రివ్యూ : c/o సూర్య
బ్యానర్ : లక్ష్మీ నరసింహ ఎంటర్ ట్రైన్ మెంట్
తారాగణం :సందీప్‌కిషన్,మెహరీన్,సత్య, హరీష్ ఉత్తమన్,ప్రవీణ్,అప్పుకుట్టి..
సంగీతం: డి.ఇమ్మాన్
ఛాయాగ్రహణం: జె.లక్ష్మణ్ కుమార్
కూర్పు: ఎం.యు.కాశీవిశ్వనాథం
పాటలు: రామజోగయ్య శాస్త్రి,శ్రీమణి
సమర్పణ: శంకర్ చిగురుపాటి
నిర్మాత: చక్రి చిగురుపాటి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుసీంద్రన్
విడుదల 10 .11.2017
ప్రస్తుత సమాజంలో మధ్య తరగతి జీవితాల్ని తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు సుసీంద్రన్ కి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది.ప్రముఖ హీరో కార్తి హీరోగా ఆయన తీసిన `నా పేరు శివ` తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. అలాంటి దర్శకుడికి పక్కింటి కుర్రాడి ఇమేజ్‌తో కనిపించే కథానాయకుడు సందీప్‌కిషన్ తోడవడంతో `c/o సూర్య` విడుదలకి ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇటు టాలీవుడ్ తో పాటు తమిళంలోనూ మంచి మార్కెట్‌ని సొంతం చేసుకొన్న సందీప్‌కిషన్ ఈ చిత్రంతో రెండు చోట్లా అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. స్నేహం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది? మరోసారి సుసీంద్రన్ తన మాయాజాలాన్ని చూపించాడా? నక్షత్రంతో పరాజయాన్ని చవిచూసిన సందీప్‌కిషన్‌ని ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
కథేంటంటే:
తనను నమ్మి దోస్తానం చేసే వారి స్నేహానికి ప్రాణమిచ్చే కుర్రాడు సూర్య(సందీప్ కిషన్). ఎంబీఏ ఫెయిల్ కావడంతో క్యాటరింగ్ కంపెనీలో పనిచేస్తాడు. చెల్లెలు వైద్య కళాశాలలో ఎండీ చదువుతుంటుంది. సూర్య ప్రాణ స్నేహితుడైన మహేష్(విక్రాంత్) సూర్య చెల్లెలు ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా వాళ్ల ప్రేమ వ్యవహారం సాగుతుంటుంది. ఆ విషయం అనుకోకుండా సూర్యకు తెలుస్తుంది. ఆ తర్వాత ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆఫీస్‌పై దాడి చేశాడన్న నేరం మహేష్‌పై పడుతుంది. తనకు తెలిసిన పోలీసు అధికారికి చెప్పి మహేష్‌ని అరెస్టు చేయిస్తాడు సూర్య. మహేష్ జైలు నుంచి బయటకు వచ్చాక కూడా అతనిపై హత్యాయత్నం జరుగుతుంది. ఆ పనులన్నీ సూర్యనే చేయించాడా? లేక మహేష్‌పై వేరెవరైనా కక్ష కట్టారా? ఇంతకీ మహేష్.. సూర్య చెల్లెలు ఒక్కటయ్యారా? లేదా? .సూర్య జీవితంలోకి కిరాయి హంతకుడు(హరీశ్ ఉత్తమన్) ఎలా వచ్చాడు? .తదితర విషయాలను తెరపై చూడాల్సిందే.
మరి సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉందంటే:
ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి చుట్టూ సాగే యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. మూవీలో తొలి సగభాగం సినిమా స్నేహం.. మధ్య తరగతి కుటుంబం ఇలా సరదాగా సాగుతుంది. స్నేహానికి ప్రాణమిచ్చే సూర్య మహేష్‌ను అరెస్టు చేయించడంతో కథలో ఆసక్తి మొదలవుతుంది. మహేష్‌ని ఎవరు చంపాలనుకుంటున్నారనే విషయాన్ని శోధించే క్రమం ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. సరదా.. సరదాగా సాగిన సినిమా ద్వితీయార్ధంలోకి వచ్చే సరికి మిస్టరీతో కూడిన ఒక థ్రిల్లర్‌లా రూపాంతరం చెందుతుంది. దర్శకుడు సుసీంద్రన్ స్క్రీన్‌ప్లేతో తనదైన మేజిక్‌ను ప్రదర్శించాడు. కథని మొదలు పెట్టిన విషయాలతోనే ముగింపు సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే, కథలో కొత్త విషయం లేకపోవడంతో ఎన్ని మేజిక్‌లు చేసినా, సినిమా అక్కడక్కడా సాగదీతలా అనిపిస్తుంది. ప్రథమార్ధంలో వినోదం పండించడానికి ఆస్కారం ఉన్నా, దర్శకుడు ఆ విషయంపై దృష్టి పెట్టలేదు. ద్వితీయార్ధమే ప్రేక్షకుడికి కాస్త కొత్తదనం, థ్రిల్‌ని కలిగిస్తుంది. ఎవరెలా చేశారంటే:
యువహీరో సందీప్ కిషన్ నటన సినిమాకు ప్రధాన బలం. మిడిల్ క్లాస్ కుర్రాడిగా కనిపిస్తూ చక్కటి భావోద్వేగాలను పలికించాడు. వైద్యం గురించి ఆయన చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి. యాక్షన్ సన్నివేశాల్లోనూ చాలా చక్కగా నటించాడు. కథానాయిక మెహరీన్ పాత్రకు అంతగా ప్రాధాన్యం దక్కలేదు. తెరపై కనిపించిన కాసేపు అందంతో ఆకట్టుకుంటుందంతే! స్నేహితుడిగా నటించిన విక్రాంత్ పాత్ర, ఆయన నటన బాగుంది. హరీశ్ ఉత్తమన్ ప్రతినాయకుడిగా కళ్లతోనే భావాలు పలికించాడు. సత్య, ప్రవీణ్ తదితర హాస్య నటులు ఉన్నా నవ్వులు పండలేదు. సాంకేతికంగా సినిమా బాగుంది. లక్ష్మణ్‌కుమార్ కెమేరా పనితనం, డి.ఇమ్మాన్ సంగీతం ఆకట్టుకుంటాయి. దర్శకుడు సుసీంద్రన్ కథ పరిధిని ఇంకొంచెం పెంచి ఉంటే బాగుండేది. స్క్రీన్‌ప్లేలో ఆయన పనితనం స్పష్టంగా కనపడుతుంది.మూవీ నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు
+ సందీప్ కిషన్
+ ద్వితీయార్ధం
+ యాక్షన్, సంగీతం
బలహీనతలు
– అక్కడక్కడా సాగదీతగా అనిపించే సన్నివేశాలు
# రేటింగ్ : 2.75/5
# దరువు పంచ్ లైన్ : సందీప్ కిషన్ శైలిలో అలరించిన C/O సూర్య..
