సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీనటుడు కృష్ణం రాజు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో ఇవాళ(ఆదివారం) వేకువజామున 3.25 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో సినీరంగంలో తీవ్ర విషాదం నెలకొంది. రేపు ఉదయం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
కృష్ణం రాజు 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశారు. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన కృష్ణంరాజు వాజ్‌పేయ్ హయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే 2004లో లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తర్వాత హీరోగా సినీరంగ ప్రవేశం చేసి విలన్‌గానూ అలరించారు. 1966లో ‘చిలకా గోరింకా’ చిత్రంతో వెండితెర అరంగ్రేటం చేశారు. ‘అవేకళ్లు’ చిత్రంలో విలన్‌గా నిరూపించుకున్నారు. కృష్ణం రాజుకు ముగ్గురు కుమార్తెలు ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ఉన్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన తమ్ముడు కొడుకు హీరో ప్రభాస్ కోరికతో రాధేశ్యామ్ సినిమాలో నటించారు.