ఒక సినిమాని తెరకెక్కించడం కంటే.. ఆ సినిమాని రిలీజ్ చేయడం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. తీయడానికి పడే కష్టం కంటే కాస్త ఎక్కువగానే రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిర్మాతలు. మొన్నటివరకు చిన్న సినిమాలకి ఎక్కువగా ఇలాంటి సమస్య ఎదురయ్యేది.. ఇప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా ఈ సమస్యలు తప్పడం లేదు. తాజాగా మంచు మనోజ్ తాజా చిత్రమైన ఒక్కడు మిగిలాడుకి కూడా ఈ సమస్యలు తప్పట్లేదు.
ఈ వారం బాక్సాఫీసు వద్ద ఏకంగా ఐదు సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో రెండు స్ట్రయిట్ సినిమాలు ఒక్కడు మిగిలాడు, కేరాఫ్ సూర్య. మరో మూడు సినిమాలు తమిళ డబ్బింగ్ సినిమాలు. విజయ్ అదిరింది, విశాల్ డిటెక్టీవ్, సిద్ధార్ధ్ గృహం సినిమాలు ఉన్నాయి. అయితే ఒకేసారి ఐదు సినిమాలు విడుదలవడంతో ఇప్పుడు ప్రతి ఒక్క హీరో సినిమాకి థియేటర్స్ కొరత ఏర్పడింది. అందులో ముఖ్యంగా మంచు మనోజ్ ఒక్కడు మిగిలాడు సినిమాకు కేవలం ఒక్క థియేటర్ మిగిలిందంటూ హైదరాబాద్ డిస్ట్రబ్యూటర్స్ రోడ్డెక్కారు. ముందుగా ఏషియన్ సినిమాస్ సునీల్ ఒక్కడు మిగిలాడు సినిమాకి 40 థియేటర్స్ కేటాయించారట.
అయితే ఒక్కడు మిగిలాడు సినిమా నవంబర్ 10 న విడుదలకు ఎనౌన్స్ చేశాక వెంటనే కేరాఫ్ సూర్య అదే డేట్ లాక్ చెయ్యడం.. మరోవైపు అదిరింది సినిమా విడుదల సమస్యలు ఎదుర్కుంటూ.. ఎట్టకేలకు నవంబర్ 9 న విడుదలకు సిద్దమని చెప్పడం.. ఇక ఆతర్వాత గత వారంలో విడుదల కావాల్సిన విశాల్ డిటెక్టీవ్ కూడా నవంబర్ 10 కె వస్తున్నాడని అనౌన్స్ చెయ్యడం.. అలాగే నిన్నగాక మొన్న సిద్ధార్ధ్ గృహం సినిమా కూడా నవంబర్ 10 కె విడుదల కావడంతో ఏషియన్ సునీల్ మిగతా సినిమాలకు కూడా థియేటర్స్ కేటాయించేసి చివరికి ఒక్కడు మిగిలాడు సినిమాకి ఒక్క థియేటర్ అది కూడా శాంతి థియేటర్‌ని కేటాయించడంతో ఒక్కడు మిగిలాడు డైరెక్టర్, హీరో మనోజ్ లు తీవ్ర మనస్తాపం చెందడమే కాదు సునీల్ తో గొడవకు సై అంటున్నారు.
ఒక స్ట్రయిట్ సినిమా కి థియేటర్స్ ఇవ్వకుండా ఇలా డబ్బింగ్ సినిమాలుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని మండి పడుతున్నారు. ఇప్పటికే ఒక్కడు మిగిలాడు కొన్ని కారణాల వలన రెండు సార్లు వాయిదా పడి… ఇప్పుడు ఎట్టకేలకు నవంబర్ 10 న విడుదలవుతుంటే ఇలా థియేటర్స్ కొరత ఏర్పడడం మాత్రం బాధాకరమని అంటున్నారు. అలాగే డబ్బింగ్ సినిమాలకు ఉన్న ప్రయారిటీ తెలుగు సినిమాలకు కూడా ఇవ్వాలని ఒక్కడు మిగిలాడు సినిమా దర్శకుడు డిమాండ్ చేస్తున్నాడు. చూద్దాం మరో రెండు రోజుల్లో ఈ థియేటర్స్ ఫైట్ ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో అనేది.