ఏపీ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడిపై రాష్ట్రంలోని టెక్కలి మండలంలోని రావివలస గ్రామ ప్రజలు ,కార్మికులు తిరగబడ్డారు .ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన మాయ మాటలు నమ్మి మోసపోయామని మెట్‌కోర్ ఎల్లాయిస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ కార్మికులు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత మూడున్నరెండ్లుగా తమకు పూర్తిస్థాయి వేతనాలు చెల్లించని యాజమాన్యం.. ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా వేతనంగా ఇవ్వలేదని కార్మికులు వాపోయారు.మొత్తం దాదాపు 200మంది కార్మికులు ఫ్యాక్టరీ ముందు పెద్ద ఎత్తున ధర్నాకు దిగడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.వీరికి మద్దతుగా స్థానిక ప్రజలు అక్కడ బైటాయించారు .గతంలో మంత్రి అచ్చెన్నాయుడుతో కల్సి అప్పటికే 6 నెలల బకాయి జీతాలతో పాటు 2014 నుంచి పీఎఫ్, గ్రాట్యూటీ, రన్నింగ్ బోనస్ చెల్లించడం తదితర అంశాల గురించి ఇప్పటికే చాలా సార్లు ఆ పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు కూడా జరిపినట్లు కార్మికులు తెలిపారు.
ఆ సమయంలో కార్మికులకు చెల్లించే వేతనాల్లో 60 శాతం కార్మికులకు చెల్లించేలా యాజమాన్యంతో చర్చించామని, పరిశ్రమను పూర్తి స్థాయిలో తెరిచేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామి ఇచ్చినట్లు తెలిపారు .అయితే సాక్షాత్తు మంత్రి హామి ఇచ్చి మూడున్నరెండ్లు అయిన కానీ ఇంతవరకు యాజమాన్యం మాత్రం తమ వేతనాలు చెల్లించలేదని కార్మికులు వాపోయారు . తమకు తక్షణం న్యాయం జరగకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.