధ్యలో కాలం గడపడం వల్ల భావోద్వేగపరమైన అండ లభిస్తుంది.
అనుభవాలను పంచుకోవచ్చు. డాక్టర్‌తో సంప్రదింపులు ఒడ్డున పడిన తర్వాత కూడా.. క్యాన్సర్ నిపుణులను సంప్రదిస్తూ ఉండాలి. శరీరంలో కొత్త మార్పులు, రోగ ప్రభావాల గురించి నిపుణులతో చర్చించాలి. సర్దుబాట్లు క్యాన్సర్ చికిత్స మనసుపైనా ప్రభావం చూపి ఉంటుంది. దానికితోడు సమాజం నుంచి ఎదురయ్యే వివక్ష కూడా బాధపెడుతుంది. ఖరీదైన వైద్యం కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వీటన్నిటినీ సమర్థంగా ఎదుర్కోవాలి.