బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ రేవంత్ రెడ్డి నిన్న చేసిన ఆరోపణలను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు తీవ్రంగా ఖండించారు. ఈరోజు బీఆర్ఎస్ఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి సబ్జెక్టు మీద అవగాహన లేదన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పటిలాగే ప్రభుత్వం పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీపీసీసీ పదవిని అడ్డుపెట్టుకొని కేవలం డబ్బు సంపాదించాలనే తప్ప రేవంత్ రెడ్డికి మరో ఉద్దేశ్యం లేదన్నారు.
ప్రజలకు ఏం కావాలో ఏనాడు ప్రశ్నించలేదన్నారు. పచ్చ నోట కనిపించేవాడికి అంత పచ్చగానే కనిపిస్తుందన్నారు. గౌరవ మంత్రి కేటీఆర్ గారు విదేశాలకు వెళ్లి రాష్ట్రంలోకి పెట్టుబడులను తీసుకొస్తున్నారు, అనేక కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తున్నారు, ఇక్కడకి వచ్చే కంపెనీలు కాంగ్రెస్ అధ్యక్షుడుకి కనపడటం లేదా అని ప్రశ్నించారు. ఇక్కడికి వచ్చే కంపెనీలు చూసి ఇక్కడ నాయకులకు మింగుడు పడటం లేదన్నారు. గడిచిన ఏళ్లలో సీఎం కేసీఆర్ గారి అధినాయకత్వంలో మంత్రి కేటీఆర్ గారి సారధ్యంలో టీఎస్ ఐపాస్ ద్వారా సుమారు 22 వేల ఒక వందకు పైగా కంపెనీలు రాష్ట్రంలో అనుమతులు పొంది.. సుమారు 3 లక్షల 31 వేల కోట్ల పెట్టుబడులు వచ్చి.. 22 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయన్నారు.
ఎట్లైనా సరే బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేయాలని, మంత్రి కేటీఆర్ గారు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తుంటే ఓర్వలేకపోతున్నారని అన్నారు. అసత్య ఆరోపణలతో విపక్షాలు ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆధారాలతో మాట్లాడాలన్నారు. రేవంత్ రెడ్డికి గత ఎన్నికల్లో ఓడినా బుద్ధి రాలేదన్నారు. మంత్రి కేటీఆర్ గారు విదేశాల్లో పర్యటిస్తూ అనేక పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువస్తున్న మాట వాస్తవం కాదా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. తమ ప్రభుత్వం, నాయకులపై చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. కాంగ్రెస్ నాయకులు 111జీవో పైన అనేక ఆరోపణలు చేస్తున్నారని, 111 జీవో ఎత్తివేయాలని 84 గ్రామాల ప్రజలు కోరుకున్నారని అన్నారు. ప్రతి ఎన్నికల సభల్లో గౌరవ సీఎం కేసీఆర్ గారు 111 జీవోని ఎత్తివేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఈటల రాజేందర్ కూడా వేల కోట్ల లాభం ఉందని మాట్లాడుతున్నారు. 111 జీవో పైన మాట్లాడుతున్న నాయకులు 84గ్రామాలకు వెళ్లి సభలు పెట్టి 111 జీవో ఉంచాలని చెప్పే దమ్ము, ధెర్యం ఉందా అని సవాల్ చేశారు.