ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ ఈసారి టిక్కెట్ల పంపిణీలో ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తున్నారు. తనకు నమ్మకంగానే ఉంటూ ద్రోహం చేసిన వైసీపీ ఎమ్మెల్యేల తీరును జగన్ టార్గెట్ చేశారని సమాచారం. గత ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ మీద గెలిచి అధికారంలోకి రాకపోవడంతో పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలను ఈసారి ఎలాగైనా ఓడించాలని జగన్ కసరత్తులు మొదలు పెట్టినట్టు సమాచారం. టిక్కెట్ కావాలని అడిగి తీరా గెలిచిన తర్వాత జంప్ అయ్యే వారిని ఇప్పటి నుంచే వడపోత చేయాలని ముఖ్య నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. వైసీపీ మీద నమ్మకంతోనూ, అభిమానంతోనూ ప్రజలు ఓట్లేస్తే అధికారం కోసం అర్రులు చాస్తూ అధికార పార్టీ వైపు వెళ్లిన ఎమ్మెల్యేల వ్యవహారాన్ని జగన్ ఇంకా మర్చిపోలేక పోతున్నారు.
ఇక పార్టీ కోసం తన వెంట పడిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విషయాన్ని ఈ సందర్భంగా కొందరు నేతల వద్ద ప్రస్తావించారు. జలీల్ ఖాన్ తనకు టిక్కెట్ కావాలని తనవెంట పడి, అధికారంలోకి రాకపోయేసరికి అవతల పక్షంలో చేరడమే కాకుండా తనపై వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారని ఇటువంటి స్వభావం ఉన్న నేతలను ముందుగానే పసిగట్టి వారిని దూరంగా ఉంచాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి కట్టుబడే ఉండేవారినే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఇందుకు వైసీపీ సీనియర్ నేతలతో పాటు.. వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కూడా సలహాలు కోరినట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికలకు యేడాదికి ముందుగానే అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను రంగంలోకి దించాలని చూస్తోన్న జగన్ ముందుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు 20 మందిపై బలమైన అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని భావిస్తున్నారు. ఈ 20 నియోజకవర్గాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పటికే రెండు మూడు సార్లు సర్వేలు చేసి ఇద్దరు ముగ్గురు బలమైన అభ్యర్థుల పేర్లను జగన్‌కు సూచించారు. మరి వీరిలో జగన్ ఎవరి పేర్లను ఈ 20 నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఫైనలైజ్ చేస్తారో చూడాలి. ఏది ఏమైనా తనను నమ్మించి మోసం చేసిన 20 మంది ఎమ్మెల్యేలను జగన్ టార్గెట్ చేశారని విశ్లేషకులు చర్చించుకుంటున్నారున