వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర సోమవారం నెల్లూరు జిల్లాలో వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. దీంతో వైసీపీ శ్రేణులు 74వ రోజున వాక్ విత్ జగనన్న అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. విదేశాల్లోనూ వైసీపీ అభిమానులు, ఆ పార్టీ జెండాలతో వాక్ విత్ జగనన్న అనే నినాదాలు చేస్తూ.., ఎక్కడికక్కడ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ వాక్ విత్ జగనన్న కార్యక్రమం అంచనాలకు మించి సూపర్ హిట్ అయ్యింది. వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వాక్ విత్ జగనన్న సూపర్ హిట్ అవుతోందనీ, ఢిల్లీలోనూ తాము నిర్వహించిన వాక్ విత్ జగనన్న అంచనాలకు మించి విజయవంతమయ్యిందని విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన వాక్ విత్ జగనన్న కార్యక్రమంలో పాల్గొన్న జనసందోహాన్ని చూస్తే, జగన్ వెంట ఏ స్థాయిలో జనం అండగా ఉన్నారో అర్థమవుతోందని విజయసాయిరెడ్డి చెప్పారు.
చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలపైనా వైఎస్ జగన్‌కి స్పష్టత ఉందనీ, పార్లమెంటు సమావేశంలో రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఇంకో వైపున వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.., ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజల్లోకి ప్రజా సంకల్ప యాత్ర ద్వారా వెళ్ళారనీ, జగన్ పట్ల నమ్మకం, విశ్వాసంతో ఆయన వెంట లక్షలాదిగా ప్రజలు నడుస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వమే ఆశ్చర్యపోయేలా ప్రజా సంకల్ప యాత్ర జరుగుతోందనీ, ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్‌కి ఏం చేయాలో అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారాయన. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమన్న వైవీ సుబ్బారెడ్డి, పార్టీ ఫిరాయింపులు సహా ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబు, ప్రజల గుండెల్లోంచి వైఎస్ జగన్ ఇమేజ్‌ని చెరిపేయలేరని చెప్పారు.