మెగాస్టార్ మోస్ట్ ప్రెస్టేజియస్ ప్రొజెక్ట్ సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఏ ముహుర్తాన మొదలు పెట్టారో గానీ.. ఆ చిత్రం నుండి ఒక్కో టెక్నీషియన్ మెలమెల్లగా బయటకొస్తున్నారు. ఇప్పటికే రెహమాన్ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డితో ఏర్పడిన పొరపచ్చాల కారణంగా సినిమా నుంచి తప్పుకొన్నారనే వార్తలు కాస్త గట్టిగా వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు మరో టెక్నీషియన్ కూడా సినిమా నుంచి బయటకొచ్చేసినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానుల సమక్షంలో రాజమౌళి చేతుల మీదుగా సైరా నరసింహారెడ్డి ఫస్ట్ లుక్ ను విడుదల చేయడంతోపాటు కాస్ట్ అండ్ క్రూ లిస్ట్ ను కూడా ప్రకటించారు.
అయితే కొద్ది రోజుల క్రితం ఆ చిత్రం నుండి ఏఆర్ రెహ్మాన్ తప్పుకున్నారు. ఇప్పుడు తాజాగా సినిమా కెమెరామెన్ రవివర్మన్ సినిమా టీం నుంచి బయటకొచ్చేసినట్లు సమాచారం. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేకపోవడంతోపాటు ఇప్పటివరకూ కనీసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తవ్వకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రీసెంట్ గా జగ్గా జాసూస్ లాంటి విజువల్ వండర్ ని ప్రేక్షకులకి అందించిన రవివర్మన్ లాంటి సీనియర్ టెక్నీషియన్ సినిమా నుంచి బయటకొచ్చేయడంతో.. ఆయన స్థానంలో అదే స్థాయి టెక్నీషియన్ ను రీప్లేస్ చేయడం కోసం నిర్మాత రామ్ చరణ్ తోపాటు సైరా యూనిట్ నానా ఇబ్బందులు పడుతోంది.