భారత్‌లాంటి ప్రజాస్వామ్య దేశంలో హింసాత్మక ఆందోళనలు, బెదిరించే ప్రకటనలు ఏమాత్రం ఆమోద్యయోగ్యం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. చట్టాలను తమ చేతిలోకి తీసుకొని ఇచ్చిమొచ్చినట్లు బెదిరింపు ప్రకటనలకు పాల్పడే హక్కు ఎవరికీ లేదని, అలాగే ఇతరుల మనోభావాలను కించపరిచే అధికారం కూడా ఎవరికీ లేదని చెప్పారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల సినిమాల్లో తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ కొందరు ఆందోళనలకు దిగుతున్నారని ‘పద్మావతి’ నిరసనల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. అయితే ఈ ఆందోళనలు కొన్ని సందర్భాల్లో అదుపుతప్పుతున్నాయని, ఇష్టమొచ్చినట్లు బెదిరింపు ప్రకటనలు, రివార్డులు ప్రకటిస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా అవార్డులు.రివార్డుల బాగోతాన్ని సైతం ఆయన తప్పుపట్టారు. ‘రివార్డులు ప్రకటించేవారి దగ్గర అంత డబ్బు ఉందో లేదో.. నాకు మాత్రం అనుమానంగా ఉంది. ప్రతి ఒక్కరు రూ. కోటికి తగ్గకుండా రివార్డు ప్రకటిస్తున్నారు. రూ.కోటి అంటే చిన్న విషయమా. ఇలాంటి విషయాలను, ప్రకటనలను ప్రజాస్వామ్యం ఆమోదించదు’ అని వెంకయ్యనాయుడు తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయన్నది ముఖ్యం కాదని, పార్లమెంట్ ఎన్ని రోజులు పనిచేసిందన్నదని ముఖ్యమని వెంకయ్యనాయుడు తెలిపారు.
Post Views: 170