ప్రతిష్టాత్మక వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల జల్లు కురిసింది. ఈ కార్యక్రమం నిర్వాహణ మొదలుకొని సదస్సు జరుగుతున్న సందర్భంగా ఆయన పలు సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతున్న తీరుపై పలువురు కితాబు ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంత్రి కేటీఆర్ ప్రసంగం ముగిసిన అనంతరం ఆయన్ను వేదిక వద్దే ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమానికి కీలక సమన్వయకర్తగా వ్యవహరించిన నాస్కాం చైర్మన్ సీపీ గుర్నానీ తన ప్రారంభ ఉపన్యాసంలో ‘తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి కేటీఆర్ సహాయం లేకపోతే..ఇంత ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నాస్కాం విజయవంతంగా నిర్వహించలేకపోయేది. దేశంలో మొట్టమొదటి సారిగా ముంబైలో కాకుండా వేరే నగరంలో అది కూడా హైదరాబాద్‌లో నిర్వహించేందుకు మంత్రి కేటీఆర్ కారణం’ అని అన్నారు. ప్రఖ్యాత సేల్స్‌ఫోర్స్ సంస్థ సీఈఓ అయితే ప్రత్యేక ట్వీట్ ద్వారా కొనియాడారు. ‘మంత్రి కేటీఆర్‌ను కలవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’ అని ట్వీట్ చేశారు. కాగా, మంత్రి కేటీఆర్ ప్రసంగం అనంతరం పలు కంపెనీల ప్రతినిధులు ఆయనపై ప్రశంసలు గుప్పించారు.