ఎన్నో ఏళ్లుగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు కలగా మిగిలిపోయిన కోరికను ప్రముఖ నటుడు చిరంజీవి నిజం చేశారు. ప్రస్తుతం మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ మూవీలోని ఓ కీలక పాత్రలో పూరీ జగన్నాథ్ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పూరీ జగన్నాథ్‌కు చిన్నప్పటి నుంచి సినీ పరిశ్రమపై ఎంతో అభిమానం. యాక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నారు. కానీ అనుకోకుండా దర్శకత్వం వైపు ఆయన వెళ్లి స్టార్ డైరెక్టర్‌గా మారారు. పూరీ స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ నటుడిగా మంచి పాత్రలో నటించాలన్న కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఆయన కలను సాకారం చేయాలని భావించారు. అందుకే తాను నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ మూవీలో ఓ పాత్రకు పూరీని తీసుకున్నారు.
‘‘సిల్వర్ స్క్రీన్‌పై నటుడిగా ఓ వెలుగు వెలగాలనే ఉద్దేశంతో నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు హైదరాబాద్ వచ్చాడు. ఒకటి, అరా వేషాలు వేశాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అతడి మొదటి కల అలా మిగిలిపోకూడదనే ఉద్దేశంతోనే ఇలా’’ అని చిరంజీవి ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇవాళ పూరీ జగన్నాథ్ సినిమా సెట్లో అడుగుపెట్టారు. దీంతో ఆ ఫొటోలను పోస్ట్ చేస్తూ చిరంజీవి ఈ విషయాన్ని చెప్పారు.