బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొట్టడమే టార్గెట్ అయినపుడు సినిమా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే. కానీ, అంతకు మించి సినిమా ఒక ఎడ్యుకేషన్‌గా తీయాలనుకుంటేనే సమస్య.
అసలు జనాలకు ఎక్కుతుందా? ఇప్పటి దాకా జనాలకు ఎక్కిస్తున్నదంతా మంచేనా?
సినిమా ప్లాట్‌కు సంబంధించిన ఈస్తటిక్స్ ఈ దేశంలో ఏనాడో డిసైడ్ అయ్యాయి కదా! వాటిని బద్ధలు కొట్టడమంటే మాటలా? పట్టుమని పది సినిమాలు తీసిన అనుభవం కూడా లేని ఒక యువకుడు ఎందుకు ఇలా నలుపు నలుపోనని కలవరిస్తున్నాడు? అసలు కబాలి ద్వారా గాని, కాలా ద్వారా గానీ పా.రంజిత్ ఏం చెప్పదలుచుకున్నాడు? ఎందుకని ఈ సినిమాలు మురికివాడ ప్రజలకు మాత్రమే నచ్చుతున్నాయి?
ఇన్ని ప్రశ్నలను పటాపంచలు చేసింది కాలా సినిమా!!
ఈ దేశానికి వలసొచ్చిన ఆర్య బ్రాహ్మణులు ఎట్లా అధికారాన్ని కైవసం చేసుకున్నారు. భూమిని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఎన్ని దుర్మార్గాలకు పాల్పడ్డరో సింబాలిక్ చెప్పాడు దర్శకుడు. ఇందుకోసం దర్శకుడు ఎన్నుకున్న కథ ముంబైలోని దారవి అనే ఒక మురికివాడ. ఈ దేశంలోని అన్ని పట్టణాల్లో ఇలాంటి స్లమ్సే ఉన్నాయి. వాళ్లందరూ ఎక్కువగా కిందికులాల జనాలే. వారి జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు రంజిత్.
ఇరికిరుకు గల్లీలు, రోడ్ల మీదే పారే మోరీలు, పందులు, కుక్కలతో సహవాసం చేసే బతుకులు…బహుశా స్లమ్ముల్లో పుట్టిన వాళ్లకు బాగా కనెక్ట్ అయ్యే లైఫ్ ఇది. తరాలుగా జీవిస్తున్న ఈ బస్తీని కబలించాలి అనుకున్న అగ్రవర్ణ, హిందుత్వ, స్వచ్ఛ భారత్ రాజకీయ నాయకుని చీకటి సామ్రాజ్యాన్ని కళ్లకు కట్టాడు. ఇలా సినిమా తియ్యాలంటే గుండె ధైర్యం కావాలి.
బ్రాహ్మణికల్ ఈస్తటిక్స్‌ని బద్ధలు కొట్టిన సినిమా ఇది.
నలుపు, పొట్టి, బక్క పలుచన వంటి స్థాయి భావాలకు కావ్య శాస్త్రాల్లో, ఆలంకారిక సిద్ధాంతాల్లో స్థానం లేకుండా చేశారు బ్రాహ్మణ పండితులు. అందుకే మన దేశంలో తెలుపు వర్ణానికి ఉన్న గౌరవం నలుపుకు లేదు. గోవుకు ఉన్న దేశభక్తి గిరాకీ, కాయకష్టం చేసే బర్రెకు గొడ్డుకు లేవు. ఈ దుర్మార్‌టపు విలువల్ని కాల రాస్తూ ఈ దేశంలో నిత్యం కష్ట పడుతున్న కిందికులాల శరీర వర్ణానికి పట్టం కట్టాడు డైరక్టర్. సినిమా పేరు దగ్గరి నుండి మొదలు కథలోని పాత్రలు, సంభాషణలు ప్రతీ చోట ప్రత్యామ్నాయ ఈస్తటిక్స్‌ని ప్రదర్శించాడు. కాళ్లు మొక్కించుకోవడం ఆధిపత్యానికి సంకేతమైతే, షేక్‌హ్యండ్ ఇవ్వడం సమానత్వానికి చిహ్నమనే విషయాన్ని చాలా సింపుల్‌గా తెర మీద చూపించాడు. నిజానికి దీని వెనకాల ఈ దేశంలోని కుల వ్యవస్థ తాలూకు ఆధిపత్య అహంకార విలువల నీతుల మీద దర్శకుడు తన నిరసనను తెలుపుతున్నాడనేది లోతుగా ఆలోచిస్తే తప్ప అర్థం కాదు.
వర్తమాన రాజకీయ సందర్భాన్ని చీల్చిచెండాడిన సినిమా
స్వచ్ఛ భారత్ పేరుతో చేస్తున్న లుచ్చా రాజకీయాలకు ఈ సినిమా ఒక చెంపపెట్టు. నీతులు మాట్లాడే అగ్రవర్ణ నాయకులు ఏ ఊరికి పోయినా కనిపిస్తారు. అట్లాగే వారు అధికారం మాటున కిందికులాలకు తవ్వుతున్న గోతులేమిటో కూడా జనానికి తెలుసు. ఈ వర్తమాన రాజకీయ దుర్మార్గాన్ని సెల్యులాయిడ్ తెర మీద చూపించిన తీరు అద్భుతం.
ఒక్కో పాత్ర…ఒక్కో భావజాలానికి ప్రతీక
హీరో పాత్ర దళిత బహుజన కులాలకు ప్రతినిధి. విలన్ పాత్ర బ్రాహ్మణిజానికి, అగ్రవర్ణ అధికార రాజకీయాలకు రిప్రజెంటీవ్. కొడుకు లెనిన్…తండ్రి నమ్మే అంబేద్కర్ సిద్ధాంతాన్ని కాదనుకొని విప్లవ సిద్ధాంతాల చుట్టూ తిరిగేతనానికి మచ్చుతునక. సినిమా అనే మాఫియా మీద పా.రంజిత్ తీస్తున్న సినిమాలు కేవలం సినిమాలు మాత్రమే కాదు! ఈ దేశంలోని ఎస్సిఎస్టీబీసీ మైనారిటీ కులాల ఆత్మగౌరవ పతాకలు!!
ఇట్లా బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన బోధించు, సమీకరించు, పోరాడు మన్న ఆయన ఆశయాన్ని సినిమాగా తీస్తే అది ఖచ్చితంగా కాలానే అవుతుంది. చరిత్రను చెప్పాడు, జనాన్ని పోగు చేశాడు. పోరాట దారిని చూపించాడు. అందుకే ఇది అంబేద్కరిస్టు సినిమా!!అందుకే ఇది మాకు నచ్చుతున్నది. టైంపాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాచ్‌లకు చిరాకు పుట్టిస్తున్నది.
“కాలా” నాకు ఇలా అర్థమైంది.
-డా.పసునూరి రవీందర్ గారి పోస్టు ..