Breaking News
Home / SLIDER / మొబైల్స్‌, కంప్యూటర్లకు వచ్చే వైరస్‌లు ఎన్ని రకాలు ఉంటాయి?

మొబైల్స్‌, కంప్యూటర్లకు వచ్చే వైరస్‌లు ఎన్ని రకాలు ఉంటాయి?

ఆండ్రాయిడ్‌ యూజర్లను ఇప్పుడు దామ్‌ వైరస్‌ వణికిస్తుంది. ఈ మాల్‌వేర్‌ స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడి ముఖ్యమైన సమాచారాన్ని హ్యాక్‌ చేయడంతో పాటు కాల్‌ రికార్డింగ్‌లు, కాంటాక్ట్స్‌, బ్రౌజింగ్‌ హిస్టరీని తన ఆధీనంలోకి తీసుకుంటుందని జాతీయ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించడంతో కంగారుపడిపోతున్నారు. నిజానికి ఇలాంటి మాల్‌వేర్ ఎటాక్స్‌ ఇదేమీ కొత్త కాదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ రోజురోజుకీ ఇలా కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అందుకే సాంకేతిక వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు కంప్యూటర్లు, మొబైల్స్‌కు వచ్చే వైరస్‌లు ఏంటి? అవి ఎన్ని రకాలుగా ఉంటాయనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మాల్ వేర్ ( Malware ) అంటే ఏంటి?

మాల్‌వేర్‌ అనేది మాలిషస్‌ సాఫ్ట్‌వేర్‌ అనే పదం నుంచి వచ్చింది. ఇది కూడా ఒకరకమైన సాఫ్ట్‌వేర్‌నే. కాకపోతే ఇది అందరికీ ఉపయోగపడేది కాదు. దీనివల్ల ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువ. అనుమతి లేకుండా మన కంప్యూటర్‌, మొబైల్‌ లేదా ఇతరత్రా డివైజ్‌ల్లోకి ప్రవేశించి దాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. అందులోని ముఖ్యమైన సమాచారాన్ని సేకరించి సైబర్‌ నేరగాళ్లకు చేరవేస్తుంది. మాల్‌వేర్స్‌లో చాలా రకాలున్నాయి.

వార్మ్స్ ( Worms )

సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాలు, ఫిషింగ్‌ ఎటాక్స్‌ను ఉపయోగించుకుని వార్మ్స్‌ మన డివైజ్‌ల్లోకి ప్రవేశించుకుంటాయి. ఒక్కసారి ఇవి డివైజ్‌లోకి ప్రవేశించగానే.. మొత్తం నెట్‌వర్క్‌పై దాడి చేస్తాయి. సిస్టమ్‌లోకి ప్రవేశించిన వెంటనే అందులో ఉన్న ఫైల్స్‌ను మాడిఫై లేదా డిలీట్‌ చేస్తుంది. హానికరమైన సాఫ్ట్‌వేర్లను మనకు తెలియకుండానే ఇన్‌స్టాల్‌ చేస్తుంది. డివైజ్‌లోని డేటాను దొంగిలిస్తుంది. ఇందుకోసం కొత్త వార్మ్స్‌ను క్రియేట్‌ చేస్తుంది. హ్యాకర్లు సులువుగా దాడి చేసేందుకు వీలుగా వెసులుబాటు చేస్తుంది.

వైరస్ ( Virus )

వైరస్ అనేది ఎక్కువగా అటాచ్డ్ ఫైల్స్ ద్వారా కంప్యూటర్‌లో ప్రవేశిస్తుంది. వర్డ్ డాక్యుమెంట్ లేదా ఎక్యుక్యూటేబుల్ ఫైల్స్‌ను ఉపయోగించుకుని కంప్యూటర్‌లోకి చేరుతుంది. .exe ఫైళ్ల ద్వారా ఈ వైరస్ డివైజ్‌లోకి ప్రవేశిస్తుందని చాలామందికి తెలుసు. అయితే ఇంకా చాలా రకాల ఎక్స్‌టెన్షన్స్‌ ద్వారా ఈ వైరస్ డివైజ్‌లోకి వచ్చి చేరుతుంది. వెబ్‌సైట్స్, ఫైల్ షేరింగ్, ఈమెయిల్ అటాచ్‌మెంట్‌ డౌన్‌లోడ్స్ .. ఇలా దేని నుంచైనా వైరస్ ఈ సిస్టమ్‌లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఈ వైరస్ డివైజ్లోకి చేరగానే.. వైరస్ కాపీలను సృష్టిస్తుంది. ఆ తర్వాత యాప్స్‌ను తన అధీనంలోకి తెచ్చుకుంటుంది. తద్వారా సిస్టమ్‌లోని డేటాను దొంగిలిస్తుంది. ఈ వైరస్‌తో కేవలం మన డివైజ్‌కే కాకుండా మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారికి కూడా ప్రమాదమే. ఎందుకంటే ఇది మన డివైజ్ నుంచి మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న అందరికీ హానికరమైన ఫైల్స్‌ను పంపిస్తుంది.

