దేశంలో గత నెల రోజులుగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో యాక్టివ్ కేసులు కూడా అధికమవుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 10,093 మంది వైరస్ బారిన పడగా, 23 మంది మృతిచెందారు.
తాజా కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 4,48,18,115కు చేరింది. ఇందులో 57,542 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,31,114 మంది మరణించారు. మరో 4,42,29,459 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 5.61 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో 0.13 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, 98.68 శాతం మంది కోలుకున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.