తెలుగు సినీ పరిశ్రమకు సంబందించి ప్రతిష్టాత్మకమైన నంది అవార్డ్స్‌ను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయాక మొదటిసారి నంది అవార్డ్స్ ప్రకటించడం.. అదీ మూడు సంవత్సరాలకి కలిపి ఒకేసారి ప్రకటించడంతో సర్వత్రా ఆశక్తి నెలకొంది. ఒకవైపు రాష్ట్ర విభజ జరగడం.. మరోవైపు ప్రత్యేక హోదా పోరాటాలు.. ఆ హడావిడిలో 2014 , 2015 సంవత్సరాలలో అవార్డ్స్ ప్రకటించలేకపోయామని కమిటీ సభ్యులు వెల్లడించారు.
ఇక అసలు విషయానికి వస్తే.. 2014 ఉత్తమ నటుడిగా లెజెండ్ చిత్రానికి గాను బాలకృష్ణని ఎంపిక చేశారు. 2015లో శ్రీమంతుడు చిత్రానికి గాను మహేష్ బాబుని అవార్డు వరించింది. ఇక 2016 లో నాన్నకి ప్రేమతో చిత్రానికి గాను ఎన్టీఆర్ కి అవార్డు దక్కింది. అయితే తెలుగు ప్రేక్షకులు ఊహించినట్లు బాహుబలి చిత్రానికి గాను ప్రభాస్‌కి అవార్డు వరించలేదు. 2015 ఉత్తమ చిత్రంగా బాహుబలి సినిమాకి అవార్డు దక్కినప్పటికీ , ఉత్తమ నటుడిగా ప్రభాస్‌కి అవార్డు రాకపోవడంతో తెలుగు ప్రేక్షకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనగా.. ప్రభాస్ అభిమానులైతే తీవ్ర విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అందుకు తగిన కారణాలు కూడా ఉన్నాయి. బాహుబలి చిత్రంలో ప్రభాస్ నటన చూసి యావత్ ప్రపంచమే మెచ్చుకుంది. దీనితో 2015 కి సంభందించి ఉత్తమ నటుడిగా.. అవార్డ్స్ అన్నీ ప్రభాస్ కొల్లగొడతాడని అంతా అనుకున్నారు. అయితే మంగళవారం ప్రకటించిన నంది అవార్డ్స్‌లో ప్రభాస్ పేరు ఎక్కడా వినిపించలేదు. 2015 సంవత్సరానికి గాను ప్రభాస్‌కి కాకుండా.. మహేష్ బాబుకి అవార్డు ప్రకటించారు. దీంతో ఏపీ ప్రభుత్వం ప్రభాస్‌కి అవార్డు ప్రకటించకుండా తీవ్రంగా అవమానించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవార్డ్స్ కులాన్ని బట్టి ఇస్తున్నారని.. నటన బట్టి కాదని నంది అవార్డ్స్ కమిటీని ప్రభాస్ ఫాన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. బాహుబలి చిత్రంలో వెన్నుపోటుకు బలైన ప్రభాస్‌కి.. నంది అవార్డ్స్ లోనూవెన్నుపోటు తప్పలేదని డార్లింగ్ అభిమానులు చర్చించుకుంటున్నారు.