తూర్పుగోదావరి జిల్లాలో మహాత్మా గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి మొదటి అడుగులు పడ్డాయి. ఈ దిశగా జిల్లాలో మొట్టమొదటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలివిడతగా మొత్తం 62 మండలాల్లో గ్రామ సచివాలయాలను అందుబాటులోకి తెచ్చారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 15కల్లా మిగిలిన సచివాలయాలను ప్రారంభించేలా ప్రభుత్వం త్వరితగతిన ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు ఏర్పాటు చేయడమేకాకుండా ఉద్యోగాలు పూర్తి స్థాయిలో నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలోని 62 మండలాల్లో 1,271 సచివాలయాలు ఏర్పాటవుతున్నాయి. వీటిద్వారా సేవలకోసం జిల్లావ్యాప్తంగా 13,097 పోస్టులకు ఇప్పటి వరకూ సుమారు 8వేల మందికి మెరిట్ ఆధారంగా నియామక పత్రాలు అందజేశారు. మిగిలిన 5,597 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది.
వీటిలో ఏఎన్‌ఎమ్, మెడికల్ అండ్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. రాతపరీక్ష ద్వారా పూర్తి పారదర్శకంగా నిర్వహించారు. ఈపరీక్షకు జిల్లాలో రికార్డుస్థాయిలో 2,06,211 మంది హాజరయ్యారు. ఎంపికైన వారిలో 60 శాతం మందికి సోమవారమే నియామక పత్రాలు అందించారు. మిగిలిన వారికి బుధవారం ఇవ్వనున్నారు. జిల్లాలో 14 రకాల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధంచేయగా, వైద్య ఆరోగ్య శాఖ మినహా మిగిలిన వాటి నియామక ప్రక్రియ పూర్తైంది. మార్కులు కలపడం తదితర సమస్యలున్న కారణంగా 1527 ఏఎన్‌ఎం, మెడికల్, హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ఆగింది. ఈసమస్యను త్వరలో పరిష్కరించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకోసం కొన్నేళ్లుగా నిరీక్షిస్తున్న పరిస్థితి నుంచి సొంతమండలంలో విధులు నిర్వర్తించే అవకాశం రావడంతో ఉద్యోగాలు సాధించిన వారి ఆనందానికి అవధుల్లేవు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అధికారంలోకి వచ్చిన నాలుగునెలల్లోనే ఇంత పెద్దఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయడం చారిత్రాత్మకమని చెప్తున్నారు.