ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడవనున్నారు. అందులో భాగంగానే ఏపీలో నవంబర్ 6న జగన్ పాదయాత్ర ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే ఎలాగైనా జగన్ పాదయాత్రను భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందా.. అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. జగన్ ఆరునెలలపాటు 13 జిల్లాలలో ప్రజాక్షేత్రంలో పర్యటనకు సిద్ధం కావడంతో టీడీపీలో గుబులు రేగుతుంది.
దాంతో పాదయాత్రకు బ్రేక్ వేసేందుకు కుట్ర చేస్తుందని మాజీ మంత్రి వైసిపి నేత ధర్మాన ప్రసాదరావు ఆరోపణలు సైతం చేశారు. నగరి ఎమ్యెల్యే రోజా సైతం ఇవే ఆరోపణలు చేశారు. శాంతి యుతంగా తమనేత యాత్ర సాగిస్తారని ఏ నియోజకవర్గానికి ఆ ప్రాంతంలోని పార్టీ కో ఆర్డినేటర్ లు పోలీసుల అనుమతి కోరతారని రోజా వెల్లడించారు. గతంలో వైఎస్ కానీ చంద్రబాబు కానీ అనుమతి లేకుండానే పాదయాత్రలు చేశారని వైసిపి సీనియర్ నేత అంబటి రాంబాబు సైతం గుర్తు చేశారు. తుని సంఘటనలు వంటివి జరుగుతాయని అంటున్నారని అప్పుడు ఇలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అని వారే ఒప్పు కున్నారని ఆయన విమర్శిస్తున్నారు.
రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఉద్యమాలు ఏవి శృతిమించకుండా పోలీసులు సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ పేరుతో చాలావరకు నిరోధించారు. ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని సైతం ఖాకీలు ఈ గైడ్ లైన్స్ పేరుతోనే నిరోధిస్తూ వస్తున్నాయి. ప్రస్తుత వైసిపి అధినేత పాదయాత్ర వ్యవహారం పై కూడా పోలీసులు ఇవే సాకులు చూపిస్తున్నారు. పోలీసులు తమ పని తాము చేసుకుంటున్నా జగన్ పాదయాత్ర నిరోధానికి టిడిపి ప్రయత్నాలు తీవ్రం చేస్తుంది అన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్లడం పసుపు పార్టీకి నెగిటివ్ తెచ్చి పెడుతుంది. వైసిపి కి టిడిపి భయపడుతుంది అని జనం లో చర్చ మొదలయ్యే అవకాశం కలుగుతుంది.
ఇదిలా ఉండగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిజిపికి లేఖ రాశారు. తన పాదయాత్రకు పోలీసులు తగిన బందోబస్తు ఇవ్వాలని కోరారు. ఆరునెలలపాటు సాగే యాత్ర రూట్ మ్యాప్‌ను పోలీసులకు తమ పార్టీ వర్గాలు అందిస్తాయని జగన్ లేఖలో పేర్కొన్నారు. జగన్ లేఖ తరువాత పోలీసుల స్పందన కోసం వైసీపీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పోలీసులు విధించిన షరతుల ప్రకారం అనుమతి కోరితే ఇవ్వాలని ముద్రగడ కేసులో హై కోర్ట్ పేర్కొన్న నేపథ్యంలో జగన్ యాత్రకు నో చెప్పే అవకాశాలు అతి తక్కువే. ఒక వేళ టీడీపీ యాత్రకు ఖాకీల ద్వారా చెక్ పెట్టాలని భావిస్తే జగన్ కోర్ట్ ద్వారా అనుమతి పొందితే ప్రభుత్వం మరింత నవ్వుల పాలు అయ్యే అవకాశం ఉండటంతో తమ యాత్రకు డోకా వుండబోదన్న ధీమాలో వైసీపీ వర్గాలు ఉన్నాయి. ఏది ఏమైనా జగన్ పాదయాత్ర ఏపీలో సంచనం రేపడం ఖాయమని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.