బాట్స్ అండ్ బాట్‌నెట్స్

ఇంటర్నెట్‌లో అనేక వెబ్‌సైట్స్‌, సర్వర్లపై హ్యాకర్లు వ్యూహాత్మక దాడులు చేస్తుంటారు. ఇలా ఎటాక్ చేయడానికి హ్యాకర్లకు మెషిన్ పవర్ కావాలి కదా! అందుకని బాట్స్ అండ్ బాట్‌నెట్స్ ద్వారా డివైజ్‌లోకి చొరబడి వాటిని ఆక్రమించుకుంటారు. ఆ తర్వాత వాటిని దాడులు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ బాట్స్ మన డివైజ్లోకి రాగానే ఏమేమి రన్ అవుతున్నాయి? ఏ సెట్టింగ్స్‌తో అవి రన్ అవుతున్నాయి అనే విషయాలను పరిశీలిస్తుంది. ఆ తర్వాత వాటిపై దాడులు చేసుకుంటూ వెళ్తుంది. ఆ తర్వాత హానికరమైన రాన్సమ్‌వేర్‌ను స్ప్రెడ్ చేయడానికి హ్యాకర్లకు సహాయపడుతుంది. కీలాగింగ్ (మనం కీబోర్డులో ఏ కీ లను ప్రెస్ చేస్తున్నామో గమనించడం ద్వారా పాస్‌వర్డ్‌లు ఇతర ముఖ్య విషయాలను తెలుసుకుంటుంది), అలాగే స్క్రీన్‌షాట్స్ తీస్తుంది. వెబ్‌క్యామ్ యాక్సెస్ చేసి మన పర్సనల్ యాక్టివిటీలను రికార్డు చేస్తుంది. ఇతర మాల్‌వేర్లు డివైజ్‌లోకి వచ్చేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా స్పామ్, ఫిషింగ్ మెయిల్స్‌ను ఇతరులకు పంపిస్తుంది.

ట్రోజాన్ హార్సెస్

ఇది చాలా ప్రమాదకరమైనది.. దీన్ని మనం గుర్తించలేం.. ఎందుకంటే ఇది చూడ్డానికి అసలైన ఫైల్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ ఒకసారి పొరబడి ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇక అంతే సంగతులు. ఇది మన డివైజ్లోకి ప్రవేశిస్తే.. మన సిస్టమ్ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. దానిపై పూర్తి నిఘాను ఏర్పాటు చేస్తుంది. దీనిద్వారా మన డేటాను దొంగలించవచ్చు. అలాగే డిలీట్ చేయవచ్చు. అంతేకాకుండా మీ డివైజ్‌ను బాట్‌నెట్‌గా కూడా మార్చుకోగలదు.

రాన్సమ్‌వేర్ ( ransomware )

మొబైల్ లేదా కంప్యూటర్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలు ఇతర డేటాను ఎన్క్రిప్ట్ చేసి.. వాటిని తమ అధీనంలోకి తీసుకుంటుంది రాన్సమ్‌వేర్. ఆ తర్వాత మన ఫైల్స్‌ను ఎప్పటిలా చూసుకోవాలంటే.. హ్యాకర్లు అడిగినంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు హ్యాకర్లు మనకు ఒక డీక్రిప్టెడ్ కోడ్‌ను ఇస్తారు. 2017లో ఈ రాన్సమ్‌వేర్ 150 దేశాల్లోని 2 లక్షల కంప్యూటర్లపై ఒక్కరోజులోనే దాడి చేసింది. ప్రపంచంలోనే మొదటి మొబైల్ రాన్సమ్‌వేర్ 2013లో వచ్చింది. అదే ఫేక్ డిఫెండర్. ఇది వచ్చేటప్పటికి మొబైల్స్‌పై ఎన్క్రిప్టెడ్ టెక్నిక్ ఇంకా పుంజుకోలేదు. దీంతో అప్పట్లో ఫేక్ సెక్యూరిటీ అలర్ట్ చూపించి పలు యాప్స్‌ కొనేలా చేసేవాళ్లు. డివైజ్ సెట్టింగ్స్ మార్చేసి.. వాటిని తిరిగి మార్చాలనుకుంటే డబ్బులు కట్టమని డిమాండ్ చేసేవాళ్లు. ఆ తర్వాత 2014లో సింప్ లాకర్ అనే రాన్సమ్వేర్ వచ్చింది. దీనిద్వారా మొబైల్ డివైజ్‌లోని మెమొరీ కార్డుల్లో ఉన్న డేటాను ఎన్క్రిప్ట్ చేసి డబ్బులు అడిగేవాళ్లు. కేంద్రం తాజాగా అలర్ట్‌ చేసిన దామ్‌ వేరస్‌ కూడా ఒకరకమైన రాన్సమ్‌వేర్‌నే. ఈ రాన్సమ్వేర్ బారిన పడకుండా ఉండాలంటే ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసకోవాలి. అలాగే మంచి నాణ్యమైన యాంటీవైరస్ వాడాలి. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే అటాచ్‌మెంట్స్‌ ఓపెన్ చేయకూడదు. అలాగే డేటాను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవాలి.

