మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం జవాన్ ట్రైలర్ విడుదలై దుమ్మరేపుతోంది. ప్రముఖ రచయిత బీవీఎస్ రవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. బైకులెక్కి లవర్స్‌తో తిరగాల్సిన వయసులో అమ్మ ఇచ్చిన లిస్ట్ లేసుకుని తిరిగితే ఇదిగో ఇలానే ఉంటది ఫ్రస్టేషన్ అంటూ తేజూని ఉద్దేశిస్తూ చిన్న పాప పలికిన డైలాగులు చాలా సరదాగా ఉన్నాయి.
అంతే కాకుండా లైఫ్‌లో మనకేదైనా మిస్సైందంటే మనము దేనికీ పనికి రామని కాదురా.. మనం ఇంకా దేనికో పనికొస్తామని.. ఆవేశానికి మన అవసరం పడినప్పుడు నాది నేను అనే పదం పక్కన పెట్టి దూకేయాలి లాంటి డైలాగులు ఆలోచింప చేయగా.. యుద్ధం మొదలయ్యాక పక్కోడు పోయాడా, వెనకోడు ఆగిపోయాడా, ముందోడు కూలిపోయాడా కాదురా.. యుద్ధం గెలిచామా లేదా అన్నదే ముఖ్యం అని తేజూ చెప్పిన డైలాగ్ థియేటర్‌లో విజిల్స్ వేసేలా ఉన్నాయి.
ఇక డీఆర్‌డీవోకి సంబంధించిన ఆక్టోపస్ మిస్సైల్ సిస్టమ్‌ని జవాన్‌గా ధరమ్‌తేజ్ ఎలా కాపాడతాడు కథ నేపథ్యంలో సినిమా ఉంటుంది అని హింట్ ఇచ్చారు. ఇందులో తమిళ నటుడు, నటి స్నేహ భర్త ప్రసన్న విలన్ పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. సినిమాలో దేశాన్ని ప్రేమించే యువకుడిగానే సాయిధరమ్ కనిపిస్తాడని, అది కేవలం దేశభక్తుడి పాత్రేనని ప్రకటించాడు. దేశం, కుటుంబం.. ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలి అన్న సందిగ్ధత వచ్చినప్పుడు, దేశం వైపే మొగ్గు చూపే కుర్రాడి పాత్రలో సాయిధరమ్ తేజ్ కనిపిస్తాడని చెప్పాడు.
ఇక, టైటిల్‌కు తగినట్టుగానే సినిమా ఉంటుందని, సాయిధరమ్ పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుందని పేర్కొన్నాడు. తమిళ నటుడు ప్రసన్న చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడని, అయితే.. రెగ్యులర్ విలన్ పాత్రల్లా కాకుండా అతడి పాత్ర నిండా కొత్తదనంతో ఉంటుందని వెల్లడించాడు డైరెక్టర్. ఇక దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. డిసెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇప్పటికే వరుస ప్లాపులతో డీలా పడిన మెగా హీరో ఈ చిత్రంతో అయినా హిట్ కొడతాడో లేదో చూడాలి.