ఏపీ స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో 11 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కబెడుతున్నారు..ఓ పక్క బెయిల్ కోసం చంద్రబాబు తరపున ఢిల్లీ నుంచి రంగంలోకి దిగిన సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే వంటి ఖరీదైన న్యాయవాదులు ఏసీబీ కోర్టు, హైకోర్టులో పిటీషన్ల మీద పిటీషన్లు వేస్తున్నారు. నిన్న క్వాష్ పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్ట్ తీర్పు రిజర్వ్ చేసింది..మరోవైపు సీఐడీ వరుస కేసులో చంద్రబాబుకు చుక్కలు చూపిస్తోంది.. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ అక్రమాలపై ఏసీబీ కోర్ట్‌లో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది. లేటెస్ట్‌గా ఫైబర్ నెట్ స్కామ్‌లో కూడా పీటీ వారెంట్ వేసింది. ఈ మేరకు ఏసీబీ కోర్డులో సీఐడీ న్యాయవాదులు మెమో దాఖలు చేశారు.
టీడీపీ హయాంలో లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబు పేరును A 25 నిందితుడిగా పేర్కొంటూ పిటీ వారెంట్‌కు అనుబంధంగా సీఐడీ ఈ మెమో దాఖలు చేసింది. ఈ ఫైబర్ గ్రిడ్ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వానికి 115 కోట్ల రూపాయల నిధులు దోచుకున్నారన్నారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో A1గా ఉన్న వేమూరి హరిప్రసాద్.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. దీంతో ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు పాత్రను సీఐడీ గుర్తించింది. పూర్తి స్థాయిలో విచారణ చేపడితే వాస్తవాలు బయటపడతాయంటోంది సీఐడీ. అందుకే పీటీ వారెంట్ దాఖలు చేసింది. పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ అని అర్ధం.. ఇప్పటికే ఏదైనా కేసులో అరెస్టై జైలులో ఉన్న ఖైదీని మరో కేసులో విచారణ కోసం, జైలు నుంచి ఇంకో ప్రాంతానికి తరలించేలా కోర్టు అనుమతి కోరతారు. అప్పుడు కోర్టు పీటీ వారెంట్ ఇస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే జైలులో ఉన్న ఖైదీని మరో చోటికి తరలించడం కోసం తీసుకునే అనుమతి. సీఆర్పీసీలోని సెక్షన్ 269 కింద కోర్టు పీటీ వారెంట్‌ని ఇస్తుంది. ఇప్పుడు చంద్రబాబు విషయానికి వస్తే.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టై పది రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆ కేసుకు సంబంధించిన పిటిషన్లపై కోర్టుల్లో ఇప్పటికే వాదనలు జరుగుతున్నాయి. చంద్రబాబు తరపు లాయర్లు వేసిన క్వాష్ పిటిషన్ పరిగణలోకి ఆ కేసును కొట్టేస్తారా.. లేదంటే కస్టడీకి అనుమతి ఇస్తారా అనేది కోర్ట్ తీర్పును బట్టి ఆధారపడి ఉంది. ఈ లోపే చంద్రబాబును వరుస కేసులు చుట్టుముడుతున్నాయి.
ఈ క్రమంలో ఏసీబీ కోర్టులో ఇవాళ చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. సాధారణ బెయిల్, మధ్యంతర బెయిల్‌పై విచారణ జరగనుండగా.. సీఐడీ అధికారులు కౌంటర్ కూడా దాఖలు చేయనున్నారు. చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పైనా ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు దాడి కేసుల్లో చంద్రబాబే నిందితుడని ఆరోపిస్తోంది సీఐడీ. ఈ కేసుల్లో చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని వాదిస్తోంది. అయితే ఈ కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు తరపు లాయర్లు. ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ కేసు చంద్రబాబు మెడకు చుట్టుకుంది. మొత్తంగా స్కిల్ స్కామ్‌తో పాటు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్, ఫైబర్ నెట్ స్కాం, అంగళ్లు దాడి కేసు, ఇలా వరుస కేసుల్లో సీఐడీ వేస్తున్న పీటీషన్లతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే..చంద్రబాబుకు ఒక కేసులో బెయిల వచ్చినా..మరో కేసులో రిమాండ్ విధించే అవకాశాలు ఉన్నాయి.. సీఐడీ దూకుడుతో చంద్రబాబు ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చేలా కనిపించడం లేదని టీడీపీ వర్గాల్లో ఆందోళన మొదలైంది..