‘మెర్శల్’ వివాదం ముదురుతున్న క్రమంలో ఆ సినిమాకి అనూకూలంగా కామెంట్స్ చేసిన హీరో విశాల్‌కు GST టీమ్ షాక్ ఇచ్చింది. విశాల్‌కు చెందిన చెన్నైలోని సినీ నిర్మాణ సంస్థపై వస్తు సేవల పన్ను (GST) ఇంటెలిజెన్స్ అధికారులు ఈ రోజు మధ్యాహ్నం సోదాలు నిర్వహించారు.ఇటీవల విడుదలైన మెర్శల్ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా డైలాగులు పెట్టడం వివాదస్పదమైంది. ఈ మాటలు తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మెర్శల్ చిత్ర యూనిట్‌కు ప్రతిపక్షాలు దన్నుగా నిలిచాయి. కమల్‌హాసన్, రజనీకాంత్ సహా సినిమా ప్రముఖులు మెర్శల్‌కు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాల్ కార్యాలయంపై జీఎస్టీ అధికారులు దాడి చేయడం సంచలనంగా మారింది. ‘మెర్శల్’కు అండగా నిలబడిన మిగతావారిపైనా దాడులు జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగులు పెట్టిన మెర్శల్ సినిమా పైరసీ కాపీని చూశానని హెచ్ రాజా ప్రకటించడంతో క్షమాపణ చెప్పాలని విశాల్ డిమాండ్ చేశారు. బాధ్యతగల పదవిలో ఉండి పైరసీ సినిమా చూడటానికి సిగ్గులేదా అని ఘాటుగా విమర్శించారు.
