ఏపీ టీడీపీ నేతలు మాజీ మంత్రి రావెల కిషోర్ పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. మాదిగ రిజర్వేషన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించాలని రావెల కోరారు. అక్కడ చంద్రబాబును కించపర్చే వ్యాఖ్యలు రావెల చేయలేదు. అయితే రావెల చేసిన పని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పక్కన పెట్టుకోవడమే. గుర్రం జాషువా విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. మాలలకు అందుతున్న ప్రయోజనాలు మాదిగలకు అందడం లేదని, దీంతో మాదిగలు అసంతృప్తితో ఉన్నారన్నారు. అయితే మందకృష్ణను మళ్లీ మళ్లీ ప్రతిపాడు నియోజకవర్గానికి పిలవడాన్ని టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. మందకృష్ణ చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగారని, అతనిని వెంటపెట్టుకుని నియోజకవర్గంలో పర్యటించడమేంటని ప్రశ్నిస్తున్నారు. అందుకే రావెల చంద్రబాబుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకున్నా.. మంత్రి జవహర్, వర్లరామయ్యలు ఎదురుదాడికి దిగారు.
అయితే రావెల ఇందుకు మరో ఉపాయం ఆలోచించారు. తాను చంద్రబాబుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, అనవసరంగా తనపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. రావెల కిశోర్ రాజీనామా చేస్తే మళ్లీ ఉప ఎన్నికను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అది అధికార పార్టీ నేతలకు ఇష్టంలేదు. దీంతో కామ్ అయిపోయినట్లు సమాచారం. అలాగే రావెల కిశోర్ కూడా సీరియస్ గానే అధిష్టానానికి సంకేతాలుపంపినట్లు తెలిసింది. తనపై చర్యకు దిగినా.. తనపై లేని పోని ఆరోపణలు చేసినా తాను మాత్రం వెంటనే రాజీనామా చేస్తానని హెచ్చరించారు. తనకు నియోజకవర్గంలో పట్టు ఉందని, తాను మరోసారి ఎమ్మెల్యేగా గెలవగలనని ధీమాను రావెల వ్యక్తం చేశారు. రావెల ఎక్కడ రాజీనామా చేస్తారో.. మళ్లీ ఉప ఎన్నికల తలనొప్పి వచ్పి పడుతుందేమోనని రావెల కు వ్యతిరేకంగా గళం విప్పిన నేతలు ఇప్పుడు మౌనాన్నే ఆశ్రయించారు. మొత్తం మీద రావెల టీడీపీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చారని సర్వత్రా చర్చించుకుంటున్నారు.