యాడ్‌వేర్ ( Adware )

యూజర్ల అనుమతి లేకుండా యాడ్‌వేర్‌ ఏదైనా యాప్ ద్వారా డివైజ్‌లోకి ప్రవేశించి, యూజర్ల డేటాను సీక్రెట్‌గా గమనిస్తుంది. తద్వారా రకరకాల యాడ్స్‌తో స్పామ్ చేస్తుంది. మామూలు యాప్స్‌లో కూడా యాడ్స్ వస్తుంటాయి. అయితే వాటి కోసం ముందుగా యూజర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ యాడ్‌వేర్ ద్వారా వచ్చే యాడ్స్ అసంబంద్ధంగా ఉంటాయి. యూజర్లకు విండో క్లోజ్ చేసుకునే అవకాశం ఇవ్వవు. అలాగే యూజర్‌ను ఇతర వెబ్‌సైట్లలోకి తీసుకెళ్లి హానికరమైన మాల్‌వేర్స్ ఇన్‌స్టాల్ అయ్యేలా చేస్తాయి.

స్పైవేర్ ( Spyware )

యూజర్ల అనుమతి లేకుండా రహస్యంగా మన యాక్టివిటీని రికార్డు చేస్తాయి. అంతేకాకుండా యూజర్‌నేమ్‌, పాస్వర్డ్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎక్కడో ఉన్న సర్వర్‌కు అప్‌లోడ్ చేస్తుంది. ఈ వివరాలు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లకు చేరవేస్తుంది. ప్రపంచంలో మొదటి మొబైల్ స్పైవర్ 2007లో ఫ్లైక్సి స్పై అనే పేరుతో వచ్చింది. “మీ పార్టనర్ మీద మీకు అనుమానమా? వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారో తెలుసుకోవాలని ఉందా? అయితే ఫ్లెక్సిస్పై ట్రై చేయండి, మీ అనుమానాలు దూరం చేసుకోండి” తరహాలో దాన్ని అడ్వర్టైజ్ చేశారు. అది ఫోన్ కాల్స్ రికార్డ్ చేసి, ఎస్ఎంఎస్‌లు కాపీ చేసి అటాకర్‌కు పంపించడం మాత్రమే చేయగలిగేది. అలా మొదలైన ఈ స్పైవేర్.. రెండేండ్ల క్రితం పెగాసస్ ( Pegasus ) రూపంలో దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే లేపింది.

స్పామ్ అండ్ ఫిషింగ్

చాలావరకు సైబర్ దాడులు ఈ స్పామ్ అండ్ ఫిషింగ్ పద్ధతిలోనే జరుగుతుంటాయి. ఇందుకోసం ముందుగా పేరున్న సంస్థలను పోలిన మెయిల్ ఐడీ లేదా నంబర్ల ద్వారా మెయిల్స్ లేదా టెక్ట్స్ మెసేజ్లను పంపిస్తారు. ఒకవేళ ఆ మెయిల్ లేదా మెసేజ్లో ఉన్న లింక్ను మనం పొరపాటుగా క్లిక్ చేస్తే ఇక అంతే సంగతులు. మన మొబైల్ లేదా డివైజ్లోని ముఖ్యమైన సమాచారంతో పాటు బ్యాంకు ఖాతాల్లో నుంచి సొమ్మును కూడా హ్యాకర్లు దోచేస్తారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino