అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీం ఇండియా స్టార్ బౌలర్ ఆశిష్ నెహ్రా ఎన్నోసార్లు తన బౌలింగ్‌తో టీమిండియాను ఆదుకున్నాడు. దాదాపు ఐదుగురు సారథులతో కలిసి ఆడాడు. 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై 23 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. 2004లో పాకిస్థాన్‌తో హోరాహోరీ మ్యాచ్‌లో భారత సారథి సౌరవ్ గంగూలీ సందిగ్ధంలో పడ్డాడు.
అప్పుడు ‘దాదా భయపడకు. నేను చూసుకుంటా’ అని అభయమిచ్చాడు నెహ్రా. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ ఒక వీడియోలో పంచుకున్నారు.‘2004లో జరిగిన ఆ సంఘటన నాకు గుర్తుంది. కరాచీలో భారత్, పాకిస్థాన్ చావోరేవో అన్నట్టు తలపడుతున్నాయి. తొలుత మేం 350 స్కోర్ చేశాం.
రెండో ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో తొమ్మిదో.. పదో పరుగులు చేస్తే పాక్ విజయం సాధిస్తుంది. అప్పుడు చివరి ఓవర్ ఎవరికివ్వాలని గంగూలీ సందిగ్ధంలో పడ్డాడు. ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నెహ్రా.. సౌరవ్ దగ్గరికొచ్చాడు. ‘దాదా నేను వేస్తా. నువ్వు భయపడకు. మ్యాచ్ గెలిచిపించి తీరుతా’ అని అన్నాడు. చివరి ఓవర్‌లో నెహ్రా మూడు పరుగులిచ్చి మొయిన్‌ఖాన్ వికెట్ తీసి అన్నట్టే విజయాన్ని అందించాడు’ అని బదానీ గుర్తుచేసుకున్నాడు.